.
మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్టు చేయడం లేదేం అని ఉరుముతున్నాడు కేటీయార్… ఆ వార్త చూస్తే నవ్వొచ్చింది… అప్పట్లో ఓసారి అదే మేఘా కృష్ణారెడ్డికి ఏదో సభలో సన్మానం చేసింది కూడా తమ పాలనకాలంలోనే అని గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… ఇదుగో ఆనాటి గొప్ప వార్త క్లిప్పింగ్…
Ads
ఎందుకు బ్లాక్ లిస్టు చేయాలయ్యా అనడిగితే… సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలింది వాళ్ల వల్లే… హమ్మా, వాళ్లను నిషేధించాలి కదా అంటున్నాడు… పైగా కొడంగల్ లిఫ్టులో 4350 కోట్ల పనులు ఇస్తారా..? ఇంత ద్రోహమా..? ఇక్కడే కాదు, దేశమంతా బ్లాక్ లిస్టులో పెట్టాలి, చూడబోతే మూసీ లక్షన్నర కోట్ల ప్రాజెక్టూ మేఘాకే ఇచ్చేట్టున్నారు… రేవంత్‌కు ఎన్ని..? ఢిల్లీకి ఎన్ని కోట్లు..? అనీ ఉరిమాడు…
గుడ్, ప్రతిపక్షం వాచ్ డాగ్‌లా ఉండాలి… అక్రమాల జాడపట్టాలి, పసిగట్టాలి, ఎండగట్టాలి… కానీ అదే మేఘాతో మనమేం అడ్డగోలు ప్రయోజనాలు పొందామనేది, మనమేం పనులిచ్చామనేది మరిచిపోతే ఎలా..? జగన్, చంద్రబాబు, కేసీయార్, రేవంత్ రెడ్డి… ఎవరు కుర్చీలో ఉన్నా సరే మేఘాకే ప్రాధాన్యం, పనుల్లో పెత్తనం…
వాళ్లకేం పనులు కావాలో వాళ్లే ఎంచుకుంటారు..? ప్రభుత్వంతో ఇప్పించుకుంటారు… ఎవరికి పారేసేది వాళ్లకు పారేస్తారు..? అందుకే ఒకప్పుడు ఓ సాదాసీదా సబ్ కంట్రాక్టర్ ఇప్పుడు ఆదానీ, అంబానీ, వేదాంతలకు దీటుగా ఎదిగి, ఫోర్బ్స్‌లో కూడా చేరారు… పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి… అసలు వాళ్లు అడుగుపెట్టి విస్తరించని రంగం లేదు ఇప్పుడు… విదేశాలకూ విస్తరిస్తారు… గత దశాబ్దంలో భారత వ్యాపార కంపెనీల్లో అదొక అసాధారణమైన హ్యూజ్ సక్సెస్ స్టోరీ… అక్రమమో సక్రమమో… పెద్ద పెద్ద కంపెనీలన్నీ అంతే కదా…
సీబీఐ కేసులు, ఈడీలు, ఐటీలు జాన్తానై… ఢిల్లీకి కూడా దగ్గరే… వాళ్లది పార్టీ కాదా ఏం..? బీజేపీ వాళ్లకూ పార్టీ అవసరాలుంటాయి, ఖర్చులుంటాయి… దానికి తగినట్టే పార్టీలన్నింటికీ మేఘా విస్తుపోయే రేంజులో విరాళాలూ ఉంటాయి… మొన్నెక్కడో చదివినట్టు గుర్తు… పిచ్చిరెడ్డి బర్త్‌డేకు సన్నీలియోన్ డాన్సులు… కృష్ణారెడ్డి భార్యకు 55 కోట్ల కారు బహుమతి, 9 కోట్లతో ఫంక్షన్… ఆమె కోట్ల ఖర్చుతో సాగే మెట్‌గాలాలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది.., సరే, ఆమె లావిష్ లైఫ్ స్టయిల్ గురించి కాదు గానీ…
ఈరోజు కేటీయార్‌కు మేఘా అరాచకం హఠాత్తుగా గుర్తొచ్చింది… ఒకప్పుడు మేఘా, కేసీయార్ ఎంత సన్నిహితులో తెలంగాణ సమాజం మరిచిపోయిందా ఏం..? అప్పట్లో చంద్రబాబు, కేసీయార్ కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బులిచ్చారనీ, మేఘా డబ్బు బాగా తరలించారనీ మోడీ రుసరుసలాడినట్టు వార్తలు కూడా వచ్చాయి… అలాంటిది కేటీయార్ మేఘా మీద నోరుపారేసుకోవడం చూస్తే నవ్వొచ్చింది అందుకే…
ఎస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేఘాకు ఇచ్చిన ఓ జలమండలి పాత కంట్రాక్టును రద్దు చేసింది… అది కేసీయార్ ఇచ్చిందే… ఎక్స్‌పెన్సివ్… నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు అది… అదొక పిచ్చి ప్రాజెక్టు అని తెలిసి రేవంత్ దాన్ని రద్దు చేశాడు… ఏమో, తను ఆలోచించిన కొత్త రూపంలోని ప్రాజెక్టును మళ్లీ మేఘాకే ఇస్తాడేమో తెలియదు గానీ…
మరి ఆ అదిక ధర, ఆ అధిక అంచనాలు, డొంకతిరుగుడు నీళ్ల తరలింపు ప్రాజెక్టును కేసీయార్ మేఘాకు ఎందుకు ఇచ్చినట్టు..? పైగా ఇప్పుడు అంచనాలు పెంచారని కేటీయార్ మాట్లాడుతున్నాడు… జలమండలి కూడా ఖండన రిలీజ్ చేసింది… అంతా రాజకీయం…
రేవంత్ అయినా, కేటీయార్ అయినా… అధికారంలో ఉంటే మేఘా కృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడు… కావల్సినవాడు… అధికారంలో లేకపోతే మేఘా ఓ ఈస్ట్ ఇండియా కంపెనీ… ఈ వార్తలన్నీ చదువుతూ కృష్ణారెడ్డి ఏమనుకుంటాడు..? జస్ట్, పకపకా నవ్వుకుంటాడు… ఎన్ని చూశాడు తను..? ఎన్ని చూడకపోతే ఈ స్టేటస్‌కు చేరుకున్నాడు..! (కేసీయార్ అవినీతి సొమ్ము మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందని షర్మిల చేసిన విమర్శ కూడా గుర్తొచ్చింది ఇవన్నీ చదువుతుంటే…)
సర్, కేటీయార్ సర్… ఇదే మేఘా కృష్ణారెడ్డి స్కిల్ యూనివర్శిటీ కోసం 200 కోట్లు ప్రకటించాడు, విరాళమేనట… మేఘా వంటి వ్యాపారి 200 కోట్లు ఇచ్చాడంటే… ఇంకెంత పెద్ద ప్లాన్ వేసి ఉంటాడు..? ఈసారి నీ విమర్శల్లో ఇదీ చేర్చాలి సుమా… పంచ్ ఉంటుంది..!! (అవునూ, పిచ్చిరెడ్డిని మొత్తంగానే మేఘా నుంచి వెళ్లగొట్టడానికి కృష్ణారెడ్డి ప్లాన్లు వేస్తున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి… అది ఏమైందో…!!)
Share this Article