అనుకుంటున్నదే… సాక్షి క్యాంపు ఎదురుదాడికి దిగుతుందని ఊహించిందే… సజ్జన్ జిందాల్ అనబడే ఓ బడా డబ్బున్న మనిషిని లైంగిక దాడి కేసు నుంచి రక్షించడానికి, ముంబై సినిమా నటి కాదంబరి జెత్వానీని ఏపీ పోలీసులు లిఫ్ట్ చేసి, వేధించి, తప్పుడు కేసులు పెట్టి, ముంబైలో రేపు కేసును అరాచకంగా విత్ డ్రా చేయించారని మొన్నటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్లస్ టీడీపీ టీవీ మీడియా కథలుకథలుగా రాస్తున్న సంగతి తెలిసిందే కదా…
ఇద్దరు ఐపీఎస్‌లు, ఓ ఐఏఎస్ సహా ప్రభుత్వ ముఖ్యులు కూడా ఈ దారుణంలో పాలుపంచుకున్నారని… జిందాల్ స్టీల్ ఎండీని కాపాడటానికి జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా ఓ ఆడపిల్లను వేధించి, సదరు సజ్జన్ జిందాల్ సేవలో తరించిందనీ ఆ వార్తల సారాంశం… చంద్రబాబు ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఓ ఏసీపీకి బాధ్యత అప్పగించింది… సరే, మరి సాక్షి క్యాంపు ఆత్మరక్షణ మాటేమిటి..?
ఇక తనూ మొదలుపెట్టింది… కాదంబరి జెత్వానీ హానీ ట్రాప్ స్పెషలిస్టు అట… డబ్బున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉన్నతాధికారులకు వల వేసి, ఎక్కడో ఫిక్స్ చేసి, డబ్బులు వసూలు చేసేదట… దీనికి దుబయ్‌లో ఉండే సోదరుడు అంబరీష్ జెత్వానీ సాయం చేస్తాడట… తనకు దుబయ్ అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని తను బెదిరించేవాడట… ఇలా వీళ్లిద్దరూ కోెట్లకుకోట్లు సంపాదిస్తున్నారట…
Ads
సేమ్, అదే మాఫియాలో భాగంగానే ఏపీ విద్యాసాగరుడికీ వలవేసిందట ఈమె… బెదిరించిందట… దాంతో ఏపీ పోలీసులు అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, అత్యంత చట్టబద్దంగా, అత్యంత చాకచక్యంగా, అత్యంత పరిణత పద్ధతుల్లో ఆమెను మర్యాదగా పట్టుకొచ్చి, కోర్టుకు అప్పగించారట… ఇలా ఆమెను బుక్ చేయడం వల్ల ఓ పెద్ద హానీట్రాప్ మాఫియా నుంచి ముంబైనే రక్షించారనే పద్ధతిలో… అసలు ఈ హానీట్రాప్ మాఫియా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హానీ మేనియా కాబట్టి ఏపీ పోలీసులు అంత వేగంగా, పకడ్బందీగా వ్యవహరించారట…
సరే, కాసేపు సాక్షి చెప్పేదే నిజం అనుకుందాం… కానీ ఇక్కడ ఆమెపై కేసు, జైలు, వేధింపులు, తరువాత వెంటనే అక్కడ రేపు కేసు విత్‌డ్రా అంటేనే అసలు మర్మం ఏమిటో అర్థం కావడం లేదా మాస్టారూ..? విద్యాసాగర్ కేసులో ఆమెను పట్టుకొస్తే, సజ్జన్ జిందాల్‌పై కేసు విత్‌డ్రాకు లింక్ ఎందుకు పెట్టినట్టు..? అసలు ఆ విద్యాసాగరుడు ఎక్కడ..? ఏమైపోయాడు..? మరీ అంతర్జాతీయ హానీ ట్రాపర్‌ను టాకిల్ చేసి, ఆ మాఫియా అంతు చూసే ఉద్దేశమే అయితే మరి ఆమెపై పెట్టిన కేసు ఏమైంది.,.? లోక్‌అదాలత్‌లో రాజీ కుదిరిందని ఆంధ్రజ్యోతి చెబుతోంది, మరదేమిటి..? ఆమె సోదరుడిపై కేసు, తల్లిదండ్రులపై కేసు, 18 బ్యాంకు ఖాతాల సీజర్ అన్నీ వోకే… అంత పెద్ద మాఫియాలో ఆ కుటుంబసభ్యులు మాత్రమే సభ్యులా..?
సాక్షి తొందరపడి, అనేక రకాల సరుకులతో కొత్త కథల్ని వండటానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది… లోకేష్ రెడ్‌బుక్‌లో ఉన్న ఐపీఎస్‌ల మీద కక్షసాధింపులు అట… ఆల్రెడీ యునైటెడ్ బ్రూవరీస్, దాల్మియా, జువారీ వ్యాపారుల నుంచి ముడుపుల కోసం టీడీపీ ప్రభుత్వం వేధిస్తున్నదట… ఇప్పుడు సజ్జన్ జిందాల్‌ను కూడా కావాలనే ఈ కాదంబరి అనే మాయలేడిని ముందుపెట్టి బజారుకు లాగుతున్నారట…
వోకే, ఆమె మాయలేడియే.,. వలపువలల్ని వేసి డబ్బున్న ఆసాములను రప్పించుకుని, తరువాత బ్లాక్ మెయిల్ చేసి, డబ్బు లాగే ఖతర్నాక్ లేడీయే… అనుకుందాం కాసేపు… ఆమె బాధితులందరినీ ఆమె అందచందాల విషవలయం నుంచి విముక్తం చేసే బృహత్తర, లోకోత్తర బాధ్యతను ఏపీ పోలీసులే ఎందుకు చేపట్టినట్టు..? సాధారణంగా పోలీసులపై ఆరోపణలు వచ్చినప్పుడు అనేక కట్టుకథలు చెబుతుండటం చూస్తుంటాం… సాక్షి స్టోరీ కూడా అలాగే ఓ పోలీస్ కథలాగే ఉంది…
పైగా పరిశ్రమలన్నీ ఏపీ నుంచి తరలిపోయే ప్రమాదం కనిపిస్తున్నదట, ఎన్నికల హామీలు అమలు చేయలేక, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా చేస్తున్నారట… ఏదో ఒక కారణానికి కట్టుబడి ఉండొచ్చు కదా సాక్షీ..? ఇన్నిరకాల దినుసులు వేస్తే వంట పాడైపోలేదా..? ఇలాంటి కీలక విషయాల్లో ఏవేవో కారణాలతో ఎదురుదాడి, అదీ అల్లాటప్పా కథనాలతో సమర్థనలు దుందుడుకు ధోరణి… వెయిట్ చేయాలి..!
నిజంగానే చంద్రబాబు ఐపీఎస్, ఐఏఎస్‌లతో గోక్కునేంత ధైర్యవంతుడా..? చూడాలిక ఈ కేసులో..,? డీఓపీటీకి సరెండర్ చేస్తాడా..? తను కూడా కేసులు పెట్టి విచారిస్తాడా..? అంత సీనుందా…? ఎలాగూ రఘురామరాజును వేధించిన కేసులో కూడా జగన్‌తోపాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లను బుక్ చేస్తున్నట్టున్నారు…
ఎందరు ఐపీఎస్‌ల మీద చంద్రబాబు ఉరుముతాడో చూడాలిక… కాకపోతే తన చేతిలో ఉన్నవి చాలా సింపుల్‌గా చేసేస్తాడు… గుట్టుచప్పుడు గాకుండా… మార్గదర్శి మీద జగన్ పెట్టిన కేసుల్ని జస్ట్, అలా చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకోవడం అలాంటిదే… ఈ కాదంబరి జెత్వాని, రఘురామరాజు కేసులు ఎలా డీల్ చేస్తాడో చూడాల్సి ఉంది..!!
Share this Article