కేసీయార్… యాదగిరిగుట్టను డెవలప్ చేసిండు… ఇంగ ఎములాడను ఉద్దరిస్తా అంటుండు… గట్లనే కొండగట్టు అంజన్న గుడినీ డెవలప్ చేస్తడట… జిందగీల ఇంగ ముచ్చింతల్ సమతా మూర్తి దిక్కు పోడు… భద్రాచలం పట్టించుకోడు… ఎందుకో తెల్వదు… బీజేపోళ్లను ఎక్కడికీ రానియ్యడు… కనీ వాళ్లు ఊకుంటరా..? కేసీయార్‌కు పట్టనివి వాళ్లు పట్టించుకుంటరు… చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దిక్కు కేసీయార్ అస్సలు పోడు, గుంజుకపోయినా రాడు…
బీజేపోళ్లు పోతరు… ఎన్నికలొస్తే కంపల్సరీ పోతరు… బండి సంజయ్ బండి తాపతాపకూ అటే ఉరుకుతది… అట్లనే ముచింతల్ ఆశ్రమాన్ని హైజాక్ చేసేసిండ్రు కదా… ఇక వాళ్ల కన్ను భద్రాచలం రాముడి మీద పడ్డది… టీఆర్ఎస్‌ల కొందరున్నరు… అయోధ్యను తిట్టిపోసిండ్రు గా నడుమల… మా భద్రాచలం అని మైకుల ముందట మస్తు చెప్పిండ్రు… ఒవ్వలూ ఒక్క పైస కూడా ఇచ్చింది లేదు, ఆ రామభద్రుడికి ఒరిగిందీ లేదు…
యాదగిరిగుట్టను పూర్తిగా టీఆర్ఎస్ ధర్మక్షేత్రంలెక్క చేసిండ్రు కదా… ఇంగ అటు పోతలేరు బీజేపోళ్లు… వచ్చే శ్రీరామనవమి, సీతారామకల్యాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పట్టుకొచ్చి, భద్రాచలంల పట్టుబట్టలు పెట్టిస్తరట… తరువాత భాగ్యలక్ష్మి టెంపుల్‌కు కూడా పోతడట… అవన్నీ సరే… ఈ వార్త నిజమే అయితే కాస్త ఇంట్రస్టింగు అనుకోవాలి… ఎందుకంటే..?
Ads
నిజానికి భద్రాచలం గుడికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో ముత్యాల తలంబ్రాలు పంపిస్తది… ఆ వొంతెన నిజాం జమానా నుంచీ ఉంది… దాని వెనుక ఓ కథుంది… సుపరిపాలన వ్యూహం ఉంది… ఆ కథ జోలికి మనం ఇప్పుడు పోతలేం… కానీ ఇక్కడ గద్దె మీద ఉన్న ప్రభువు కేసీయార్ కాబట్టి తను ఆ ముత్యాల తలంబ్రాలు తీసుకపోవాలె… కానీ పోడు, భద్రాచలం రాముడి మీద భక్తి లేదు, ప్రేమ లేదు… ‘‘నీ పేరే పెట్టుకున్న, మావోడిని ముఖ్యమంత్రిని చేద్దమనుకుంటన్న… తనకేమో దేవుళ్లు పెద్దగా నచ్చరు… ఇగ నువ్వే దయజూపాలె..’’ అని ఓసారి దండం పెట్టుకుని రావొచ్చు కదా… పోడు..!
ఇగ ఇప్పుడు అమిత్ షా వొస్తడట… పట్టుబట్టలు ఎవరైనా పెట్టొచ్చులే గానీ… హస్తిన ప్రభుత్వం తరఫున సమర్పిస్తడా..? అట్టయితే కొత్త వొంతెన (ఆనవాయితీ) షురువు చేసినట్టయితది… దానికి కేసీయార్ ఒప్పుకుంటడా…? కాదనలేడు, ఔననలేడు, అడ్డుకోలేడు, ఆహ్వానించలేడు… అమిత్ షా వస్తే గవర్నరమ్మ కూడా పోతది… ఆమె అంటే పడతలేదు కదా, ఇగ అటువైపు కూడా అస్సలు పోడు కేసీయార్… నిజానికి మోడీ వొస్తే కథ వేరే ఉంటది… బీజేపోళ్లు, టీఆర్ఎస్ వాళ్లు గిట్ల గుళ్లను పంచుకుంటంటే… కాంగ్రెసోళ్లు ఏం చేయాలె..? సమ్మక్క-సారలమ్మ లెక్క అసల్ సిసల్ జనం దేవతల గుళ్లను పట్టుకోవాలె… మొన్న సమ్మక్క జాతరకు కేసీయార్ పోలేదు కూడా…
ఆలంపూర్ జోగులాంబ గుడి కూడా ఉద్దరించేవాళ్లెవరు అని ఎదురుచూస్తంది… కాలేశ్వరం వైపు ఎలాగూ కేసీయార్ రానియ్యడు… ధర్మపురి గుడి కూడా కాస్త బెటరే… దానికీ పైసలు కావాలె… ఇవన్నీ సరేగనీ… సీతారామ కల్యాణానికి వస్తే వస్తివి గనీ… అమిత్ షా వారూ, ఉత్తగనే వొచ్చిపోతే ఏం బాగుంటది..? అయోధ్య సర్క్యూట్ అని పెట్టి, రామేశ్వరం నుంచి భద్రాచలం మీద నుంచి, ఇటు హంపీ (కిష్కింధ) మీదుగా అయోధ్య దాకా ఓ కారిడార్ డెవలప్ చేయొచ్చు కదా… అయోధ్యకూ మస్తు జనం వొస్తరు… పోనీ, వీలయితే నేపాల్ హద్దుల్లో ఉన్న మిథిల దాకా పొడిగించొచ్చు… ఏమంటవ్…!?
Share this Article