ఒక వార్త కనిపించింది… అది రజినీకాంత్ వార్త కాబట్టి ఇట్టే పట్టేసుకుంది… చదివించింది… నా జీవితంలో కనీసం పదిశాతం ప్రశాంతత, సంతోషం లేవని రజినీకాంత్ ఓచోట బహిరంగంగానే వ్యాఖ్యానించాడు… ఎస్… తెలుగు మీడియాలో ఎక్కడా కనిపించలేదు… నైదర్ పత్రికలు నార్ టీవీలు… కానీ అది కనెక్ట్ కావల్సిన వ్యాఖ్యే… ఎందుకంటే..? 71 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ వంటి హీరో నా జీవితంలో సంతోషం లేదు, ప్రశాంతత లేదు అని ఎందుకు వగచే దురవస్థ…
కావచ్చు, రజినీకాంత్ మొదట్లో ఓ సాదాసీదా బస్ కండక్టర్ కావచ్చుగాక… తన రూపం కూడా పెద్ద ఆకర్షణీయం కాదు… కానీ తిరుగులేని హీరో అయ్యాడు… అనూహ్యమైన ఎత్తుకు ఎదిగాడు… తను అనుభవించని సౌఖ్యం లేదు… విలాసం, వైభోగం… ఇండస్ట్రీ అన్నీ ఇచ్చింది… అందాలు, ఆస్తులు, భవనాలు, వాహనాలు, కీర్తి, అభిమానులు… అడుగు తీసి అడుగేస్తే ఎందరికో తను దైవాంశసంభూతుడు… ఐనా ఈ వయస్సులో వెనక్కి తిరిగి చూసుకుంటే… తను ఏం కోల్పోయాడు, నిజంగా ఏం సాధించాడు..? తన జీవనసార్థకత శాతం ఎంత..? తరచూ హిమాలయాల్లోకి వెళ్లి, ధాన్యంలో మునిగే తనలో నిజంగా ఆధ్యాత్మిక పరిపక్వత ఎంత..? స్థితప్రజ్ఞత ఎంత..?
రజనీకాంత్ మాటలు విన్నాక ఇన్ని ప్రశ్నలు తలెత్తుతాయి… మనిషికి జీవితంలో నిజంగానే ఏం కావాలి..? ఏది తనకు ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చేది..? యోగత సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది… ‘‘క్రియా యోగం ద్వారా సంతోషకరమైన జీవనం’’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని, ఓ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడాడు… ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశం…
Ads
‘‘నేను గొప్ప నటుడిని అన్నారు, నిజానికి అది విమర్శో, ప్రశంసో అర్థం కావడం లేదు… నా ఇన్నేళ్ల కెరీర్‌లో రాఘవేంద్ర, బాబా సినిమాలు మాత్రమే నాకు ఆత్మతృప్తిని ఇచ్చాయి… బాబా సినిమా చూశాక బోలెడు మంది హిమాలయ యాత్రలకు వెళ్లారు… నా అభిమానుల్లో చాలామంది సన్యాసం స్వీకరించారు… కానీ నేనింకా నటుడిగానే ఉన్నాను… హిమాలయాల్లో కొన్ని మూలికలు దొరుకుతాయి, అవి తింటే ఓ వారానికి సరిపడా ఎనర్జీని ఇస్తాయి… ఏ కోరికలూ లేకుండా, ఏ అనారోగ్యమూ లేకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టడం చాలా ముఖ్యం… మన అనారోగ్యం మనవాళ్లకు అసౌకర్యం… అందుకని భౌతిక ఆరోగ్యం అత్యంత ప్రధానం… నాకు పది శాతం ప్రశాంతత, సంతోషం కూడా లేవు, ఐనా అవి శాశ్వతాలు కావు…’’ అని చెబుతూ పోయాడు… నిజానికి కొన్ని వ్యాఖ్యలు అసందర్భం… ప్రశాంతత, సంతోషం శాశ్వతాలు కావనే సోయి ఉన్నప్పుడు, మళ్లీ వాటి మీద అసంతృప్తి దేనికి..? హేమిటో ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని తన ప్రజెంట్ మెంటల్ స్టేటస్‌ను పట్టిస్తున్నాయి…
రజినీ కోణంలోనే చూస్తే… ఒకవైపు ప్రశాంతత లేదు, శాంతి లేదు, సంతోషం లేదు అంటూనే…. 71 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా దేనికి తాపత్రయ పడుతున్నాడు మరి..? పెద్దన్న, పెటా, దర్బార్ వంటి సూపర్ హీరోయిక్ వేషాలు దేనికి వేస్తున్నట్టు..? ఇంకా కొత్త సినిమాలు అంగీకరిస్తూనే ఉన్నాడు… డబ్బు, కీర్తి, ఆస్తులు ప్రశాంతతనూ ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు… మరెందుకు ఇంకా ఈ తన్లాట..?
ఓ బిడ్డ పెళ్లి పెటాకులైంది… రాజకీయాల్లో చేరలేక, సత్తా చాటలేక, ఏళ్ల డైలమాను దాటలేక, అభిమానులతోనే పిరికి అనిపించుకున్నాడు… కొత్త హీరోలు వస్తున్నారు, ఇంకెన్నాళ్లు ఈ సుప్రీం హీరో వేషాలు… పాత నీరు కొట్టుకుపోక తప్పదు… మరి సమాజం ఇంతగా ఇచ్చింది కదా, తను సమాజానికి ఏమిచ్చాడు..? అదుగో అక్కడ రజినీకి చెప్పుకోవడానికి ఏమీలేదు… అందుకే సంతోషం లేదు, ప్రశాంతత లేదు… తన జీవనసార్థకత మీద తనకే అసంతృప్తి ఉంది…
హిమాలయ యాత్రలు తనకేమీ మార్గం చూపలేదు… స్థితప్రజ్ఞతనూ ఇవ్వలేదు… అందుకే తన బతుకుతున్న కృత్రిమత్వమే ఇంకా కొనసాగుతోంది… ఇన్నేళ్ల కెరీర్‌లో రాఘవేంద్ర, బాబా మాత్రమే తనకు ఆత్మతృప్తినిచ్చాయట… (కొంత స్పిరిట్యుయల్ టచ్ ఉన్న సినిమాలు)… అవీ అంత గొప్పగా చెప్పుకోదగ్గవి కావు… మరి ఇదీ ఈ సొసైటీకి నా కంట్రిబ్యూషన్ అని చెప్పడానికి ఏముంది..? కెరీర్‌లో కూడా ఏమున్నట్టు..? ఇంకా ఇంకా వందల కోట్లు దేనికోసం రజినీ..? ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటే సరిపోదా..?!
Share this Article