ఈ ఫోటో అన్ని పత్రికల మొదటి పేజీల్లో కదా రావల్సింది… కనీసం లోపల పేజీల్లోనైనా కనిపించాలి కదా… ఇది కదా మన ప్రభుత్వాల రైతుసంక్షేమ పాలనలోని డొల్లతనాన్ని ప్రతిబింబించేది… అన్నదాతకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చిన ఫోటో… గౌరవెల్లి ప్రాజెక్టు కోసం వాళ్ల భూములు లాక్కున్నారు… ఊళ్లు ఖాళీ చేయించారు… ఏళ్లు గడుస్తున్నా వాళ్లకు పరిహారాల్లేవు, పునరావాసాల్లేవు, పునర్నిర్మాణాల్లేవు… అదేమనడిగితే లాఠీలతో విరగబాదారు… ఆందోళనకు దిగితే ఇదుగో ఇలా కేసులు పెట్టి, బేడీలు వేసి హుస్నాబాద్ కోర్టుకు పట్టుకొచ్చారు…
వాళ్లు ఉగ్రవాదులా..? స్మగ్లర్లా..? ఉన్మాదులా..? ఇవేవీ కాదు… బాధితులు..! వాళ్లది కన్నీటిగోస… మరి వాళ్లకు వేసిన బేడీల్లో వార్తాప్రాధాన్యమే కనిపించలేదా మన మీడియాకు..? రైళ్లను కాలబెడితే, కాల్పుల్లో మరణిస్తే, అది వీరోచిత చైతన్యపోరాటమట… మంత్రులు పాడె మోసి, వీరత్వానికి ప్రశంసలట… లక్షల పరిహారాలు, ప్రభుత్వ ఉద్యోగాలట… కానీ తమ ఊళ్లు, తమ ఇళ్లు, తమ భూములు, తమ బతుకుల్నే పూర్తిగా అప్పగిస్తే మాత్రం ఇదుగో సంకెళ్లు, అవమానాలు, కేసులు, ఖర్చులు…
ఆ సర్కారీ డప్పు పత్రికను వదిలేయండి… మర్కజ్ రవికి, అనగా ఈనాడుకు ఏమైంది..? సాక్షికి ఏ వైరస్ సోకింది..? చివరకు ఇలాంటి అంశాల్లో చురుకుగా, ఫోకస్డ్‌గా వ్యవహరించే ఆంధ్రజ్యోతి వేలికి కూడా జెట్టపుట్టిందా..? ప్రజాపాత్రికేయానికీ టీవీ చానెళ్లకూ శృతికుదరదు కాబట్టి వాటిని పట్టించుకునే పనిలేదు… మెయిన్ ఎడిషన్లలో కనీసం ఓ ఫోటో, ఓ చిన్న రైటప్‌కు కూడా దిక్కులేదా..? మోడీకి యాదమ్మ ఏం వండి పెడుతుంది..? యశ్వంత్ సిన్హాకు ఎన్ని వేల వాహనాలతో ర్యాలీ తీస్తారు..? సాలు దొర- సంపకు మోడీ… పత్రికలకూ అదే పైత్యం తలకెక్కింది… చిన్న పత్రికలే నయం… ఆ నిర్వాసితుల కంటిలో తడిని అర్థం చేసుకున్నాయి…
Ads
ఈనాడులో కిషన్‌రెడ్డి ఇంటర్వ్యూ హైలైట్… అదేమిటో… బండి సంజయ్‌ను పక్కకు నెట్టేసి, పదే పదే ఇంకా కిషన్‌రెడ్డినే ఫోకస్ చేస్తుందేమిటో…! బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ భేటీల వార్త ఆంధ్రజ్యోతికి బంగారం… వార్తల ప్రయారిటీలో ఓ రీతిరివాజు లేని సాక్షి… ఇస్రోకు రాకెట్ ప్రయోగాలు కొత్త అయినట్టుగా పీఎస్ఎల్వీ సక్సెస్ అంటూ ఓ ఇండికేషన్… టెన్త్ ఫలితాల కోసం బాలురు, బాలికలు పోటీపడ్డట్టుగా బాలికలే బెస్ట్ అని మరో ఇండికేషన్… ఒకవైపు రైతులకు బేడీలు వేసి, కోర్టులకు నడిపిస్తూ… రాష్ట్ర రైతులపై కేంద్రానికి కక్ష అని ఎవరో మంత్రి విమర్శిస్తే మూడు కాలాలు పరిచారు ఏదో పత్రికలో…
పత్రికల్ని జనం నమ్మడం లేదు… చదవడం లేదు… కొనడం లేదు… అందరూ సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే వార్తలనే చదువుతున్నారు అని ఏడవడం దేనికి..? పత్రికల ప్రయారిటీలు ఇలా ఏడిస్తే పాఠకులను ఎందుకు తప్పుపట్టడం..? సందర్భరహితమే గానీ, మన పత్రికల దౌర్భాగ్యాన్ని చెప్పుకోవడానికి రెండు చిన్న పాయింట్లు… శివసేన ప్రభుత్వ పతనం మీద ఈనాడు కవరేజీ అట్టర్ ఫ్లాప్… పైగా ఓ విశేష కథనంలో ‘ఠాక్రే అనుసరించిన మృదు హిందుత్వ’ అని ప్రస్తావించారు… అంటే ఠాక్రే పోకడల మీద ఈనాడు సెంట్రల్ డెస్క్‌కు వీసమెత్తు అధ్యయనం, అవగాహన లేదా..? లేక ఇక్కడ వణికిపోవడమేనా..? ఆంధ్రజ్యోతిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల స్టోరీ రాస్తూ… గతంలో మా వెంకయ్య ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగాయి, అన్నీ తానై నిర్వహించాడు అంటూ డప్పు… ఫాఫం, ఇప్పుడు పాల్గొనలేని దుస్థితి అని కన్నీళ్లు… హేమిటో…!!
Share this Article