ఎవరైనా కమర్షియల్ సైకియాట్రిస్టులు తమ గిరాకీ కోసం ఈసారి బిగ్‌బాస్ షో స్పాన్సర్ చేసి నడిపిస్తున్నారేమో… అలాగే ఉంది చూడబోతే..!
ప్రత్యేకించి నాగమణికంఠకు ఎక్కువ వోట్లు వచ్చాయట.., ప్రేక్షకదేవుళ్లు తను ఖచ్చితంగా హౌజులో ఉండాల్సిందేనని మిస్డ్ కాల్స్, వోట్లతో బిగ్‌బాస్ కంప్యూటర్లు స్టక్కయిపోయే రేంజులో దాడిచేస్తున్నారట…
హౌజులోకి వచ్చింది మొదలు, మెంటల్ గేమ్ ఆడుతున్నాడో, మెంటలేనో తెలియదు గానీ… సింపతీ కార్డు మాత్రం భలే ప్లే చేస్తున్నాడు… నిన్న ఆడుతూ ఆడుతూ కింద పడిపోయాడు… ఏమైందో తెలియక టీమ్ మేట్స్ షాక్… తరువాత కొంతసేపటికి మళ్లీ వచ్చాడు, ఆడతాను అంటాడు… ఆడక తప్పదు అంటారు…
Ads
ఫోరా భయ్, మళ్లీ పడిపోతవ్, నీ హాలత్ బాగాలేదు అని చెప్పినా వినడు… లోపలకు వెళ్లి ఓ మూలకు నక్కి వెక్కుతుంటాడు… క్లాన్ చీఫ్ అట, అభయ్ వెళ్లి సముదాయించబోతే… నీను ఆడాలి, లేకపోతే నా పెళ్లాంపిల్లలు నా దగ్గరకు రారు, నేను గెలిస్తేనే నా సంసారం నిలబడతది అంటాడు… బయట నీ సంసారానికి ఈ ఆటకు ఏం సంబంధమో, ఇది గెలిస్తే వాళ్లెందుకు వస్తరో అర్థం గాక అక్కడి తోటి హౌజ్ మేట్స్ ప్లస్ ప్రేక్షకులు జుత్తు పీక్కుంటారు…
అది ఆటరా తమ్మీ… అందరూ గెలవడానికే వచ్చారు… ఎవడి గేమ్ ప్లాన్ వాడిది… పోటీపడితే పడు, అంతేతప్ప, పదే పదే నా పెళ్లాం, నా పిల్లలు అంటూ అదే కార్డు పదే పదే ప్రయోగించకు… ప్రతిదీ గెలకకు… ప్రేరణ దోసెల విషయంలో ఏదో గొడవపడ్డాడు… చిన్న విషయాన్ని పీకి పీకి పెంట చేశావ్, ఎహె, నువ్వు మాట్లాడుకు పోరా అని ఆమె పురుగును దులిపేసినట్టు దులిపేసింది…
వెళ్లి యష్మిని హత్తుకుంటాడు… బాగా అన్‌కంఫర్ట్‌గా ఉందని ఆమె బిగ్‌బాస్‌కు చెప్పి ఏడుస్తుంది… హహహ, నాకు కావల్సింది ఇలాంటి దిక్కుమాలిన వినోదమే అని బిగ్‌బాస్ ఓ శాడిస్టిక్ నవ్వుతో లోలోపల ఆనందిస్తాడేమో… ఒరేయ్, నా దగ్గరకు రాకురా, నిన్ను కారణం లేకుండా కూడా ప్రతివారం నామినేట్ చేస్తాను, నేనున్నన్నాళ్లూ అని యష్మి ఖండితంగా తేల్చిపడేసింది…
ఆ పృథ్వి అనేవాడికేమో హగ్గుల యావ… అసలు అవసరం లేకుండా, ఏదో మధ్యలోకి దూరి ఎవరో ఒకరిని హగ్ చేసుకుంటాడు, ఇదో తిక్క కేసు… అరుస్తాడు, ఆవేశం… మణికంఠుడికన్నా అసలు ఈయనకే ఎక్కువ మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టుంది… తోడుగా యష్మి అరుపులు సరేసరి… రఫ్‌గా పైపైన పరిశీలిస్తే నైనిక అనే అమ్మాయే కూల్‌గా ఆడుతున్నట్టుంది…
బిగ్‌బాస్ ఇంకా గమనించినట్టు లేడు… గమనిస్తే ఆమెను కూడా ఏదో గొడవలోకి లాగుతాడు… మరి గొడవలు లేకపోతే బిగ్‌బాస్ ఎక్కడిది..?
Share this Article