సెలబ్రిటీల జ్యోతిష్యుడు వేణుస్వామిని తలపిస్తూ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఈరోజు రాధాకృష్ణ తన వ్యాసంలో ఏవేవో జోస్యాలు చెప్పాడు.,. ఎక్కడికో వెళ్లిపోయాడు… ఎప్పుడైతే కేసీయార్ మొన్నటి టీవీ9 ఇంటర్వ్యూలో ‘నాకున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ గెలుస్తాడు’ అన్నాడో, అప్పుడే రాధాకృష్ణకు చర్రున ఎక్కడో మండినట్టుంది…
గతంలో కూడా ఓసారి జగన్ గెలుస్తాడని చెప్పి కేసీయార్ భంగపడ్డాడు, తను ఆ మాట చెప్పడం వెనుక మర్మమేమిటో ఇక్కడ విశ్లేషణ, ఊహాగానం అనవసరం గానీ… అలా ఎందుకు చెప్పి ఉంటాడనే పాయింట్‌ను బేస్‌గా తీసుకుని… దాని చుట్టూ ఓ పాజిబులిటీల చిత్రాన్ని గీస్తూ పోయాడు రాధాకృష్ణ…
నిజమే… రాధాకృష్ణ చెప్పినట్టు ఏపీ పాలిటిక్సు ఓ స్ట్రెయిట్ ఫైట్… అయితే జగన్, లేదంటే కూటమి… కానీ తెలంగాణలో ఓ సంక్లిష్ట చిత్రం కనిపిస్తోంది… ఏడాదిలోపు రేవంత్ సర్కారు పడిపోతుందని ఇటు బీఆర్ఎస్ చెబుతోంది… అటు బీజేపీ చెబుతోంది… మొన్నమొన్ననే కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు చెప్పింది… మరి ఇంత అర్జెంటుగా ప్రజల తీర్పున కాలరాయాలనే అభిలాష ఆ రెండు పార్టీల్లో ఎందుకు వేగంగా పెరిగిపోతోంది..?
Ads
సరే, పాలిటిక్స్ అంటే ఓ క్రూయల్ గేమ్ కాబట్టి… రాజకీయాల్లో ఓ పొజిషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం కావాలనే ఆశ ఉండటమూ సహజమే కాబట్టి… తెలంగాణ అంటే నేను, నేనంటే తెలంగాణ అనే భావనలో ఉండే కేసీయార్ విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో పడిపోయాడు కాబట్టి… అందులోనూ తన కోవర్టులు గాకుండా తనకు పడని రేవంత్ సీఎం కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి… తను బాగా వ్యతిరేకించే చంద్రబాబుకు రేవంత్ అనుకూలుడే కాబట్టి… తన జాన్ జిగ్రీ జగన్‌కు రేవంత్‌కూ పడదు కాబట్టి… ఇలా చాలా కాబట్టి అంశాల కారణంగా కేసీయార్ ఖచ్చితంగా రేవంత్ సర్కారును కూలుస్తాడు అని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు…
దీనికి మంత్రి పొంగులేటిని తెర మీదకు తీసుకొచ్చాడు… సరే, తనకున్న సమాచారం తప్పని ఖండించడం లేదు గానీ… అబ్బే, ఇప్పుడప్పుడే పొంగులేటి కేసీయార్‌కు అనుకూలంగా మారిపోడు, కాంగ్రెస్‌లోనే తన అవకాశాలు వెతుక్కుంటాడని కూడా అదే రాధాకృష్ణ చెబుతున్నాడు… ఎలాగంటే..? పొంగులేటికి ఆశలున్నయ్, తను జగన్‌కు సన్నిహితుడు, జగన్‌కు కేసీయార్ జాన్ జిగ్రీ… సో, అవసరమైతే, రేవంత్ ఏమాత్రం బలహీనపడినా… వెంటనే తను చక్రం తిప్పి, రేవంత్ సర్కారును కూల్చడానికి కాంగ్రెస్ పార్టీని నిలువునా చీలుస్తాడని రాధాకృష్ణ ఊహాచిత్రం…
ఇక్కడ తను మరిచిపోయింది మరొకటి ఉంది… పొంగులేటి వియ్యంకుడికి ఖమ్మం సీటు ఇప్పించుకున్నాడు… అది కాంగ్రెస్‌తో పెరిగిన తన గ్రిప్‌కు సూచిక… అంతేకాదు, బీఆర్ఎస్‌లోనూ తనవాళ్లున్నారు… కేసీయార్ క్యాంపుకి అత్యంత సన్నిహితుడు వెంకట్రామిరెడ్డి పొంగులేటి తమ్ముడికి వియ్యంకుడు… సో, రెండు క్యాంపుల్లోనూ పొంగులేటికి మంచి పలుకుబడి ఉంది… కానీ నిజంగానే రేవంత్ బలహీనపడితే పొంగులేటి మాత్రమే ఎందుకు సీఎం చాయిస్ అవుతాడు..?
నల్గొండ బ్రదర్స్‌కు ఎన్నాళ్లుగానో ఆశలున్నయ్… ఉత్తమకుమారుడు సరేసరి… వాళ్లను మించి భట్టికి ప్లస్ పాయింట్స్ ఎక్కువుంటయ్… ఐనా, రేవంత్ మదిలో ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటూ చాలా ఆల్టర్నేటివ్ ప్లాన్లుంటయ్… ఇలా కేసీయార్ చెప్పగానే అలా జగన్ పొంగులేటిని ఉసిగొల్పడం, ఆయన పార్టీని చీల్చేయడం, సర్కారును కూల్చేయడం అంత అల్లాటప్పా యవ్వారం కాదు…
డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని బీజేపీ వర్గాలూ చెబుతున్నయ్… మోడీ అధికారంలోకి రాగానే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలను కూల్చేసి, వెంటనే తెలంగాణ సర్కారు పని పడుతుందని వాళ్ల ఆశ, ఊహ… మోడీకి చాలా ప్రయారిటీ పనులున్నయ్… అర్జెంటుగా రెండుమూడు రాష్ట్రాల్లో కూల్చివేతల కార్యక్రమాలతో ఇప్పుడు బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమీ లేదు… రాధాకృష్ణ రేవంత్ బాపతు ఏబీవీపీ మూలాల్ని కూడా మరిచిపోయినట్టున్నాడు…
నిజానికి పొంగులేటి మదిలో ఉన్న ఆశ ఏమిటంటే..? పార్టీపై తన గ్రిప్ పెంచుకుని, ఐదేళ్ల తరువాత సీఎం పోస్టుకు ట్రై చేయడమని జర్నలిస్టు సర్కిళ్లలో ఉన్న ప్రచారం… తప్పులేదు, ఆశలు ఉండనిదెవరికి..? ఎవరి ప్రయత్నాలు వాళ్లవి… ఒకటి మాత్రం నిజం… లోకసభ తెలంగాణ ఫలితాలు తెలంగాణ రాజకీయాల దశను, దిశను నిర్దేశించబోతున్నయ్… బీఆర్ఎస్ గనుక ఒకటీరెండు సీట్లకు పరిమితమైతే తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు ఖాయం…!!
Share this Article