పదేళ్ల క్రితం… నా జీవితం హాయిగా సాగేది… మంచి భర్త, ఇద్దరు ఆరోగ్యంగా ఉండే పిల్లలు, స్థిరమైన కొలువు… కానీ ఒకేసారి మొత్తం తలకిందులైంది… మా ఇంటి మొదటి అంతస్థు నుంచి నా చిన్న కొడుకు చందన్ కిందపడటంతో నా జీవితమే మారిపోయింది… అప్పటికి వాడి వయస్సు కేవలం 15 ఏళ్లు…
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను వాడిని వాడిని వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టి హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే… ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని, ప్రపంచానికి మంచి చేయాలని కలలు గన్న నా పిల్లాడు ఆ క్షణాన అన్నీ కోల్పోయాడు… తన భవిష్యత్తుతో సహా…
చందన్ తలకు, వెన్నుకు బాగా దెబ్బలు తగిలాయి… అనేక సర్జరీలు, చికిత్సలు, మందులతో 3 నెలలు గడిచిపోయాయి… అప్పటికి గానీ లేచి నడవడం స్టార్ట్ చేయలేదు… కానీ తన ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది… తనలో తాను మాట్లాడుకునేవాడు… అకారణంగా తన దగ్గర ఉన్న మనుషుల్ని కొట్టేసేవాడు… డాక్టర్లు తనకు సైకోసిస్ అని తేల్చారు… ఇరుగూపొరుగు దాదాపుగా మమ్మల్ని వెలేశారు… మాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కారు…
Ads
తరువాత రెండేళ్లలో చాలామంది డాక్టర్లను కలిశాం, అనేక హాస్పిటళ్లకు తిరిగాం, బెంగుళూరుకు తీసుకెళ్లాం, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు… తనను ఎప్పుడూ చూసుకునేవాళ్లు కావాలి కాబట్టి నా ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది… ఇవి చాలవన్నట్టుగా నా భర్త ఆరోగ్యం దెబ్బతింది… అదుపు లేని మధుమేహం, బాపీ కారణంగా… ఓ కాలు కూడా తీసేయాల్సి వచ్చింది…
అటు కొడుకు, ఇటు భర్త… నాకు వీళ్లతో వశపడటం లేదు… ఓ దశలో నా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను… కానీ అది సరైన నిర్ణయం కాదని నాకే అనిపించింది… వాళ్లనలా వదిలేసి నేనెలా వెళ్లిపోతాను..? దాదాపు ప్రతి రాత్రీ నిద్ర ఉండేది కాదు, ఏడ్చేదాన్ని… దేవుడా, ఏదైనా అద్భుతం చేసి నన్ను గట్టెక్కించు అని ప్రార్థించేదాన్ని…
2017లో నిజంగానే ఓ అద్భుతం నన్ను పలకరించింది… The Live Love Laugh సంస్థ మా ఊరు దావణగేరెకు వచ్చింది… ఈ ఫౌండేషన్ సంకల్పం ఏమిటంటే మానసిక రోగుల్ని తిరిగి మామూలు మనుషులను చేయడం…!
వాళ్లు చందన్ బాధ్యతను తీసుకున్నారు… మందులు, చికిత్సే కాదు, వొకేషనల్ ట్రెయినింగ్ కూడా ఇవ్వసాగారు… నా డిప్రెషన్ గమనించి నాకూ కౌన్సెలింగ్ ఇచ్చారు… ఫలితంగా, నేనేమీ ఒంటరిదాన్ని కాదని, నా వెనుక చాలామంది ఉన్నారనే భరోసా కలిగింది… డిప్రెషన్ నుంచి బయటపడ్డాను…
నాకు తెలుసు… నేను వెళ్లే మార్గం చాలా పెద్దది… ఎంత దూరం వెళ్లినా ఇంకా అలాంటోళ్లు చాలామంది… చేయాల్సింది చాలా ఉంది… వాళ్లలో నమ్మకం కొడిగట్టకుండా చూడాలి… ఎందరో చందన్‌లు… మా చందన్ పూర్తి ఆరోగ్యవంతుడు కావాలంటే ఇంకా టైమ్ పట్టేట్లుంది… పర్లేదు, ప్రస్తుతానికి ఇది చాలు… నా అడుగులు సరైన తోవలోనే సాగుతున్నాయి… The Live Love Laugh Foundation
Share this Article