మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… బుల్లితెర చానెళ్లు, ఓటీటీలు అకస్మాత్తుగా మ్యూజిక్ షోల మీద పడ్డయ్… గాయకుల కోసం జల్లెడ పడుతున్నయ్… నిజానికి వాటికి పెద్దగా రేటింగ్స్, వ్యూస్ ఉండవ్… యాడ్స్ ఉండవ్… స్పాన్సర్లూ తక్కువే… అయితేనేం… ఇప్పుడు ట్రెండ్ మ్యూజిక్… అదీ కొత్త గొంతులు కావాలి… ఆల్‌రెడీ ప్రూవ్ చేసుకున్నవాళ్లతో సినిమా పాటలు పాడించే స్వరాభిషేకం టైపు షో కాదు… కొత్త గొంతుల్ని తీసుకొచ్చి, పోటీకి నిలబెట్టాలి…
జీటీవీలో వచ్చే సరిగమప అదే… ప్రదీప్‌ను తీసేసి శ్రీముఖిని పెట్టారు… పెద్ద ఇంప్రెసివ్‌గా లేదు షో… కానీ ఓ మోస్తరుగా సాగుతోంది…. పాడేవాళ్లలో ప్రతిభ ఉంది, కానీ జడ్జిలు ప్లస్ మెంటార్లు ప్లస్ హోస్ట్… వీళ్ల సంఖ్యే ఎక్కువైపోయింది… అట్టహాసం ఎక్కువ, అసలు సరుకు తక్కువ… మ్యూజిక్ షోల మీద ఇంకా ఈ చానెల్‌కు కొత్త ప్లాన్లు ఏవో ఉన్నట్టున్నయ్ కూడా…! ఇక ఈటీవీలో ఎప్పుడూ మ్యూజిక్ షో ఉంటుంది… బాలు ఉన్నప్పుడు టాప్ రేంజులో ఆకట్టుకునేవి… ఇప్పుడు నాసిరకంగా ఉన్నా సరే… చూసేవాళ్లు చూస్తుంటారు… ఈటీవీ సినిమాలో స్వరాలవీణ వస్తుంది…
Ads
ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న మ్యూజిక్ కంపిటీషన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా… అదేనండీ ఇండియన్ ఐడల్ తెలుగు… థమన్, నిత్య మేనన్, కార్తీక్, శ్రీరాంచంద్ర నిర్వహిస్తున్న ఈ షో కాస్త బాగానే ఉంది… ఇంకొన్ని కొత్త షోల గురించి చెప్పుకోవాలి… ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..? సినిమాల్లో ఓ ఫోక్ సాంగ్ పడాల్సిందే… అదీ తెలంగాణ ఫోక్ అయితే హిట్టే… ఈమధ్య పుష్ప తరువాత చిత్తూరు స్లాంగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది…
ఇప్పుడు టీవీ రియాలిటీ షోల నిర్మాతల దృష్టి జానపదాలపై పడింది… గతంలో మాటీవీలో రేలారేరేలా ప్రోగ్రాం వచ్చేది, పల్లెపాటకు పట్టాభిషేకం చేసిన అభిరుచి అప్పుడు… తాజాగా ఎన్‌టీవీ అనుబంధ స్త్రీ ఛానెల్ వనిత టీవీలో అదే శ్రీముఖి హోస్ట్‌గా ఓ ఫోక్ మ్యూజిక్ ప్రోగ్రాం తీసుకొస్తున్నారు… ప్రోగ్రాం పేరే సారంగదరియా… గతంలో కూడా ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ వంటివి చేసినందున శ్రీముఖికి పాటల పోటీల హోస్టింగ్ పెద్ద కథేమీ కాదు…
ఈమధ్య ఎక్కువగా విస్తరించే ప్లాన్లలో ఉన్న సుమన్ టీవీ వాళ్లు మధుప్రియతో బతుకుపాట అని ఓ షో చేయనున్నారు… అదీ జానపదమే… జానపదం నా ప్రాణపదం అంటూ ఓ ప్రోమో వదిలారు ఆల్‌రెడీ… ఇవి గాకుండా సోనీ లివ్ వాళ్లు జానపద పాటలతోనే ఓ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారు… కాకపోతే అది హోస్ట్, యాంకర్, జడ్జిలు, మన్నూమశానం గాకుండా నేరుగా ఆల్బమ్ తరహాలో ఉంటుందట… సో, సుమన్ టీవీ, సోనీ లివ్, వనిత టీవీ… అన్నీ జానపదాలే… ఆగండాగండి… మరో అప్‌డేట్ ఉంది…
ఉదయభాను తెలుసు కదా… ఒకప్పటి ఫేమస్ యాంకర్… సుమకన్నా సీనియర్ కావచ్చు బహుశా… చాన్నాళ్లు తెరకు దూరమైంది… ఈమధ్య అడపా దడపా కనిపిస్తోంది… గతంలో రేలారేరేలా జానపదాల షోను మాటీవీలో భలే నిర్వహించింది… ఇప్పుడు సెకండ్, థర్డ్ ఇన్నింగ్స్ కూడా తనకు బాగా అచ్చొచ్చిన ఫోక్ షోతో స్టార్ట్ చేయాలని భావిస్తున్నదేమో… ఈటీవీ కోసం తనే యాంకర్‌గా, తనే నిర్మాతగా ఓ షో ప్లాన్ చేస్తోంది… మంచిదే… ఆ తప్పుల్ తప్పుల్ తాళాల స్వరాభిషేకంకన్నా నయమేగా…
అయితే ఇక్కడ ఓ చిక్కు ప్రశ్న… ఓటీటీలను వదిలేద్దాం… పాడుతాతీయగా, సరిగమప కూడా వదిలేద్దాం… ఒకటి ఈటీవీ సినిమాలో, మరొకటి వనిత టీవీలో, ఇంకొకటి సుమన్ టీవీలో… సుమన్ టీవీని వదిలేస్తే… ఈటీవీ సినిమా, వనిత టీవీల్లో దేనికి..? మెయిన్ స్ట్రీమ్‌లో ప్రసారం చేయొచ్చు కదా… గాయకులకు పాపులారిటీ, ప్రోగ్రాములకు ఆదరణ, యాడ్స్, డబ్బులు, రేటింగ్స్ కూడా దక్కుతాయిగా… అవునూ… మస్తు సాధనసంపత్తి ఉన్న మాటీవీకి మ్యూజిక్ షోలు ఎందుకు చేతకావడం లేదు..?! సూపర్ సింగర్ జూనియర్స్ అని స్టార్ట్ చేస్తోంది, కానీ దానికి జనం ఆదరణ వేచి చూడాలి… ఇవి గాకుండా ప్రైవేట్ యూట్యూబ్ ఆల్బమ్స్ సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగింది… మొత్తానికి ఎన్నెన్నో కొత్త గొంతులు… కొత్త స్వరాలు… దుమ్మురేపడమే…!!
Share this Article