ఫాఫం… మాకిరెడ్ది అనబడే ఔత్సాహిక కార్టూనిస్టును అనాల్సిన పనేమీ లేదు… పత్రిక ఎడిటోరియల్ లైన్ ఏమిటో, పొలిటికల్ దాస్యం ఏమిటో దానికే కట్టుబడి కార్టూన్లు గీయాలి కదా… లేకపోతే ఈనాడు నుంచి తరిమేస్తారు కదా… అంతటి శ్రీధరుడినే పంపించేశారు, ఈ కొత్త కార్టూనిస్టులు ఎంత..?
విషయం ఏమిటంటే..? పత్రిక కథనాలకు దీటుగా కార్టూన్లు కూడా నాసిరకంగా తయారయ్యాయని చెప్పడమే… అప్పుడంటే రామోజీరావు స్వయంగా పత్రిక వ్యవహారాలను చూసుకుంటున్నప్పుడు తను స్వయంగా శ్రీధరో, పాపా కార్టూనిస్టో రోజుకు పది కార్టూన్లు గీసి చూపిస్తే ఒక్కటి సెలెక్ట్ చేసేవాడు… అద్భుతంగా పేలేవి అవి…
ఇప్పుడు సరైన గైడెన్స్ లేదు, ఏదో ఒకటి సెలెక్ట్ చేశామా, పబ్లిష్ చేశామా అన్నట్టున్నాయి… ఒక పొలిటికల్ కార్టూన్ అంటే పది సుదీర్ఘ కథనాల పెట్టు… వ్యంగ్యం ఉండాలి, చురక తగలాలి గట్టిగా.,. చదివేవాడే కాదు, ఆ కార్టూన్‌కు గురయ్యేవాడూ భుజాలు తడుముకోవాలి అర్జెంటుగా… లోలోపల భలే గీశావు బ్రదర్ అనుకునేలా ఉండాలి… అబ్బే, తెలుగులో పొలిటికల్ కార్టూన్లకు అంత సీన్ లేదు, పాపం శమించుగాక… కాకపోతే అది కార్టూనిస్టుల ఫెయిల్యూర్ కాదు, ఆయా పత్రికల ఎడిటోరియల్ లైన్స్ ఫెయిల్యూర్… దానికి కార్టూనిస్టుల్ని నిందించాల్సిన పనిలేదు, మంచి కార్టూన్లు గీయడంలో చాతుర్యం లేక కాదు…
Ads
ఈ కార్టూన్ ఏపీ ఎడిషన్‌లో కనిపించింది… ఈరోజుకూ చంద్రబాబు ప్రభుత్వం ప్లస్ టీడీపీ పార్టీ ప్లస్ చంద్రబాబు నాయకత్వం ప్లస్ వాటి మైకులు అనబడే మీడియా కూడా పదే పదే ఎన్టీయార్ పేరును ఇంకా వాడుకోవడమే… దారుణంగా వెన్నుపోటు పొడిచి, మానసికంగా కృంగిపోయి, మరణించేలా చేసిన పాపం మూటగట్టుకునీ ఇంకా ఆ పేరును తమ ఫాయిదా కోసం ఉపయోగించుకోవడమే…
తను మరణించడానికి ముందు చంద్రబాబు నానా బూతులూ తిట్టినవాడే కదా ఎన్టీయార్… తన మరణం తరువాత ఎప్పుడో చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ల పునరుద్దరణ కోసం దీక్ష చేయడం ఏమిటి స్వర్గంలో..? అన్న క్యాంటీన్ల పునరుద్దరణతో ఆయన దీక్షను విరమించాలని ఎవరో దేవ ప్రతినిధి ఆనందంగా చెప్పడం ఏమిటి..? దీంట్లో అస్సలు పొలిటికల్ ఫ్లేవర్ లేదు, సెటైర్ లేదు… ఉత్త భజన తప్ప…
ఎస్, అన్న క్యాంటీన్లను మూసేయడం ఖచ్చితంగా జగన్మోహన్‌రెడ్డి తప్పు… తప్పున్నర… పదిమందికి చౌకగా పట్టెడన్నం పెట్టే స్కీమ్ రద్దు చేయడంతో జగన్ సంపాదించుకున్న పుణ్యమేమిటి..? పోనీ, ప్రత్యామ్నాయంగా తనేం చేశాడు..? తెలంగాణలో కాంగ్రెస్ ప్రారంభించిన చౌక భోజనం కౌంటర్లను బీఆర్ఎస్ కొనసాగించింది, నిజానికి ఆ సంఖ్య పెంచింది… ఇప్పుడు రేవంత్ ప్రభుత్వమూ కొనసాగిస్తుంది… అదీ స్పిరిట్…
ప్రత్యేకించి హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద ఇవి అవసరం… ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహణ, తన వాటా కొంత, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కొంత… రుచి, శుభ్రత భేష్… ఇంకా సంఖ్య పెంచడమే, ఇతర ప్రాంతాలకు విస్తరించడమో, అల్పాహారం కూడా ప్రవేశపెట్టడమో చేయగలిగితే రేవంత్‌రెడ్డిని వేలాది మంది పేదలు రోజూ దీవిస్తారు… సర్లెండి, ఇచ్చిన హామీలను అమలు చేయమనండి చాలు అంటారా..? నో కామెంట్..!!
అవునూ, చంద్రబాబు పునరుద్ధరించే అన్న క్యాంటీన్లు… రామన్న క్యాంటీన్లా..? చంద్రన్న క్యాంటీన్లా… లోకేషన్న క్యాంటీన్లా..? పవనన్న క్యాంటీన్లా..? ఈసారి కార్టూన్ గీసేటప్పుడు ఆ క్లారిటీ ట్రై చేయాలి బ్రదర్…!!
Share this Article