IC 814… మన విమాన సర్వీస్ నంబర్… మొన్నటి నుంచీ ఈ పేరు వార్తల్లో ఉంటోంది… ఇది నెట్‌ప్లిక్స్ లో వచ్చే వెబ్ సీరీస్… అప్పట్లో టెర్రరిస్టులు మన విమానాన్ని హైజాక్ చేసి, కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి… జైళ్లలో ఉన్న తమ ఉగ్రనేతల్ని విడిపించుకున్నారు… కాంధహార్ హైజాక్ అప్పట్లో ఓ విషాదం, ఓ సంచలనం…
వివాదం ఏమిటయ్యా అంటే… ఆరు ఎపిసోడ్ల సీరీస్‌లో అరక్షణం పాటు ఇద్దరి టెర్రరిస్టుల పేర్లు పలుకుతారు… అవి భోళా, శంకర్… ఇంకేముంది…? హిందువుల్ని టెర్రరిస్టుల్లా చూపిస్తారా..? చరిత్రకు వక్రబాష్యాలు చెబుతారా..? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కస్సుమన్నారు…
నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ… ఎవరో కంటెంట్ హెడ్ అట, వివరణ ఇచ్చుకుని, ఆ పేర్ల కిందే అసలు టెర్రరిస్టుల పేర్లు డిస్‌క్లెయిమర్లుగానో, క్లారిఫికేషన్‌లాగానో ప్రేక్షకులకు తెలియజెబుతామని చెప్పాక, సద్దుమణిగింది… నిజానికి ఇక్కడ నిర్మాతల తప్పేముంది..?
Ads
హైజాక్ చేసింది ముస్లిం టెర్రరిస్టులని అందరికీ తెలుసు… ఆ సీరిస్ చూసేవాళ్లకు అర్థమవుతూనే ఉంటుంది… భోళా, శంకర్ అని వాళ్లు పెట్టుకున్న కోడ్ నేమ్స్… అసలు పేర్లు బయటపడకుండా…! ఒకరి కోడ్ నేమ్ డాక్టర్ అట… మరో ఇద్దరి కోడ్ నేమ్స్ బర్గర్, చీఫ్… ఇందులో వాంటెడ్‌గా హిందూ మతాన్ని టార్గెట్ చేసిందేముంది..? ఈ పిచ్చి సీరీస్ మీద చూపించే శ్రద్ధను బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు వంటి అవసరమైన విషయాల మీద ఎందుకు చూపించలేకపోయిందో..!
ఇక్కడ కేంద్రం అంత ఉలిక్కిపడి, సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం లేదు… అవి కోడ్ నేమ్స్ అని అర్థమయ్యేలా ఏదైనా ఓ డైలాగ్ గనుక నిర్మాతలు పెట్టించి ఉంటే సరిపోయేది కూడా… ఇక ఈ వివాదం తరువాత నాటి సర్వైవల్స్‌తో మాట్లాడుతూ, వాళ్ల అనుభవాలు చెప్పిస్తూ, కథలుకథలుగా రాస్తూ మీడియా అనవసర హైప్ క్రియేట్ చేస్తోంది… ఒకరకంగా తనే ప్రమోట్ చేస్తోంది ఆ సీరీస్‌ను…
నిజానికి ఈ సీరీస్ అంత నాణ్యంగా ఏమీలేదు… పలుచోట్ల బోర్… కాకపోతే ఆ కథను బట్టి, నాటి సంఘటనలను ఊహించుకుంటుంటే మనకే అర్థమవుతుంది అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎంత నిస్పహాయ స్థితిలో ఉండిపోయిందో… అప్పటి ఉన్నత స్థాయి రక్షణ, నిఘా అధికారగణం నడుమ ఎంతటి సమన్వయ రాహిత్యం ఉందో…
అప్పట్లో మనం వదిలేయాల్సి వచ్చిన టెర్రరిస్టులే తరువాత ఏకులు మేకులై, విషవృక్షాలై, విషయంత్రాంగాల్ని బిల్డప్ చేస్తే… అవి ఈరోజుకూ మనల్ని ఈటెల్లా పొడుస్తూనే ఉన్నాయి… ‘‘మన పిచ్చి ప్రభుత్వం కసబ్ వంటి విషపు పురుగుల్ని జైళ్లలో పెట్టి, కోట్ల కొద్దీ ఖర్చు పెట్టి, బిర్యానీలతో మేపుతుంది… అంతేతప్ప ఇలాంటి టెర్రరిస్టులు దొరకగానే ‘ఖతం’ చేస్తే అయిపోయేది కదా’’ అని ఎవరైనా అనుకుంటే అందులో తప్పుపట్టడానికి ఏమీ కనిపించదు…
దృఢంగా నిలబడి, ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టలేని దురవస్థ నాటిది… తప్పుపట్టలేం, తప్పించుకోలేని స్థితి… మన ఏజెంట్లు, బలగాలు ప్రాణాలకు తెగించి పట్టుకొస్తే… మనం తలలు వంచుకుని వదిలేయాల్సి వచ్చింది… వారిలో ఒకరు మౌలానా మసూద్ అజర్… జైషేమొహమ్మద్ స్థాపకుడు… పార్లమెంటుపై దాడి ఈ సంస్థ పనే… అహ్మద్ ఒమర్ సయీద్ షేక్… డేనియల్ పెరల్ కిడ్నాప్, హత్య కేసులో అరెస్టయ్యాడు… అమెరికా సెప్టెంబరు 11 దాడుల సూత్రధారుల్లో ఒకడు… ముస్తాఖ్ అహ్మద్ జర్దార్… పీవోకేలో మిలిటెంట్లకు శిక్షణ ఇస్తాడు…
అప్పటి ప్రధానిని, హోంమంత్రిని ఉత్సవ విగ్రహాలుగా చూపిస్తుంది ఈ సీరీస్… అందుకేనేమో ప్రస్తుత ప్రభుత్వానికి ఈ సీరీస్ నచ్చడం లేదు… ఈ అతి స్పందన అక్కర్లేదు… అప్పట్లో వాజపేయి కూడా చేయడానికి ఏమీ లేదు… మన దేశం ఇజ్రాయిల్ కాదు, ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే స్థిరంగా, దృఢంగా వ్యవహరించడానికి… తనకు తప్పలేదు…
గుర్తుతెలియని సాయుధులు భారత వ్యతిరేక శక్తులను విదేశీ గడ్డల మీద కూడా ఏరిపారేస్తున్న నేటి రోజులు కావు అవి… పైగా వాజపేయి అందరినీ నమ్మేసి, స్నేహహస్తాలు చాస్తూ, కార్గిల్ వంటి యుద్ధాల్ని కూడా తీసుకొచ్చాడు జాతి మీదకు… నిజానికి అఫ్ఘన్‌లోని తాలిబన్ల సహకారం హైజాకర్లకు ఉంది… మా నేలపై ఎలాంటి యాక్షన్‌ను అనుమతించబోం అని హెచ్చరించింది… దాంతో మన ఎన్ఎస్‌జీ కమెండోలకూ ఏ అవకాశమూ చిక్కలేదు…
36 మంది ఉగ్రవాదుల జాబితా నుంచి ముగ్గురి పేర్ల దాకా తీసుకొచ్చారు రకరకాల ప్రయత్నాలతో… ఆరోజు ఉన్న పరిస్థితి అది… అనివార్యత… అందుకని ఆ నిజాల్ని పెద్దగా నాణ్యతలేని కథనంతో చెబుతున్న ఈ సీరీస్‌పై కాషాయ శిబిరం కస్సుబుస్సు అవసరం లేని అతి స్పందన..!!
Share this Article