Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ వైరల్ పోస్టు… వృత్తిని గౌరవించని వాళ్లను చెప్పుతో కొట్టినట్టు…

June 25, 2024 by M S R

ఒక పోస్టు వైరలయింది… బాగా… చాలా మంది మిత్రుల వాల్స్ మీద కనిపిస్తోంది… రచయిత ఎవరో తెలియదు, అందరూ జస్ట్ ‘సేకరణ’ అని పోస్ట్ చేసేస్తున్నారు… నిజంగా ఎవరు రాశారో గానీ బాగా రాశారు… ఈ పోస్టులో హీరో ఓ చెప్పులు కుట్టే వ్యక్తి… మరేముంది ఇందులో..?

తనకు అన్నం పెట్టిన వృత్తి పట్ల గౌరవముంది… అది భక్తి… అయితే సోషల్ మీడియా కదా, కొందరు భిన్నంగా కూడా స్పందించవచ్చు… కానీ వృత్తిని గౌరవించడం అనే ఒక్క పాయింట్ వద్ద అందరూ అంగీకరించాల్సిందే… అదీ అన్నం పెట్టిన వృత్తిని… పెద్ద పెద్ద పదవుల్ని, ఆస్తుల్ని, అపారమైన సంపదల్ని ఇచ్చినా సరే… చాలామంది బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు దేశం మీద పడి దోచుకుంటున్నారు కదా… వాళ్లతో పోలిస్తే ఈ హీరో… నిజంగా హీరో… అది చెప్పడానికే ఈ పోస్టును ఇక్కడ పొందుపరుస్తున్నాను… (అజ్ఙాత రచయితకు అభినందనలతో…)



ఇది క‌దా జీవితమంటే..!

Ads

వారం రోజుల కింద‌ట తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజ‌య‌వాడ‌లో కుట్టేవారిని క‌నిపెట్ట‌డం పెద్ద టాస్కే అయ్యింది. మొత్తానికి అయ్య‌ప్ప‌న‌గ‌ర్ రోడ్డులో ఇవాళ ఒకాయ‌న్ని ప‌ట్టుకుని చెప్పు కుట్టించుకున్నాను. అన్నిచోట్లా ఇర‌వై రూపాయ‌లు తీసుకుంటుంటే ఆయ‌న ప‌ది రూపాయ‌లే తీసుకున్నాడు. స‌రే, ప‌నేం లేదు క‌దా అని ఆయ‌నతో కాసేపు మాట్లాడాను.

ఆయ‌న తాత‌, తండ్రుల‌ది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్ల‌లు ఏం చేస్తున్నారు? అని అడిగితే చెప్పాడు అస‌లు విష‌యం. వాళ్ల‌బ్బాయి ఇంజ‌నీరింగ్ చ‌దివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. య‌న‌మ‌ల‌కుదురులో 7 సెంట్ల‌లో సొంతిల్లు. నెల‌కు వ‌చ్చే అద్దెలు 25 వేలు. నున్న‌లో ఎక‌రం మామిడి తోట‌. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావ‌ని అడిగితే —

“ఒక‌ప్పుడు ఈ ప‌నే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ ప‌నిచేసే అప్ప‌ట్లో రేటు త‌క్క‌ువని నున్న‌లో మూడెక‌రాలు కొంటే నా వాటా ఎక‌రం వ‌చ్చింది. మా చిన్న‌ప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డ‌బ్బులకు బ‌దులు వ‌డ్లు ఇచ్చేవారు. అవి స‌రిపోక మా అమ్మ వ‌రి కోసిన పొలాల్లో ప‌రిగె ఏరుకొచ్చి అందులో గింజ‌లను వేరుచేసి మాకు అన్నం పెట్టేది. మేం త‌ర‌త‌రాలుగా ఆధార‌ప‌డి బ్ర‌తికిన ప‌ని ఇది. డ‌బ్బులున్నా ఈ ప‌ని చేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది ” అని ఆయ‌న చెప్పిన మాట‌లు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి ఉద‌యం నుంచి సాయంత్రం ఏడింటి దాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పాడు.

viral

వెనక కావాల్సినంత ఆదాయం ఉంద‌న్న ధీమా లేదు. ఒక‌రోజు కుట్ట‌క‌పోతే ఏంకాదులే అనే ఆలోచ‌న లేదు. అందుకే ఆదివారం కూడా అక్క‌డే ఉన్నాడు. నా త‌ర్వాత మ‌రొకాయన వ‌చ్చి 200 నోటుకు చిల్ల‌ర ఉందా? అని అడిగితే ఫ‌ర్లేదు స‌ర్ ఈసారి వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు.

సింపుల్‌గా ఉండే ధ‌న‌వంతులు మ‌న‌కు రోల్‌మోడ‌ల్‌. సుధా నారాయ‌ణ మూర్తి సాదాసీదా నేత చీర క‌ట్టుకుంటే అదొక ఆశ్చ‌ర్యం మ‌న‌కి. సెల‌బ్రిటీలు రోడ్డు ప‌క్క‌న ధాబాలో తింటే అదీ ఒక వార్తే. అలా ఉండ‌టం వారి గొప్ప‌త‌న‌మే. ఈ చెప్పులు కుట్టే ఆయ‌న కూడా ఆ కోవ‌కి చెందిన వాడే. ఆయ‌నకు చ‌దువు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పిల్ల‌ల్ని చ‌దివించుకున్నాడు.

ఇవాళ కూర్చుని తినే స్థితికి చేరాడు. అలాగ‌ని అన్నం పెట్టిన వృత్తిని వ‌దల్లేదు. 59 ఏళ్ల ఆ ముస‌లాయ‌నకు ప‌ళ్లు ఊడిపోయే ద‌శ వ‌చ్చింది, అందుకే మాట స్ప‌ష్టంగా రావ‌ట్లేదు. నిరంత‌ర క‌ష్టం వ‌ల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేర‌లేదు. ఉద‌యం అన్నం తిని రావ‌డం. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లొచ్చి మ‌ళ్లీ రాత్రి వ‌ర‌కూ అక్క‌డే చెప్పులు కుట్ట‌డం. ఇదే సంతృప్తి అంటున్నాడు.

ఆయ‌న వైపు నుంచి చూస్తే ఆయ‌న‌కిదే విలాస‌వంత‌మైన జీవితం. ఈ మ‌ధ్య ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో చూశా. ప‌చ్చ‌ని పొలాల మ‌ధ్య‌లో చిన్న పంపుసెట్ లాంటి ఇంట్లో ఒకాయ‌న ద‌ర్జాగా కూర్చున్న ఫొటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగ‌ళా ఉన్నా వ‌స్తుందా? అనేది ప్ర‌శ్న‌. విలాసం, ఆనందం అనేవి న‌చ్చిన జీవన విధానంతో వ‌స్తాయి త‌ప్ప, కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు. (ఫోటో మీద కనిపిస్తున్న డేట్‌ను బట్టి రెండు రోజుల క్రితందే ఈ పోస్టు…)



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions