అరవై దాటితే..? సో వాట్..? దాటితే…! పిల్లలు, అప్పులు, బాధ్యతలు, ఆస్తులు, చిక్కులు, మనోభారాలు, అనారోగ్యాలు, తరుముకొచ్చే యమకింకరులు… ఇవేనా గుర్తురావల్సినవి..? నెవ్వర్… కథ మారింది, కాలం మారింది…. 60లో ఇరవైని చూస్తున్నారు అనేకమంది… అసలు అరవై ఏళ్లు అనేది దేనికీ ఓ గీత కాదు… సగటు ఆయు ప్రమాణం పెరిగింది… ఇప్పుడు అరవై ఓ ప్రామాణిక రేఖ కానేకాదు…
ఒకప్పుడు అరవై దాటితే షష్టిపూర్తి… హమ్మయ్య, అరవై దాటాను అని ఓ ఫీల్… యాగాలు, పూజలు, ఫంక్షన్లు, పిల్లాపీచూ బంధుగణం అక్షితలు… కానీ ఇప్పుడు సహస్ర చంద్రదర్శనాలు బాగా పెరిగాయి… అంటే ఎనభై దాటడం… అరవై ఇప్పుడు వృద్ధాప్య సంకేతం కాదు… అలాగే ఆ ఏజ్ దాటాక ఇక ప్రతీ సంవత్సరమూ బోనసే అనుకుని, జీవితంలోని నిమ్మళాన్ని ఆహ్వానించేవాళ్లకూ కొదువ లేదు… ఉన్నంతలో కొత్త సంతోషాల్ని మూటగట్టుకునే ప్రయత్నాలూ బోలెడు…
Ads
పర్ సపోజ్… ఇప్పటితరం తమ పెళ్లిళ్లకు ప్రివెడ్ షూట్స్ చేయించుకుంటున్నారు… రకరకాల కాన్సెప్టులు, సినిమా హీరోహీరోయిన్లకు దీటుగా చిత్రీకరణ… ఓ మెమొరీలాగా భద్రపరుచుకునేట్టుగా ప్రివెడ్ ప్లానర్స్ కొత్త కొత్త కాన్సెప్టులు చేస్తూనే ఉన్నారు… మరి మన పెళ్లిళ్ల సమయంలో ఇవన్నీ లేవు కదా… ఇవే కాదు, సంగీత్‌లు లేవు, మెహందీలు లేవు, దుమ్ము రేపే డీజేలు లేవు, అదరగొట్టే రిసెప్షన్లూ, దావత్‌లూ లేవు… రెండు లడ్డూలు, రెండు కూరలు, పప్పుచారు, పెరుగు, అన్నం… అంతేకదా పెళ్లిభోజనాలు అంటే…
ఈ ప్రివెడ్ షూట్ల ఆర్గనైజర్లలో ఎవరికో కొత్త ఆలోచన వచ్చింది… గిరాకీ కోసమే కావచ్చు, కానీ కొత్తగా బాగుంది… అరవై ఏళ్లు దాటినవాళ్లు షష్టిపూర్తి చేసుకుంటున్నారు కదా… నిజానికి అదీ పెళ్లిలాంటిదే… మళ్లీ పెళ్లి వేడుక… మరి దానికీ ప్రిషష్టిపూర్తి షూట్ చేస్తే ఎలా ఉంటందనేది ఆలోచన… దిగువ కనిపించే వీడియో అలాంటిదే…
బాగుంది, ఏ వికారాలూ లేకుండా… ఒకరిపట్ల ఒకరి ప్రేమను చక్కగా వ్యక్తీకరిస్తూ… వయస్సు మళ్లిన హీరోహీరోయిన్లతో తీసిన షార్ట్ ఫిలిమ్‌లాగా బాగానే ఉంది… సరిగ్గా చెప్పగలిగితే అమ్మలూ, అత్తలూ, బామ్మలూ, మామ్మలూ ఎంత బాగా బిడియాన్ని, ప్రేమను అభినయిస్తారో కదా… ఎలాగూ ఖర్చుతో కూడిన యవ్వారమే ఈ ప్రివెడ్ షష్టిపూర్తి షూట్లు… అయితే, ఈ ధోరణిని వ్యతిరేకించాల్సిన పనిలేదు… పాత జ్ఞాపకాల నెమరువేతే వృద్ధాప్యం కాదు కదా… ఇలా కొత్త జ్ఞాపకాల, కొత్త ఆనందాల అన్వేషణ కూడా… షష్టిపూర్తితో ఏమొస్తుంది..? ఏమీ జరగదు… అదొక సెలబ్రేషన్… ఇదీ అంతే… వన్ వే ఆఫ్ సెలబ్రేషన్…!!
కానీ ఒక్కటే భయం… ఇవన్నీ డబ్బున్నవాడి వ్యవహారాలు, ఆనందాలు… వీళ్లను చూస్తూ వాతలు పెట్టుకునే మధ్యతరగతి జీవులపై పడే అదనపు ఒత్తిడి ఇది… ఇప్పటికే పెళ్లిళ్లలో గ్రాండ్‌నెస్ పేరిట రకరకాల ఉత్తరాది ఆచారాల్ని తీసుకొస్తూ, ఫంక్షన్ల సంఖ్య పెంచుతూ, మధ్యతరగతిని మరింత కుదేలు చేస్తున్నారు… మెహందీ ఎక్కడిది..? సంగీత్ ఎక్కడిది..? ఆ పేరిట చెత్తా సినిమా పాటల రికార్డింగ్ డాన్సులు ఏమిటి..? ఆ ఖర్చేమిటి..?
ఒకప్పటి తెలుగు పెళ్లి తంతు కాస్తా గంటసేపటికి కుదించుకుపోయి, ఈ అదనపు వికారాలే అసలు పెళ్లివేడుకలుగా మారిపోయాయి… ఆ వేషాలకన్నా… ఒకరికొకరు తోడు అవసరమైన అరవై ప్లస్ వయస్సులో… కాలగతిలో బలహీన పడిన బంధాల్ని కాస్త అతికించి, దాంపత్య పటిష్టతను పెంచే క్విక్ ఫిక్స్‌లాగా… ఈ ప్రివెడ్ షష్టిపూర్తి షూట్ కాస్త నయమే అనిపిస్తుంది..! బట్… డబ్బుంటేనే సుమా..!!
Share this Article