ఎంత మంచిగ రాసిండు సారు… మనం గప్పట్ల ఆన్యపు కాయల గురించి చెప్పుకున్నం కదా… ఏక్ దమ్ జబర్దస్త్ కాయగూర అది… ఇంటింటినీ అర్సుకునేది… గట్లనే రాములుక్కాయలు గూడ… పోనీ, రామ్ములక్కాయలు అందాం… వాటి మీద Sampathkumar Reddy Matta… రాసిన రామసక్కదనపు రాములుక్కాయలు పోస్టు చదువుతుంటే… నిఝంగ సకినాలకు, సర్వపిండికి, మక్క గట్కకు, పజ్జొన్న రొట్టెకు రామ్ములక్కాయల అంటుపులుసు అంచుకు పెట్టుకున్నట్టే అనిపిస్తంది… చెప్పుడు దేనికి..? మీరే చదువుకోండ్రి… ఇదుగో… సారుకు శనార్తులతో…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పులినిజూసి, నక్కవాతలువెట్టుకున్నట్టు–
రాముల్కల పుల్లదనం టమాటలకు ఎక్కడుంటది..?
ఏమి ఎయ్యకున్న ఏంలేదు, గింతాంత నూనెబొట్టు
ఉప్పు, గంటెడు మిరుప్పొడి, ఎల్లిపాయలుంటే.. సాలు.
దానికదే ఎసరువూరి, పులుసు ఎంత కమ్మగుంటది..!
జెరమచ్చిన బంక నాలుకకుగుడ మల్ల రుచివుట్టిస్తదంటె
నాలుకకు రుచివుడితె, ఆర్నెల్లబలం ఎన్కకు వచ్చినట్టేగద.. !
మక్కగటుక, నూకలబువ్వ, కొత్తబియ్యపు మెత్తటిబువ్వ,
అట్లు, పిట్లు, రొట్టెలు, కుడుములు.. వేటితోటైనా.. సై !
అబ్బో.. దేనితోటి జతగడితె,, దానికోసమే పుట్టినట్టేనాయే !
దగ్గరికి వండిన రాములక్కాయ కూరంటె మాటలామరి !
కంచం నాక్కతిని, కడుక్కతాగెటొళ్లను చూస్తెనే తెలుస్తది.
ఎనుకటొళ్లు గివి తినే,, చిట్టెపురాళ్ళలెక్క గట్టిగున్నరుగాదు.
రాముల్క చెట్లగుణమే.. మా దండి మొండిగుణం..!
ఒక్క గింజ భూమ్మీద పడితే.. ఇగ చావులేదనుకోండ్రి.
మందులుమాకులు ఎవ్వద్దు. నీళ్లు, ఎద్దడైనా ఓర్సుకుంటది.
పందిరెలుపు పరుచుకోని, నిజంగ బండెడు కాయలుగాస్తది.
గుత్తులుగుత్తులు తెంపిపొయ్యలేక మనకే యాష్టకస్తదిగని
చెట్టుకు పూసుటానికి, కాసుటానికైతే.. యాష్టలేదు, గజ్జికాత !
మా.. మిరుపచేండ్ల, మక్క పెరట్ల, పల్లిచేండ్ల, పసుపుల...
పీకేసినకొద్ది మొలిచిన చెట్లే, చేనంత ఇసురుక పొయ్యేటియి.
కైకిలొళ్లకు, పనిపాటలొళ్లకు, దారెంట వొయ్యటొళ్లకు...
ఎవలకువడితెవాళ్లకు తెంపుకపొయినన్ని రాముల్కలు.
నీళ్లుగట్టంగ కాళ్లకిందవడి.. సగంపండ్లు సతికిపొయ్యేటియి.
చూడబుద్ధిగాగ.. రెండుమూడు నోట్లేసుకునుడు మామూలె.
వట్టిగవోతున్నయని, అమ్మో బాపో.. ఎప్పుడో ఖాళిగున్నప్పుడు
రాముల్క పండ్లన్నితెంపి, పిండి.. పరుపు బండమీద పోద్దురు.
అప్పుడిప్పుడు పోసినయే-- ఇరుస గంపెడన్ని వరుగులైతుండె.
కాగునిండ నింపిపెట్టి, ఎండకాలంల పంచిపెట్టుడు వాళ్లకో తుర్తి .
పిడికెడన్ని రాముల్క వరుగులు ఉడుకునీళ్లల్ల నానవెట్టి,
ముత్తెమంత చింతపండు పులుసువోసి.. అంటుపులుసువెడ్తే
మూడుపూటలు తిన్నా.. ఇంకా కూరమీద బుద్ధిదీరకపోతుండె.
ఎండతాపాన్ని తగ్గించే రాముల్కలు.. కడుపుకెంత చల్లదనం..!
నడుమంత్రపు సిరి - నరం మీది పుండు అన్నట్టుగ--
తరువాత తరువాత రాములక్కాయలు మోటయిపాయె.
తిన్నొళ్లను.. ఎడ్డిమనుషుల తీర్గ చిత్రచిత్రంగ చూసిరి.
ఎన్నో ఇత్తనం గట్టినా.. రాముల్కలకు ఆ రంధన్నదే ఉండకపోవు
తీసేసినా, కోసేసినా.. వాటికవే మల్ల చేన్నిండార మొలుస్తుండె.
ఇప్పుడు తీరొక్కమందులు కొట్టికొట్టి, ఇత్తనం నడి గంగలగలిసె !
చెర్లనీళ్లన్నివొయి చెరువెనుక వడ్డంక--
ఈ రోజులల్ల మల్ల రాముల్కల మీద మనసువెట్టవట్టిరి.
ఏడవున్నయంటె ఆడికివొయి తిరిగితిరిగి తెచ్చుకుంటండ్రు
పైసకు ఎన్కకు వోతుండ్రా..ఎంత రేటువెట్టయినా కొంటండ్రు.
నెలదప్పిన ఆడొల్లకంటె.. ఎక్కువ భమతోటి వండుకుంటండ్రు.
పావెడుకాడ రెండంతలనూనెవోసి, అరొక్కతీరు మసాలలేసి
ఆవిరివోవద్దని మూతులుబిగిచ్చి, వగలవంటలు వండవట్టిరి.
ఎంతజేసినా.. ఏం లాభమున్నది ? గడ్డి దిన్నట్టే ! అదో కూరనా..!
అయ్యో ! ఏడవోతివే... రామచక్కదనపు రాముల్క పులుసా..?
అని.. పెద్దలువోయినంత దుఃఖ పడుతండ్రు. చిత్రంగాకుంటే,
పెసరుచేండ్ల పోగొట్టుకోని, పప్పటికెల దేవులాడినట్టున్నది కథ !
చెప్పుకుంటె మానంబోతది - చెప్పకుంటె పానంబోతదని--
మన మనుసులకెన్నటికన్న బుద్ధిగ్యానం.. తిరిగి వస్తదంటరా..?
తాను కూసున్నకొమ్మనే తెగనరుక్కోని.. గిట్లనే సస్తరంటరా..?
Share this Article
Ads