మొన్నామధ్య ఎవరో కలంవీరుడు అపరిమితమైన ఆనందభక్తివిశ్వాసాలు తాండవిస్తుండగా… రాజమౌళి వైపు అత్యంతారాధనగా చూస్తూ… జక్కన్న కాలంలో జర్నలిస్టుగా పుట్టడం ఈ జన్మకే అదృష్టం అని పులకరించి, పరవశించిపోయాడు… చాలామంది పకపకా నవ్వుకున్నారు… జర్నలిజం మరీ ఈ స్థాయికి పడిపోయిందా అని బోలెడుమంది బాధపడ్డారు… ఇక చరిత్రలో ఇంతకుమించిన దరిద్రపు ప్రెస్‌మీట్ ఇంకొకటి ఇప్పట్లో రాకపోవచ్చునని కూడా బొచ్చెడుమంది ఈసడించుకున్నారు… ఎందుకు..?
అతి… ఓవర్… టూమచ్… ఆంధ్రజ్యోతి పత్రిక, నవ్య పేజీలో మహేశ్ బాబు బిడ్డ సితారతో చేసిన ఇంటర్వ్యూ చూడగానే జక్కన్న జర్నలిస్టు ఎపిసోడే యాదికొచ్చింది హఠాత్తుగా… ఎస్, సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక భక్తిప్రపంచం… దేవుడు అన్నిచోట్లా తను ఉండలేక హీరోలను, వాళ్ల కుటుంబసభ్యులను పంపించినట్టుగా… ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కడూ వాళ్లకు వంగి వంగి దండాలు పెట్టాలి… తోచినరీతిలో కీర్తనల్ని ఆలపించాలి… అనువైనచోట భజన అందుకోవాలి… భక్తి, ప్రేమ, ఆరాధనలుగా పైకి కనిపించే ఓరకమైన అవకాశవాద దాస్యం…
సరే.., పెద్ద పెద్ద దిగ్దర్శకులే తలలు వంచుకుని, మనసులు చంపుకుని, తమను తాము దిగజార్చుకుని… పిల్ల హీరోలు, వాళ్ల కుటుంబసభ్యులకు సలాములు కొడుతుంటే ఇండస్ట్రీలోని చిన్నచిన్నవాళ్లను అనడం దేనికిలెండి… కానీ జర్నలిస్టులకు ఈ దుర్గతి దేనికి..? రాజకుటుంబంలో అప్పుడే పుట్టిన పసిపాపకు కూడా ఎనలేని గౌరవప్రపత్తులు, పొగడ్తల కైదండలు… పాప గారూ వంటి పిలుపులు తప్పనిసరి… అవును మరి, సినిమా హీరోల కుటుంబాలు కూడా రాజకుటుంబాలే కదా… వాళ్లకు ఏం తక్కువ..? ఈ ఇంటర్వ్యూయే దానికి ప్రబల నిదర్శనం…
Ads
ఇప్పటికీ బాలకృష్ణ యువరత్న… ఇప్పటికీ మహేశ్‌బాబు ప్రిన్స్… ఫాఫం, ఆ పిల్ల వయస్సెంతని… ఎంచక్కా చదువుకుంటోంది, అందమైన బాల్యాన్ని ఆస్వాదిస్తోంది… అప్పుడే ఆమె మీద లిటిల్ ప్రిన్సెస్ అని ఓ అత్యంత బరువైన బిరుదు అవసరమా..? ఎస్… ఓ పాపులర్ స్టార్ బిడ్డ, ఈమధ్య సోషల్ మీడియాలో పిల్ల డాన్సులతో, సరదా వీడియోలతో అలరిస్తోంది… అదొక ఆట ఆమెకు… పండుగపూట సరదాగా ఆమెతో చిట్‌చాట్ బాగానే ఉంటుంది… ఆ ఉద్దేశం వరకూ వోకే… కానీ..?
కానీ ఆ ప్రశ్నలు వేయడంలో ఎంత గౌరవమో, ఎంత భక్తో, ఎంత మర్యాదో చదువుతుంటే మాత్రం నవ్వు తన్నుకొచ్చింది… కోవిడ్ సమయంలో ఎలా చేశారు..? భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు..? వేసవి సెలవుల్లో ఏదైనా టూర్‌కు వెళ్తున్నారా..? కోపం, సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తారు..? ఇలా ప్రశ్నలు సాగిపోయాయి… ఆ ప్రశ్నల నాణ్యత గురించి వదిలేయండి… సరదా చిట్‌చాట్ కాబట్టి ఏదో ఆమె చెప్పినట్టుగా ఏదో రాసేశాడు, ఆ పేజీలో దులిపేశాడు అనుకుందాం… కానీ..?
ఒక పాపకు కూడా… రు రు అని ఆ బహువచనపు గౌరవప్రపత్తుల ప్రశ్నలు అవసరమా..? ఇంకా నయం, మీ వీడియోలకు అపరిమితమైన స్పందన కనిపిస్తోంది, మీరెలా ఫీలవుతున్నారండీ మేడమ్ గారు..? త్వరలో ఏదైనా సినిమా చేయబోతున్నారా పాప గారూ…? వంటి ప్రశ్నలు అనడగలేదు… మరీ ఆంధ్రజ్యోతి నవ్వ పేజీకి కూడా ఈ ‘జక్కన్న జర్నలిజం’ స్థాయి ప్రమాణాలు అవసరమా రాధికా..?! హాయ్, సితార, హవ్ ఆర్ యూ, నీ నెక్స్ట్ వీడియో ఏమిటమ్మా అనడిగితే అదేమైనా అవమానమా..? చిన్నతనమా..? అగౌరవమా..?!!
Share this Article