.
ముందుగా ఓ వార్త చదవండి… దాదాపు అన్ని పత్రికల్లోనూ వచ్చింది… అందరూ స్పందించారు… జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబి గద్దె ప్రాంతానికి చెందిన కాసారపు సరిత- శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు పిల్లలు కలగలేదు…
దాంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును దత్తత తీసుకున్నారు… పక్కాగా హిందూ సంప్రదాయం మేరకు జరిగింది… మూడేళ్లు సాఫీగా గడిచిపోయాయి… ఆ పిల్లాడిని బాగా పెంచుకుంటున్నారు… కానీ..?
Ads
సదరు శ్రీనివాస్‌గౌడ్ బంధువులు ఆస్తి తగాదా విషయమ్మీద అతడితో గొడవపడి గత ఆగస్టులో బాలుడి దత్తతపై అధికారులకు ఫిర్యాదు చేశారు… దాంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు జోక్యం చేసుకొని ఆ బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రుల నుంచి సెప్టెంబరు 16న స్వాధీనం చేసుకొని, కరీంనగర్ శిశుగృహకు తరలించారు.,,
సంప్రదాయం మేరకు మూడేళ్ల క్రితమే దత్తత తీసుకున్నామని చెప్పినా… ‘ప్రభుత్వ సిబ్బంది కదా…’ నొప్పి తెలియదు కదా… వినలేదు… దత్తత తీసుకున్న దంపతులు తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు…

దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంతకే బిడ్డను చేర్చాలని హైకోర్టు గత నెల 16న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు తాత్సారం చేస్తున్నారు… చిన్నారిని తనివితీరా చూసుకునేందుకు సంరక్షణ కేంద్రానికి ఆ తల్లి వెళితే… ‘నన్ను తీసుకెళ్లు అమ్మా.. ఇక్కడ భయంవేస్తోంది’ అంటూ ఆ బిడ్డడు గుక్కపెట్టి ఏడ్చాడు… అప్పటికే బాధతో బరువెక్కిన గుండెలతో ఉన్న ఆ దంపతులూ కన్నీరు అపుకోలేక భోరుమన్నారు…
ఇది సోషల్ మీడియాలో వైరలైంది… వైరల్ కావాల్సిన సీనే… ఏమాత్రం సున్నితత్వం లేని ప్రభుత్వ సిబ్బంది వల్ల ఓ బాలుడు హోంలో యాతన పడటం… మనకు తెలుసు కదా ప్రభుత్వ శిశుగృహలో పరిస్థితులు ఎలా ఉంటాయో… జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు ఆ దంపతులు…
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, సీడబ్ల్యూసీ అనుమతి, ఇతర పరిపాలన పరమైన ప్రక్రియల కారణంగా బాలుడిని అప్పగించడంలో కొంత జాప్యం జరిగిందన్నారు,,. ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి మంగళవారం ఉదయంలోగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు బాలుడిని అప్పగిస్తామని కలెక్టర్ తాపీగా ఓ వివరణ ఇచ్చినట్టు వార్తల్లో ఉంది…

కానీ ఇక్కడ కలెక్టరే బదులు చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలున్నాయి… (ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది… ఇలాంటి అధికారులకు ‘నొప్పి’ తెలియదు, అనుభవించేది వాళ్లు కాదు కదా…)
1) గత నె 16న కోర్టు చెబితే, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇన్నిరోజులు ఎందుకు అప్పగించలేదు..? శిశువును స్వాధీనం చేసుకున్నప్పుడు బుల్లెట్ రైలు వేగంతో స్పందించిన సిబ్బందికి ఇప్పుడెందుకు చేతకాలేదు..? ఎవరు ప్రభావితం చేస్తున్నారు..? ఎందుకు..?
2) అసలు హిందూ సంప్రదాయం మేరకు దత్తత తీసుకుంటే, అదెందుకు చెల్లుబాటు కాదు..? మూడేళ్లుగా లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు..? ఐనా వాళ్లేమీ పారిపోవడం లేదు కదా, ఆ పేరెంట్స్ నుంచి అంత కర్కశంగా లాక్కుని వెళ్లి హోంలో పడేయడం దేనికి..? దత్తత చెల్లదని నోటీసు ఇవ్వండి, వాళ్లే కోర్టులో కొట్లాడతారు, పిల్లాడిని స్వాధీనం చేసుకునేంత అత్యుత్సాహం దేనికి..?
3) ప్రజావాణిలో ఆ పెంచుకున్న పేరెంట్స్ ఫిర్యాదు చేస్తే… కలెక్టరే ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేసుకోండంటూ’ దరుసుగా సమాధానం చెప్పాడని సోషల్ మీడియా చెబుతోంది… దీనికి కలెక్టర్ జవాబు ఏమిటి..? తనకెందుకు ఈ కేసులో అంత ఇంట్రస్టు..? ఆ దత్తతపై ఎందుకు ఈ కోపం, ఈ అసహనం..? చివరకు హైకోర్టు చెప్పినా ఖాతరు చేయనంతగా ఎవరు ప్రభావితం చేస్తున్నారు..? ఎందుకు..?
4) పోనీ, తమరి తప్పేమీ లేదు అనుకుందాం కాసేపు… ఇప్పుడు బిడ్డను అప్పగిస్తా అంటున్నావు సరే, అదీ సోషల్ మీడియాలో ఆ పేరెంట్స్ బాధ వైరలయ్యాక… మరి బాధ్యులైన మీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది మీద ఏం చర్యలు తీసుకున్నావు..? కోర్టు చెప్పినా బిడ్డను అప్పగించలేదు కదా… వాళ్లను ఎవరు కాపాడుతున్నారు..? ఎందుకు..?
….. ఇవి పైకి చిన్న విషయాలుగా కనిపిస్తాయేమో… కానీ అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ… పైగా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం ఇంగితం లేకుండా కొన్నిసార్లు ఎలా వ్యవహరిస్తారో చెప్పడానికి ఈ చిన్న అంశాలు అతి పెద్ద ఉదాహరణలు… చీఫ్ సెక్రెటరీకి ఈ కేసు తెలుసో తెలియదో, హైకోర్టయినా సూమోటోగా తీసుకుని కాస్త కన్నేస్తే బాగుండు..!!
Share this Article