.
ఎక్కడో చదివాను… ప్రస్తుతం ఇండస్ట్రీకి ఓ దాసరి నారాయణరావు కావాలి అని… అంటే ఓ పెద్దన్నలా ఏ సమస్య వచ్చినా సామరస్యంగా తన వంతు ప్రయత్నాలతో ఇండస్ట్రీకి మంచి చేసేవాడు కావాలి అని… ఒక సంధానకర్త కావాలి… తను లేని లోటు ఇప్పుడు కనిపిస్తోంది…
అవును, అప్పట్లో దాసరి ఏ ఇష్యూ వచ్చినా సరే తను ముందు నిలబడేవాడు… ప్రభుత్వంతో గానీ, ఇండస్ట్రీ ఇంటర్నల్ ఇష్యూస్ గానీ… మరి ఇప్పుడెవరున్నారు..? నిజానికి దాసరి కాలం వేరు… ఇప్పటి ప్రభుత్వాలు వేరు…
Ads
చంద్రబాబుకు ఇండస్ట్రీ పెద్దలతో సత్సంబంధాలు… తన కుటుంబమే సినిమా కుటుంబం కదా… కేటీయార్ కూడా ఇండస్ట్రీ వాళ్లతో రాసుకుని పూసుకుని తిరిగేవాడు… కానీ జగన్ సినిమా వాళ్లను అస్సలు దేకలేదు… వాళ్లు చంద్రబాబు సానుభూతిపరులే తప్ప తన అధికారాన్ని కూడా ఖాతరు చేయలేదనే కోపం ఉండేది తనలో… హార్ష్‌గా అనిపించినా సరే, సినిమా పెద్దలను తన దగ్గరకు రప్పించుకుని మరీ… వాళ్లకు పరిమితులు చూపించాడు…
ఎందుకోగానీ, రేవంత్ రెడ్డితో కూడా టాలీవుడ్ బాగాలేదు… ఈ ప్రభుత్వంలోని మంత్రులు గానీ, సీఎం గానీ పెద్దగా ఏ సినిమా ఫంక్షన్‌లోనూ కనిపించలేదు… దూరం ఉంది… దీనికితోడు దేవర ప్రిరిలీజ్ రద్దు, మోహన్‌బాబు కుటుంబసభ్యులపై కేసులు, అల్లు అర్జున్ మీద కేసు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, బాలయ్య ఇంటికి రెడ్ మార్క్… ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంది…
గతంలో చిరంజీవి దాసరిలాగా పెద్దన్న పాత్రకు సిద్ధమై… ఇప్పుడున్న స్థితిలో అదయ్యే పని కాదని గ్రహించి తప్పుకున్నాడు… చెప్పుకున్నాం కదా, ఇది దాసరి కాలం కాదు… ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను, తప్ప పెద్దరికం నాకు వద్దు అని తేల్చిపడేశాడు చిరంజీవి… నిజానికి మాటతీరు, మర్యాద, మన్ననతో ఇష్యూస్ సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలకు చిరంజీవే కరెక్టు… తనకు అందరితోనూ సత్సంబంధాలే ఉన్నాయి…
నాగార్జునకు చేదు అనుభవం ఉంది కాబట్టి తను ముందుకు రాలేడు… బాలకృష్ణ ఒక పార్టీ మనిషి… తనకూ దూకుడు, అహం ఎక్కువ… దిల్ రాజు..? తను ప్రభుత్వంలోని మనిషి… ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోలేడు… అల్లు అరవింద్ తనే చిక్కుల్లో ఉన్నాడు… ఇలా హీరోలు, నిర్మాతల్లో ఎవరూ ఈ పెద్దరికానికి రెడీగా లేరు, అందరికీ ఏదో సమస్య…
రాజమౌళి వంటి పెద్ద దర్శకులకు తమ పనేమిటో తమది… వేరే గొడవల్లోకి వెళ్లరు… మోహన్‌బాబు దూకుడు ఈ పెద్దరికానికి పనికిరాదు… మా, ఫిలిమ్ చాంబర్ వంటివీ ఇలాంటి వివాదాల్లో నిష్క్రియాపరత్వమే… మురళీ మోహన్, రాఘవేందర్‌రావు వర్తమానంలో యాక్టివ్ పర్సనాలిటీస్ కావు… పైగా చంద్రబాబు అనుకూల ముద్ర… ఇంకెవరున్నారబ్బా..!?
ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ గనుక రద్దయి, మళ్లీ జైలుకు వెళ్లే స్థితి వస్తే… ప్రభుత్వానికీ టాలీవుడ్‌కూ నడుమ అగాధం ఏర్పడుతుంది… మొన్న అందరూ బన్నీ ఇంటికి వరుస కట్టి ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా..!! ఎక్కడిదాకా వెళ్లింది ప్రచారం అంటే, ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుంది అన్నంతగా..! అంత సీన్ ఏమీ లేదు గానీ… ఏవో ఝలక్కులు..!!
వ్యవహారం ముదురుతుండేసరికి… బన్నీ మామ (ప్రస్తుతం కాంగ్రెసే) స్వయంగా వెళ్లి తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దగ్గర ఏవో రాజీ ప్రయత్నాలు చేశాడు… ఢిల్లీలోనూ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయట… కానీ బన్నీ మామ తనకు చుట్టమేననీ, తమ పార్టీయేననీ, కానీ ఈ ఇన్సిడెంట్‌లో తానేం చేయలేనని ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చాడు..!! పెద్దన్నలు ఎవరూ లేక, ఎవరి బాధలు వాళ్లే పడాల్సి వస్తోంది ఇలా..!!
Share this Article