రామాయణ కాలం… అంటే దాదాపు 5400 ఏళ్ల క్రితం అనుకోవచ్చా..? అప్పటికి మన నాగరికత స్థాయి ఎంత..? అప్పటికీ యాసిడ్ వాడకం ఉండేదా..? నేరగాళ్లు క్లోరోఫాం వాడేవాళ్లా..? నిర్భయ వంటి సామూహిక అత్యాచారాలకు పాల్పడినా జువనైల్ జస్టిస్ కఠినశిక్షల నుంచి తప్పించేలా చట్టాలు ఉండేవా..? చట్టం శిక్షించకపోతే కొందరు పక్కదారుల్లో ఎన్‌కౌంటర్ వంటి శిక్షలు అమలు చేసేవాళ్లా..? ఇవన్నీ చదువుతుంటే మీకేమీ అర్థం కావడం లేదు కదా… చెప్పుకుందాం కాస్త వివరంగానే… క్రియేటివ్ ఫ్రీడం ఎలా వెర్రితలలు వేస్తున్నదో చెప్పుకుందాం…
రాజమౌళి అల్లూరి, కుమ్రం చరిత్రలను ఆర్ఆర్ఆర్ పేరిట ఎలా భ్రష్టుపట్టించాడో 1200 కోట్లు తగలేసి మరీ చూశాం కదా… చప్పట్లు కొడుతూ, యావత్ ప్రపంచం వినిపించేలా కీర్తిస్తూ..! అదేమంటే క్రియేటివ్ ఫ్రీడం… సృజనాత్మక స్వేచ్ఛ అట… ఆ స్వేచ్ఛ పేరిట ఏమైనా రాయొచ్చా..? ఏమైనా గీయొచ్చా..? ఏమైనా చిత్రీకరించి జనం మెదళ్ల మీద ప్రయోగించవచ్చా..? ఈ డౌట్ మళ్లీ ఎందుకు వచ్చిందంటే..? కేజీఎఫ్-2 పేరిట అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 199 వసూలు చేస్తున్నారు కదా… ఓసారి చెక్ చేస్తుంటే ఆ సినిమా మాత్రమే కాదు… ఆ ఓటీటీలోనే వార్నీ 399… అన్‌చార్టెడ్ 99… జుగాదిస్తాన్ 700… వీనమ్ 99… ఇలా రేట్లు కనిపించాయి…
ఎక్కువగా డిస్కవరీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో ముడిపడి ఉన్నయ్… వాటితోపాటు ‘లెజెండ్స్ ఆఫ్ రామాయణ విత్ ఆమిష్’ అని కనిపించింది… దాని ధర 399 రూపాయలు అట… అదేమిటయ్యా అంటే… రామాయణంలోని కొన్ని ఘటనలు, మిస్టరీలు గట్రా రచయిత ఆమిష్ మనకు పలుచోట్లకు తిప్పి చూపిస్తాడు, వినిపిస్తాడు, వివరణలు ఇస్తాడు… ఓ వ్లాగ్ టైపు… అమెజాన్ ప్రైమ్ అందినకాడికి దండుకోవడం మొదలుపెట్టాడా..? ఇండియాలో దందా కొనసాగిస్తాడా..? మూసేస్తాడా..?
Ads
సరే, ఇక్కడ ఆమిష్ గురించి చెప్పాలి… గతంలో శివ ట్రయాలజీ రాశాడు… అంటే శివపురాణాన్ని కొత్తగా చెప్పాడు… స్టోరీ రీటెల్లింగ్… అలాకాదు, బహుశా ఇలా జరిగి ఉండవచ్చు అనే ఊహ, కల్పన… అదే ఊపులో రామచంద్ర సీరిస్ రాస్తున్నాడు… అంటే రామాయణం… మూడు పుస్తకాలు అయిపోయాయి… రాముడు, సీత, రావణుడి కథలైపోయాయి… చివరి భాగం మిగిలి ఉంది… అది పెండింగ్ పెట్టి, ఇప్పుడు అమెజాన్ ద్వారా ఈ అదనపు దందాకు దిగాడు… ఆమిష్ శివపురాణం విషయంలో ఎంతటి చెత్తా క్రియేటివ్ స్వేచ్ఛను తీసుకున్నాడో… రామాయణం చెప్పడానికి అంతకన్నా సూపర్ చెత్తా ఫ్రీడం తీసుకున్నాడు… (నంబర్ వన్ కమర్షియల్ రైటర్ తను ఇప్పుడు… కోట్ల పుస్తకాలు, అనేక భాషలు… పాన్ ఇండియా రైటర్… కోట్లలోనే వసూళ్లు…)
ఇక్ష్వాకు కులతిలకుడు పేరిట మొదటి పార్ట్ ఉంటుంది… అందులో ఓ రెండు అధ్యాయాల్ని సంక్షిప్తంగా చెబుతాను… ‘‘కౌకేయి వెంటన వచ్చిన మహిళ పేరు మంథర… ఆమె కైకేయి దాసి కాదు… వ్యాపారి… రావణాసురుడి కోవర్టు… ఆమె బిడ్డ పేరు రోషినీ… ఆమె డాక్టర్… ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంటుంది… అప్పటికి దశరథుడే ప్రైమ్ మినిష్టర్… కొడుకుల్లో భరతుడికి విదేశాంగ బాధ్యతలు ఇచ్చి, రాముడికి పోలీస్ కమిషనర్ చేస్తాడు… ఆమెను కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేస్తారు… కిడ్నాప్ సమయంలో క్లోరోఫామ్ కూడా ఉపయోగిస్తారు…
(ఈ కొత్త వెర్రి పురాణాల్లో అత్యాచార వర్ణనకు కూడా దిగాడు ఈ రచయిత… ఆమె శరీరమంతటా వీర్యం ఉంది, ఆమె గొంతులో యాసిడ్ పోశారు, చర్మాన్ని కూడా అక్కడక్కడా కొరుక్కున్ని తిన్నారు… ఇలా రాస్తూ పోయాడు… యాసిడ్ అనే పదాన్ని అలాగే ఉపయోగించాడు…)… అయితే సదరు నేరగాళ్లలో ధేనుకుడు అని యుక్తవయస్సు రానివాడు ఉంటాడు… వాడికి మరణశిక్ష విధించవద్దని అయోధ్యలో రాముడు తెచ్చిన కొత్త చట్టాలు చెబుతున్నాయి… అంటే జువనైల్ యాక్ట్… తను సోదరిగా భావించే రోషినీ హత్యాచారానికి శిక్ష విధించలేని అశక్తతకు రాముడు తన చెయ్యిని గాయపరుచుకుంటాడు… కానీ చట్టాన్ని ఉల్లంఘించడు, చివరకు దొరికిన నేరగాళ్ల మరణశిక్షలో చిత్రహింసల్ని కూడా వ్యతిరేకిస్తాడు…
దీన్ని సహించలేని మంథర కైకేయికి డబ్బు ఇచ్చి, భరతుడితో చెప్పించి, ఆ ధేనుకుడిని జైలు నుంచి తప్పించి, రాముడికి తెలియకుండా, రహస్యంగా వాడిని అదే అత్యాచారస్థలంలో, శరీరానికి రంధ్రాలు చేస్తూ, వాటిల్లో యాసిడ్ పోస్తూ, శిక్షను పక్కదారిలో అమలు చేస్తారు… రాముడికి అది తెలిసి భగ్గుమంటాడు… చట్ట ఉల్లంఘన సహించడు… ఈలోపు విశ్వామిత్రుడు రావడంతో ఆ కథ అక్కడ ఆగిపోతుంది… తన బిడ్డకు అంతటి అన్యాయం జరిగినా ఓ నేరగాడిని రాముడు కాపాడాడు అనేది మంథర కోపం…’’ అన్నట్టు… దశరథుడు పుత్రకామేష్టి యాగం ఏమీ చేయడు, దానివల్ల కాదు తన మగసంతానం… రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నులవి సహజ జన్మలే… రాముడిని జాతకదోషిగా చాన్నాళ్లు దశరథుడు అసహ్యించుకుంటాడు… కుబేరుడు శ్రీలంక వ్యాపారి… తన దగ్గర రావణుడు సైన్యాధిపతి… దశరథుడితో యుద్ధం చేసి రావణుడు ఓడిస్తాడు… ఇలాంటివి చాలా కలవు…
ఇదంతా ఆమిష్ బాష్యం… క్రియేటివ్ ఫ్రీడం కదా… ఎవరు ఏమైనా రాసుకోవచ్చు… ఆమిష్ చూడబోతే రాజమౌళికి తాత, ముత్తాత వరుస అన్నట్టుగా కనిపిస్తున్నాడు… ఇదే ఇలా ఏడిస్తే… ఇక తను 399 తీసుకుని చెప్పే రహస్యాలు ఇంకెలా ఉంటాయో అర్థమైంది కదా… తన వెర్రితలల క్రియేటివిటీ గురించి అప్పుడప్పుడూ చెప్పుకుందాం… స్టోరీ రీటెల్లింగ్ అంటే చెత్తా బాష్యాలు కాదు ఆమిష్… ఈ దండుకునే దందా నాలుగు రోజులు ఆపి ది ఫేమస్ కన్నడ రైటర్ భైరప్ప రాసిన పర్వ అనే పుస్తకం చదువు… రీజనబుల్, యాక్సెప్టబుల్ క్రియేటివ్ ఫ్రీడం అంటే అర్థమవుతుంది…!! ఈ అమెజాన్‌లోనే పుస్తకం దొరకొచ్చు..!!
Share this Article