.
మొన్న ఒక వార్త కనిపించింది… ఆషికి-3 సినిమాకు మొదట్లో అనుకున్న తృప్తి దిమ్రిని తరువాత వద్దని చెప్పారట… నిజానికి ఈ సినిమాను 2022లోనే అనౌన్స్ చేసినా ఇంకా పట్టాలెక్కలేదు…
కాకపోతే ఆషికి-2 సక్సెసయ్యేసరికి ఈ మూడో పార్ట్ మీద బాగా ఆశలు, అంచనాలున్నాయి… మరి తృప్తి పేరును ఎందుకు కొట్టేశారు… ఎందుకయ్యా అంటే యానిమల్‌లో బోల్డ్, ఇంటిమేట్ సీన్లలో ఉదారంగా నటించింది కదా…
Ads
ఆమెకు అదోరకం ఇమేజ్ వచ్చింది, అది ఆషికి-3లో మెయిన్ లీడ్ పాత్రకు సూట్ కాదు అనేది సినిమా టీం అభిప్రాయం అట… దాందేముంది..? పాత్రను బట్టి నటన అని పలువురు కన్విన్స్ చేసినా టీం వినిపించుకోలేదు, అదంతా వేరే సంగతి… ఆ పాత్రకు ఇప్పుడు శార్వరి అనే నటిని తీసుకుంటారట…
ఎవరబ్బా ఆమె అని చూస్తే… ఆమె వయస్సు జస్ట్, మూడే సినిమాలు… 2015 నుంచి ఫీల్డులో ఉన్నా రెండు మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆమె… సంజయ్ లీలా భన్సాలీ దగ్గర కూడా చేసింది… తరువాత నటి… మూడే సినిమాల వయస్సున్న ఆమెకు ఇప్పుడు ఆషికి-3లో చాన్స్ అంటే విశేషమే, ఈ ఫీల్డు అంతే…
ఇవన్నీ కాదు, ఇంట్రస్టింగుగా అనిపించింది ఏమిటంటే..? ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోకసభ స్పీకర్ మనోహర్ జోషి మనవరాలు… సాధారణంగా రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి సినిమా తారలు అరుదు… అదే చదువుతూ ఉంటే స్మితా పాటిల్ గుర్తొచ్చింది…
కొత్తగా ఏ పరిచయ వాక్యాలూ అవసరం లేని నటి… ఆమె తండ్రి పేరు శివాజీరావు గిరిధర్ పాటిల్, తల్లి విద్యాతాయి… స్వాతంత్ర్య సమరయోధుడు, సోషల్ యాక్టివిస్టు, పొలిటిషియన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, పద్మభూషణ్… తల్లిదండ్రులు ఇద్దరూ హేతువాదులు… వాళ్ల పెళ్లి కూడా సంప్రదాయాలకు విరుద్ధంగా సింపుల్‌గా జరిగింది… ఆమె తల్లి మరణించేవరకు, అంటే 77 ఏళ్ల దాంపత్యం వాళ్లది…
ఓసారి ఎవరో అడిగారు ఆయన్ని… మీ అమ్మాయి సినిమాల్లో నటిస్తున్నందుకు మీకేమీ నారాజ్ లేదా అని… దానికి ఆయన ఇచ్చిన సమాధానం బాగుంది… ‘‘తప్పేముంది..? అది ఆమె వృత్తి… అదేమీ నీచమైన పని కాదు, అంతేకాదు, నేను నటి స్మితాపాటిల్ తండ్రిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను… తండ్రిగా నేను గర్వపడే నటన తన సొంతం…’’
ప్రసవ సమస్యలతో ఆమె మరణించాక ఆమె పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసి, సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేశాడాయన… సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వేరు, రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి సినిమా తారలు రావడం వేరు… అందుకే శార్వరి బయోడేటా కూడా ఇంట్రస్టింగ్ అనిపించింది… అదీ ఓ మాజీ సీఎం, ఓ లోకసభ స్పీకర్ వంటి హై-ప్రొఫైల్ నాయకుడి మనవరాలు..!!
Share this Article