Sampathkumar Reddy Matta ……. ముద్దపప్పు – మసలవెట్టిన చారు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ముద్దపప్పు & మసలవెట్టిన చారు..
ఇది తరతరాలుగా వన్నెతరుగని వంట !
సాంబారు గీంబారు.. పేరుతోటి
మనం పరాయీకరణకు గురికానప్పటి
పాతకాలపు సంప్రదాయకమైన రుచి యిది.
బోనం – తీర్థం, పెండ్లి – పేరంటం
చుట్టం – పక్కం… సందర్భమేదయినా
ఎన్నితీర్ల కాయగూరలు వండుకున్నా సరే
అన్నిటికి మొదటిది పప్పు & చారు/ పచ్చి పులుసు.
మన ఇంటిమందమే అయితే పచ్చి పులుసు చేసుడు
పది మందికి వడ్డించుడంటే మాత్రం చారు గాసుడు పద్ధతి.
పెసరు పప్పు, దాంట్లగుడ కొత్త తియ్య పెసరు పప్పు
మెత్తగ ఉడికిచ్చి, తప్పకుంట జిలుకరెల్లిపాయ నూరేసి,
దించేముందట ఇంత ఉప్పేసి ఎసరు ఇగ్గేదాక ఉండనిచ్చి
దించి, కంచుడు కాళ్లతోటి పట్టి, దువ్వతో రుద్దుతె పప్పుసిద్ధం.
చింతకాయ కాలమైతే పచ్చికాయ, వేరేటప్పుడు చింతపండు
పులుసు పిసికి పెట్టుకోని, జిలుకరెల్లిపాయ, ఉల్లి- కొత్తిమీరాకు,
చెట్టు నుంచి అప్పుడె దూసుకచ్చిన కల్యామాకులేసి మసలవెట్టి,
పులుసు దొర్లి పొర్లి గమగమలాడంగ, ఇనుప గంటెల పోపువెట్టి,
ఆ నూనె పోపును మసిలిన చార్ల చుర్రుమనిపిస్తే చారు తయారు.
ఇదీ.. మా ఉత్తర తెలంగాణల ప్రీతిగ పప్పుచారు చేసుకునే పద్ధతి.
మాంసాహారపు వంటలున్నా సరే, ఈ జంట లేకుంటే వంటే వుండది.
ఎన్ని జేసినా పప్పు చారు చెయ్యకపోతే, కాందాను తెలియనట్టే మరి.
ఇది… మన ఆహారం – ఇది మన ఆచారం.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
———————————————————–
జొమాట, సిగ్గీ.. ఎర్ర బకీటు, కర్రె తట్ట..
వన్ ప్లస్ టూ ఆఫరుతో విసిరే పొట్లం.
వెజ్ ప్రైడ్ రైస్.. బ్రెడ్ ఫ్రైడ్ రైస్..
పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్,
మంచూరియా, మంగోలియా.. మాలోకాలకు
పప్పు చారన్నం, గంజి కలిపిన మెతుకులు కూడా
ఆన్ లైనులో.. ఆర్డర్ మీద కాస్ట్లీగ దొరుకుతున్నయి.
ఏం జేస్తం? అటు కొత్తకు రంధి లేదు – ఇటు పాతకు మందు లేదు…
Share this Article
Ads