ఇదీ సోషల్ మీడియా సంవాదాల నడుమ దొరికిందే… నవ్వాలా, జాలిపడాలా, విరక్తితో వదిలేయాలో అర్థం కాదు… విషయం ఏమిటంటే…? ఒక వార్త వచ్చింది… ఓ సర్కారీ టీచర్ పీఆర్సీ వల్ల జీతం తగ్గిందని, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం కూలీగా మారాడు అనేది ఆ వార్త సారాంశం… అయ్యో, అయ్యో, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ కూలీగా మారాడు దేవుడోయ్, హేమిటింత అన్యాయం బాబోయ్ అన్నట్టుగా ఆ వార్త కనిపించింది… ఇదీ ఆ వార్త… (ఆంధ్రజ్యోతి సైటులో కూడా కనిపించింది)…
కరోనా సమయంలో వేల మంది ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు బజారున పడ్డారు… నిజంగానే చితికిపోయాయి కుటుంబాలు… రోడ్డున పడి దొరికిన పనల్లా చేస్తూ బతకడానికి నానా కష్టాలూ పడ్డారు… ఇప్పటికీ అలాగే ఉంది… వాళ్ల బతుకు కష్టాల గురించి ఎవరూ రాయరు… ఇంతటి ఆర్థిక దురవస్థలోనూ రెగ్యులర్‌గా జీతాలు తీసుకునే సర్కారీ టీచర్ వెటకారంగా ‘నేను కూలీగా మారాను’ అని చెబితే, దాన్ని వార్తగా రాసి, ఫోటో తీసిన సదరు పత్రికకు కోటి నమస్కారాలు…
Ads
మిగతా సమాజం మొత్తం ఏమైపోయినా పర్లేదు, జీతాలు పెంచాల్సిందే, అది మా హక్కు అని నినదిస్తున్న సర్కారీ ఉద్యోగుల తీరు చూస్తున్నాం కదా… సర్కారు మెడ మీద కత్తి పెట్టి, మాతో పెట్టుకుంటే పోతావు, నాశనమైపోతావు అన్నట్టుగా మాట్లాడిన వారినీ చూశాం… అసలు ఆటోవాళ్లకు, వితంతువులకు, వృద్ధులకు డబ్బులు ఎవడు ఇవ్వమన్నాడు, అది ఎవడబ్బ సొమ్ము అని సంధి ప్రేలాపనలకు దిగిన వాళ్లనూ చూశాం…
సరే, పీఆర్సీతో జీతాలు పెరగకపోతే పోనీ, జీతాల్లో కోతలు ఏమిటో ఆ జగనన్నకే తెలియాలి… ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకే తెలియాలి… ఠాట్, అంతా బాగానే ఉంది, ఎవరికీ జీతాలు తగ్గడం లేదు అంటుంది ప్రభుత్వం… మా ప్లే స్లిప్పులు చూసి చెప్పండి అంటారు జీతాల్లో కోతలు పడ్డ ఉద్యోగులు… ఆ చర్చను, అందులో అన్యాయాన్ని కాసేపు పక్కనపెడితే… నిజంగా సర్కారీ ఉద్యోగులు కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఉందా..? సగటు సర్కారీ ఉద్యోగి చేస్తున్న పనెంత..? వస్తున్న జీతమెంత..?
ఈ వార్తను చూశాక సాక్షికి చిరాకెత్తినట్టుంది… సహజమే కదా, మా జగనన్నను బదనాం చేస్తారా..? బురద జల్లుతారా అని ఇంకో కోణంలో నరుక్కొచ్చింది… ఆ వార్త కూడా చదవండి ఓసారి…
సదరు టీచర్ భార్య కూడా టీచరేనట… ఇద్దరికీ కలిసి లక్షన్నర వస్తాయట… ఆయనకు ఇద్దరు భార్యలట… గతంలో ఆయన మీద లైంగిక వేధింపులు ఆరోపణలున్నాయట… ఇలా సాక్షి ఫుల్లు అటాక్ చేసింది… ఆంధ్రజ్యోతి వాడు ఏదో దిక్కుమాలిన వార్త రాశాడు సరే, మరి సాక్షి ఆయన వ్యక్తిగత జీవితం మీద ఇలా దాడి చేయడం కూడా ఎందుకో బాగనిపించలేదు… వదిలేయాల్సింది, జ్యోతి వార్త చదివినవాళ్లను నవ్వుకుని, ఆ పత్రిక మీదే జాలిపడతారు కదా…!! నిరసన వ్యక్తీకరణ ఆ టీచర్ హక్కు, ఎవరూ కాదనరు, కానీ మరీ అంత సంపాదన, ఆస్తులు ఉన్న వాళ్లు కూడా… పీఆర్సీ నష్టాల భర్తీకి కూలీ పనులకు వెళ్తున్నట్టుగా ఆ వెటకారపు ఫోటోలు ఏమిటి..? ఎవరి కళ్లకు గంతలు కట్టడానికి..? సో, ఈ మొత్తం వ్యవహారంలో టీచర్, జ్యోతి, సాక్షి అన్నీ దారితప్పినట్టుగా అనిపించింది…
అవునూ… ఈ సారు గారు బోధించేది ఏమిటో తెలుసా..? హిందీ అట…!! అసలు మన సమాజానికి ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే హిందీ బోధన అవసరమా..? హిందీ టీచర్లు అవసరమా..? వాళ్లకు జీతాల్ని ఈ సొసైటీ భరించడం అవసరమా..? దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి హిందీ ఉపయోగపడుతుంది అనే సమర్థన ఉంటే సరే… కానీ అదేదో ఇంటర్‌లో ఓ సబ్జెక్టుగా పెట్టేస్తే సరిపోదా..? బాల్యం నుంచే దాన్ని రుద్దుడు దేనికి..? ఈ ప్రశ్నల మీద సర్కారు దృష్టి సారించాల్సింది…!!
Share this Article