ఔనా..? నిజమేనా..? అవి లతా మంగేష్కర్ చివరి మాటలేనా..? ఇవీ ప్రశ్నలు… ఎందుకంటే… రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలోనే కాదు, కొన్ని మీడియా సంస్థలు కూడా లతా మంగేష్కర్ చివరి మాటల వైరాగ్యం అని కథనాలు రాస్తున్నయ్, ఏవేవో చూపిస్తున్నయ్… నిజంగా ఆమె మాట్లాడిన మాటలేనా అవి..? ఎవరితో..? ఎవరు వెల్లడించారు ఈ మాటల్ని బయటికి..? ఆ వివరాలు మాత్రం ఏమీ కనిపించవు… ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా షేర్ చేసేయడం, అబ్బ, ఎంత బాగా చెప్పింది సుమా అనుకోవడం… ఆ పోస్టు ఇదుగో, ఓసారి చూడండి…
‘‘ఈ లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు. అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గేరేజ్‌లో ఉంది. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాదరక్షలు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని ఉన్నాను.
నా బ్యాంకు అకౌంట్‌లో చాలా డబ్బు ఉంది. కానీ నాకు ఇప్పుడు అది ఉపయోగం లేదు. నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది. కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న పడక మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు అన్నింటికీ ప్రయాణం చేసేదాన్ని. ఆసుపత్రిలో ఆ టెస్ట్‌కు, ఈ టెస్ట్‌కు ల్యాబ్‌లకు మారి మారి వెళ్లుతున్నాను. ఆనాడు నిత్యం శిరోజాలంకరణ వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు.
Ads
ప్రసిద్ధి చెందిన హోటళ్లలోని ఆహారం తింటూ ఉండే దానిని. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచమంతా తిరిగేదాన్ని. కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్లడానికి ఇద్దరూ అటెండర్లు సాయం చేస్తూ ఉన్నారు. నా సంపద, వసతులు ఏవీ నాకు సహాయపడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి జీవితం. ఎవరికీ ఏ సాయం చేయలేని ధనం, ఆస్తులు, పదవీ ఉన్నా అంత్య దశలో ఉపయోగపడని వాటికి విలువ ఇవ్వకండి. ముఖ్యంగా మంచి మనస్సు ఉన్నవారికి విలువ నిచ్చి అందరికీ స్నేహం, ఆప్యాయత ప్రేమ చూపించండి’’
పదేళ్ల క్రితం నుంచీ దాదాపు ఇవే మాటలు యాపిల్ సంస్థ ఒకప్పటి ఛైర్మన్ స్టీవ్ జాబ్స్ పేరిట కనిపిస్తూనే ఉంటయ్… పలు ఫ్యాక్ట్ చెక్ మీడియా ఆర్గనైజేషన్స్ అవన్నీ ఫేక్ ప్రచారాలుగా తేల్చినా సరే, ఇప్పటికీ అక్కడక్కడా స్టీవ్ జాబ్స్ పేరిట షేర్ అవుతూనే ఉంటయ్… ఇప్పుడు ఎవరో లతా మంగేష్కర్ చివరి మాటల పేరిట ఓ ఎమోషనల్ పోస్టు రాస్తే, ఇక పలు భాషల్లోకి అనువదించేసి, సోషల్ మీడియా యాక్టివిస్టులు సర్క్యులేట్ చేస్తున్నట్టుగా ఉంది…
జాతీయ స్థాయి పత్రికలు గానీ, టీవీలు గానీ, న్యూస్ సైట్లు గానీ ఈ ప్రచారాన్ని పట్టించుకోలేదు, అసలు ఈ వార్త జోలికే పోలేదు… కానీ రెండుమూడు మెయిన్ స్ట్రీమ్ చిన్న తెలుగు పత్రికల్లో మాత్రం యథాతథంగా ప్రచురించడం ఆశ్చర్యకరమే… ఆమె పోస్ట్ కరోనా సమస్యలతో కన్నుమూసింది… మరి శిరోజాలు రాలిపోవడం ఏమిటి..? కీమోథెరపీ ఏమీ కాదుగా…!! కాకపోతే ఆమె పేరు వాడుకుంటున్నా సరే, ఎవరు ముందుగా రాశారో గానీ, ఆ మాటలు మాత్రం బాగున్నయ్…
(pic :: satish acharya)
తొంభై రెండేళ్ల వయస్సు కాబట్టి, పోస్ట్ కరోనా ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోలేకపోయిందని డాక్టర్లు చెబుతున్నారు… బ్రీచ్ కాండీ హాస్పిటల్ డాక్టర్ ప్రతీత్ సందానీ ఆమె చివరిరోజు గురించి చెబుతూ ఏమంటాడంటే..? ‘‘చివరి క్షణాల్లో కూడా ఆమె మొహంపై చిరునవ్వును చూశాను, మరిచిపోలేను’’… ఇవి సరేగానీ, ఇంతకీ ఆమె చివరి వాయిస్ రికార్డు ఏది..? అనుపమ్ ఖేర్ షేర్ చేసుకున్నాడు… ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం ఏర్పాటు చేసిన ఓ కమిటీ గత డిసెంబరులో ఓ జూమ్ భేటీ ఏర్పాటు చేసింది… అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో రికార్డయింది…
लता जी का भगवद्गीता के श्लोक को गाते हुए आख़री संदेश; 22/12/2021 की दोपहर zoom पर आज़ादी का अमृत महोत्सव कमेटी की दूसरी मीटिंग में जब लता जी की बोलने की बारी आयी तो फ़ैन होने के नाते मेरा दिल किया की मैं उनकी आवाज़ रिकार्ड कर लूँ! सुनिये! क्या बोली थीं विश्व की महान गायिका!🕉🙏🇮🇳 pic.twitter.com/arJXxohgUN
— Anupam Kher (@AnupamPKher) February 6, 2022
కొన్ని వేల పాటల్ని ఆలపించిన ఆమె చివరి పాట ఏది..? ఇదీ చాలామందికి ఆసక్తికరమైన ప్రశ్న… సినిమా పాట కాదు, కానీ ముఖేష్ అంబానీ బిడ్డ ఇషా పెళ్లి కోసం లత మంగేష్కర్ గాయత్రిమంత్రాన్ని ఆలపించింది… ఆ శుభాకాంక్షల వీడియో యూట్యూబ్‌లో కూడా ఉంది… అంతే… తరువాత ఆమె ఆలాపన మరి వినిపించలేదు…
Share this Article