శ్రీరామనవమి అనగానే… గుర్తొచ్చేవి పానకం, వడపప్పు… కొన్నిచోట్ల చలిమిడి… ప్రసాదం వరకూ ఇవి వోకే… కొత్త జనరేషన్ వాటి జోలికి పోవడం తగ్గిపోయింది, కొబ్బరికాయ కొట్టేసి, నాలుగు ఊదుబత్తీలు ముట్టించేసి దండం పెట్టేస్తున్నారు… అందరికీ పూజ తంతు తెలియాలని ఏముంది..? భక్తి మాత్రమే ముఖ్యం కదా… దేవుడు కూడా తప్పుపట్టడు… కానీ ఆత్మారాముడి కడుపు నింపే మెయిన్ కోర్స్..?
పండుగపూట, అదీ రాములోరి లగ్గంపూట… నాలుకకు తీపి తగలకపోతే ఎలా..? అందుకే చాలామంది తమకిష్ఠమైన పాయసం చేసుకుని, అంచుకు గారెలో, వడలో చేసుకుంటారు… అదొక సెక్షన్… ఇంకా..? ఇంకేముంది..? మనకు పండుగలు అనగానే పులిహోర గుర్తొస్తుంది కదా… అన్నం వండుకుని ఏదో ఒక తరహా సద్ది చేసేసుకోవడం పరిపాటి… అదేలెండి, పులిహోర…
నిజానికి పులిహోర వీజీగా చేసుకోదగిన డిష్… కానీ మన యూట్యూబ్ వీడియోల పుణ్యమాని అవి చేసుకోవడానికీ సందేహిస్తున్నారు నెట్ జనరేషన్… అంత సంక్లిష్టం చేసి, ఆ పులిహోరలో కూడా ఏవేవో కలిపేసి చూపిస్తున్నారు… ఖర్మ అనుకోకుండా… బేసిక్స్ నేర్చేసుకుని, మీ రుచికి తగినట్టు, మీ ఓపిక, టైమ్‌ను బట్టి చేసుకోవడం బెటర్… అయితే సులభమైన ఒరిజినల్ టేస్ట్ పులిహోర ఎలా..?
Ads
అసలే నిమ్మకాయలు ఒక్కొక్కటి ఒక్కో లక్ష్మి బాంబులా పేలుతోంది… అంత ధర… మరీ శ్రీరామనవమి పూట చింతపండు సిద్ది పెద్దగా ఇష్టపడరు… సాధారణంగా తెలంగాణలో రకరకాల సద్దులు చేస్తుంటారు… వాటిల్లో ప్రధానమైనవి చింతపండు సద్ది, నిమ్మకాయ సద్ది, మామిడి సద్ది, కొబ్బరి సద్ది, పెరుగు సద్ది, నువ్వుల సద్ది తదితరాలు… సద్దుల బతుకమ్మ రోజు కూడా ఇలాగే చేస్తుంటారు చాలామంది…
అన్నిరకాలు చేసుకోలేకపోయినా… పండుగపూట ఏదో ఓ రుచికరమైన పులిహోర కావాలనుకుంటే… శ్రేష్టం మామిడికాయ పులిహోర లేదా మామిడి సద్ది… ఎలాగూ సీజన్… ఇప్పుడు గాక మరెప్పుడు ఈ మామిడి సద్ది..? అయితే పులిహోర పోపు అనగానే అందరికీ మళ్లీ జిలకర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు గట్రా అర్జెంటుగా గుర్తొస్తాయి కదా… అవేవీ వద్దు… వాటిని కాసేపు మరిచిపొండి…
మీకు తెలిసిన రీతిలోనే అన్నం వండుకొని, ఓ పక్కన పెట్టేసి చల్లారనివ్వండి… ముద్దగా, మెత్తగా గాకుండా కాస్త పలుకులుగా ఉడికితే బెటర్… అన్నం ఉడికించేటప్పుడే కాస్త ఉప్పు వేసేయండి, ఓ పనైపోతుంది… అయితే పొరపాటున కూడా ఏ యూట్యూబ్ వీడియో కూడా చూడకండి, డైవర్ట్ అయిపోయి తప్పులు చేసే ప్రమాదం ఉంది… ఇక అసలైన తంతు… నూనె, అందులో ఆవాలు… పల్లీలు, పచ్చి శనిగెపప్పు… మీకు ఇష్టమైతే మినపపప్పు, జీడిపప్పు… ఎండుమిర్చి…
పచ్చి మిరపకాయల్ని నిలువునా చీల్చండి… దొడ్డు మిరపకాయలైతే నాలుగు భాగాలుగా చీల్చండి… అవీ పోపులో వేసేయండి… కాస్త పసుపు… ఇక కాసేపు వేగనివ్వండి… మీకు ఇష్టమైతేనే కరివేపాకు… ఇక వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం, జిలకర, మెంతులు, కారం, ఇంగువ ఏవీ వద్దు… ఒక్కటంటే ఒక్క కూరగాయ కూడా కట్ చేసి వేయకండి… కొందరు కొత్తిమీర కూడా ఇష్టపడరు ఈ సద్దిలోనికి… ఇప్పుడు సన్నగా తరిగిన మామిడి తురుమును కలపండి ఇందులో… నీళ్లు పోయొద్దు, అడ్డగోలుగా నూనె పోయొద్దు…
ఇక దాన్ని చల్లారిన అన్నంలోకి పోసి, మంచిగా కలగలపండి… ఓసారి ఉప్పు సరిచూసుకొండి… తక్కువయితే ఉప్పు కలిపిన నీళ్లను చల్లేసి, మళ్లీ కలపండి… చాలు… అంచుకు గారెలా..? వడలా..? మవుడా..? కారప్పూసా..? మీ ఇష్టం… కానీ నాలుకకు తగలాలంటే మామిడికాయ సోగి, ఊరగాయ, ఆవకాయే అదుర్స్… నానా సరుకులూ ఉండవు… నానా కలగూరగంప రుచులు కలవవు… జస్ట్, మామిడి పులుపు, పచ్చి మిర్చి కారం ఒరిజినల్ టేస్టులు… కానీ ఒక్కటే జాగ్రత్త… మామిడి కాయ పులుపును బట్టి ఎంత తురుము వేయాలో కాస్త విచక్షణతో చూసుకొండి… అంతే…!!
Share this Article