నవంబర్ 14, 2003 సచివాలయం విలేకరులతో కిక్కిరిసిపోయి ఉంది . అంతకు ముందే మంత్రివర్గ సమావేశం జరిగింది . అసెంబ్లీని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు . అప్పటికప్పుడు గవర్నర్ కు తీర్మాన ప్రతిని అందజేశారు . రాజ్ భవన్ నుంచి మంత్రివర్గ తీర్మానం మేరకు అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడింది . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరిస్తున్నారు . వెంటనే ఎన్నికలు జరగాలి అని కోరుకున్నారు .
అసెంబ్లీ రద్దు గురించి బాబు చెబుతుండగానే ఇంగ్లీష్ ఛానల్ మహిళా రిపోర్టర్ ఒకరు మధ్యలో లేచి ఢిల్లీ నుంచి ఇప్పుడే సమాచారం వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేం , సమయం పడుతుంది అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ప్రకటించింది అని చెప్పగానే బాబు కంగారు పడ్డారు . ముఖకవళికలు మారిపోయాయి . పరిస్థితులు చేయి దాటి పోక ముందే ఎన్నికలు జరగాలి అని ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేశారు .
రద్దు ప్రకటన చదువుతుండగానే పిడుగులాంటి వార్త వినడంతో బాబు కంగారు పడ్డారు .99 లో స్వల్ప తేడాతో గెలవడం , 2001లో తెలంగాణ ఉద్యమం , వరుసగా మూడు నాలుగేళ్ల నుంచి కరువు వంటి పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితి చేయి దాటి పోక ముందే ఎన్నికలకు వెళ్లాలని బాబు అనుకున్నారు . 2003 అలిపిరిలో నక్సల్స్ తన వాహనం పై బాంబు దాడి చేశారు . ఈ దాడి నుంచి బయటపడ్డ బాబు దానిని అనుకూలంగా మార్చుకొని సానుభూతి పవనాలు సృష్టించుకునే ప్రయత్నాలు చేశారు .
Ads
వారం రోజుల చికిత్స తరువాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడుతారు అని సమాచారం . అప్పుడు సీఎం ముఖ్య పౌర సంబంధాల అధికారిగా ఉన్న విజయ కుమార్ మీడియా ఏమీ ప్రశ్నించవద్దు , బాబు చెప్పింది విని వెళ్ళాలి అంతే అనే షరతుతో లోనికి అనుమతి ఇచ్చారు . ఏమీ అడగవద్దు అని విజయ్ కుమార్ నాకు మరోసారి షరతు గుర్తు చేశారు .
అంతకు ముందు రోజే జ్యోతిలో కొమ్మినేని బాబు ముందస్తు ఎన్నికలకు వెళతారు అని రాశారు/ రాయించారు . బాబు అరగంటకు పైగా మాట్లాడారు . ఆయన మాటల సారాంశం ‘‘నామీద దాడి జరిగింది , ముందస్తు ఎన్నికలకు వెళతాను , నాకు ఓటు వేయండి అని అడుగుతున్నట్టుగా ఉంది’’ అని జర్నలిస్ట్ మిత్రులతో నా అభిప్రాయం చెప్పాను . ,
సానుభూతి కోసం మంచి ప్రయత్నాలు చేశారు . ఇప్పుడు వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అప్పుడు టీడీపీలో కీలక నాయకులు. వారికీ చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువచ్చి బాబుకు పిల్లలతో పూలు ఇప్పించారు .డక్కన్ క్రానికల్ లో సైతం స్కూల్ అమ్మాయి గులాబీ పూవు బాబుకు ఇస్తున్న ఫోటో మొదటి పేజీలో అద్భుతంగా వచ్చింది . ఆ తరువాత నియోజక వర్గాల వారీగా పార్టీ వారికీ టార్గెట్ విధించి ప్రతి రోజు బాబు ఇంటికి వచ్చేట్టు చేశారు .
అనంతరం పార్టీ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని నిర్ణయాలు . రాష్ట్రంలో నక్సలైట్లు విజృంభిస్తున్నారు , అసెంబ్లీ రద్దు చేస్తాం . మమ్ములను తిరిగి గెలిపించండి ఇదీ తీర్మానం . అధికారంలో ఉన్నది టీడీపీ , నక్సల్స్ విజృంభిస్తే కట్టడి చేయాల్సింది ప్రభుత్వం , ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీ రద్దు చేయడం ఏమిటో , తిరిగి అధికారం ఇవ్వమని కోరడం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు .******
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడంపై ఆంధ్రాలో భిన్న వాదనలు… గతంలో జగన్ ను అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయ్యారు , ఇప్పుడు బాబును అరెస్ట్ చేయడం వల్ల బాబు సీఎం అవుతారు అనేది తెలుగుదేశం వాదన . సానుభూతి వల్లనే జగన్ సీఎం అయ్యారు అని వాదించినా , సానుభూతి వల్ల బాబు సీఎం అవుతారు అని వాదించినా కోట్లాది మంది ఓటర్ల అభిప్రాయాలను చిన్న చూపు చూసినట్టే . ఒక పార్టీ నచ్చడానికి , నచ్చక పోవడానికి ఓటర్లకు అనేక కారణాలు ఉంటాయి. అంతే తప్ప నాయకుడికి జ్వరం వచ్చింది అనో జలుబు చేసింది అనో సానుభూతితో ఓడించరు , గెలిపించరు .
పాదయాత్ర చేయగానే సీఎం అని , అరెస్ట్ చేయగానే సీఎం అని చిత్రమైన విశ్లేషణలు చేస్తుంటారు . షర్మిల పాదయాత్రతో తెలంగాణ కాబోయే సీఎం అని రాసిన మీడియా మేధావులు కూడా ఉన్నారు . చివరకు ఆమె కనీసం ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు . పాదయాత్రతోనే అధికారం వస్తే సిపిఎం తమ్మినేని వీరభద్రం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం సీఎం అయిపోవాలి . పాపం ఆ పార్టీకి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేదు . అనేక అంశాలు ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి .
*****తెలుగు నాట సానుభూతి రాజకీయాలు కొత్తేమి కాదు. సానుభూతి ఎన్నికల్లో పని చేస్తుందా ? చేయదా ? అంటే ? పని చేసిన సందర్భాలు ఉన్నాయి , పని చేయని సందర్భాలు ఉన్నాయి . 84లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 పార్లమెంట్ సీట్లను గెలుచుకోండి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఎప్పుడూ రాలేదు .
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి సానుభూతి పవనాలు పని చేయలేదు . టీడీపీకి 30 సీట్లు వచ్చాయి . తొలిసారిగా పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది .
అరెస్ట్ చేయగానే సీఎం అని కొందరు జోస్యం చెబుతున్నారు . వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మేలో అరెస్ట్ చేశారు . ఆ తరువాత 2014 లో ఎన్నికలు జరిగితే జగన్ సీఎం కాలేదు . బాబు ఐదేళ్ల పాలనా ప్రభావం వల్లనే జగన్ 2019 లో సీఎం అయ్యారు కానీ . 2012లో అరెస్ట్ అయ్యారనే సానుభూతితో కాదు .
కాంగ్రెస్ కు ప్రతిపక్షస్థానం కూడా దక్కకుండా ఎన్టీఆర్ 94లో కాంగ్రెస్ ను ఓడించారు . 95లో ఎన్టీఆర్ ను బాబు గద్దె దించితే ఎన్టీఆర్ నల్ల దుస్తులు వేసుకొని సానుభూతి యాత్ర చేసినా పెద్దగా స్పందన లేదు . ఆంధ్రభూమి మినహా మీడియా పట్టించుకోలేదు . 94లో ఘనవిజయం చేకూర్చిన ప్రజలే 95లో పట్టించుకోలేదు . ఆయా సమయంలో పరిస్థితులే కీలక పాత్ర వహిస్తాయి కానీ , సానుభూతి , అరెస్ట్ లు , పాదయాత్రలు కాదు .
*******
ముందస్తు ఎన్నికల ఆశపై ఎన్నికల కమిషన్ నీళ్లు పోసింది . ఐతే సానుభూతి పవనాలు వీచడం లేదు అనే విషయం దాదాపు అందరికీ అర్థమైంది . అలిపిరి బాంబు దాడి తరువాత తిరుపతికి చెందిన టీడీపీ లీడర్ , బాబు మిత్రుడు , మున్సిపల్ ఛైర్మెన్ శంకర్ రెడ్డిని పిలిచి …. బాబు షర్ట్ రక్తంతో తడిసిపోయింది , నువ్వు లోకల్ కాబట్టి షాప్స్ షట్టర్స్ ఎత్తయినా కొత్త షర్టు తీసుకురా అని పంపించారు . బాంబు దాడి వల్ల సానుభూతిగా తిరుపతిలో షాప్స్ అన్నీ మూసేస్తారు అని శంకర్ రెడ్డి అనుకున్నాడు . వెళ్లి చూసేసరికి అన్ని షాప్స్ లో బిజినెస్ యధావిధిగా జరుగుతోంది . ఈ విషయం శంకర్ రెడ్డినే ఎన్టీఆర్ భవన్ లో ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు .
*******
రాయలసీమకు చెందిన ఓ లీడర్ మంచి మిత్రులు. ఓ రోజు ఫోన్ చేసి ఈసారి మేం గెలవడం కష్టమే అని చెప్పుకొచ్చారు . అలిపిరి దాడి జరిగినప్పుడు షేరింగ్ ఆటోలో కొందరి ముచ్చట ఒకరు దాడి గురించి చెబితే మరొకరు అన్న మాట కార్యకర్త విని … జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది . బాంబు దాడి జరిగినా కనీస సానుభూతి చూపడం లేదు అని ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చారు .
********
ఆరు నెలల ముందు అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు సకాలంలోనే జరిగాయి . ఏప్రిల్ 20న పోలింగ్ జరిగింది . బాబు జన్మదినం రోజున పోలింగ్ జరిగింది . ప్రజలు పుట్టిన రోజు కానుక ఇస్తారు చూడు అంటూ అప్పుడు ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణ గట్టిగా వాదించారు .ఏ సానుభూతి పవనాలు పని చేయలేదు . అప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు వచ్చాయి . టీడీపీకి 47 స్థానాలు మాత్రమే వచ్చాయి .
ప్రజలు తప్పు చేశారు అంటూ టీడీపీ మీడియా రాస్తూ పోయింది ఎప్పటి మాదిరిగానే . అలిపిరి సానుభూతి కథ అలా ముగిసింది … అదే సమయంలో బాబు పోతూ పోతూ వాజపేయి ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకు వెళ్లారు . ఇండియా షైనింగ్ నినాదంతో ముందస్తుకు వెళ్లి బీజేపీ బోర్లాపడింది . ఏ కారణమో తెలియదు కానీ అదే సమయంలో బంగ్లా దేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది . బాబు ముందస్తుతో బంగ్లాదేశ్ కూడా ముందస్తుకు అని తెలుగు మీడియా చాలా ముచ్చట పడి రాసింది … – బుద్దా మురళి
Share this Article