.
తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ వెళ్తే… ఎవరైనా జాతీయ చానెళ్లు పలకరిస్తే తనేం మాట్లాడతాడో తనకే అర్థం కాదు కొన్నిసార్లు… నిన్న ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పీవీ నరసింహారావుకు, చంద్రబాబునాయుడికి పెద్దగా కంప్యూటర్ పరిజ్ఞానం లేదు అన్నాడు…
ఆన్ ఆఫ్ ఇతర అంశాలు కూడా తెలియవట… సరే, చంద్రబాబు గురించి ఓ మాజీ శిష్యుడిగా, ఫాలోయర్‌గా తనకేం తెలుసో మనకు తెలియదు గానీ… పీవీ గురించి తనకేమీ తెలియదని మాత్రం అర్థమైంది… రేవంత్ రెడ్డి కోసం ‘ముచ్చట’ నాలుగేళ్ల క్రితం రాసిన ఓ కథనం ఇది…
Ads
అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన పార్థివదేహం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ…
తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు ఓ ఉన్నత స్థాయి సమావేశంలో… రాజీవ్ మాట్లాడుతూ…. ‘‘పర్సనల్ కంప్యూటర్లు వచ్చేస్తున్నయ్… అఫ్ కోర్స్, వయస్సు మళ్లిన వాళ్లకు అందిపుచ్చుకోవడం కష్టమే, కానీ రాబోయే కాలం మాత్రం వాటిదే’’ అని ఏదేదో చెప్పేశాడు… కట్ చేసేయండి ఇక్కడ…
అదే మంత్రివర్గంలోని సీనియర్లలో పీవీ అనే ఓ నిత్యయవ్వనుడు ఉన్నాడని మరిచిపోయాడు… ఆయనొక మానవాతీతుడు… ‘‘మంత్రివర్గంలో మరీ వయస్సెక్కువ నేనే కదా… ఇదేదో నన్నే ఉద్దేశించి అన్నట్టుంది…’’ అనుకున్నాడు… పాజిటివ్‌గా తీసుకున్నాడు… మనిషి ఓ కర్మ యోగి తెలుసు కదా… సరే, ఓ సవాల్‌గా తీసుకుందాం అనుకున్నాడు…
ఆఫ్టరాల్ అదీ యంత్రమే కదా… మంత్రశక్తి ఏమీ కాదు కదా… అనుకున్నట్డున్నాడు మనసులో… అసలే పే-ద్ద గట్టి బుర్ర… అందులోనూ రాజీపడని బుర్ర… ఇప్పటిలాగా ఓటి బుర్రలు కాదు కదా… అసలు ఈ కంప్యూటర్ అనేది అంతటి క్లిష్టమైన సబ్జెక్టా, సరే, దీని సంగతీ చూద్దాం అనుకుని… అదే వారంలో తన సొంత ఖర్చులతో ఓ పర్సనల్ కంప్యూటర్ అమెరికా నుంచి తెప్పించుకున్నాడు… మాన్యువల్స్ చదివేశాడు, బుర్రలోకి ఎక్కేసినయ్… పెద్దగా ఎవరి సాయమూ అక్కరకు రాలేదు…
ఇక కొన్ని రోజులపాటు తన రెగ్యులర్ పనిని సాయంత్రానికల్లా ముగించుకోవడం… ఇంటికి చేరడం… మిగతా రోజంతా ఆ కంప్యూటర్ మీద కూర్చుని, దాని పనిపట్టడం… అసలు పర్సనల్ కంప్యూటర్ అనగానేమి దగ్గర్నుంచి, దాని భాష ఏమిటో తెలుసుకునేదాకా…
మెల్లిమెల్లిగా దానిపై పట్టు ఎంత వచ్చిందంటే… మూడు విభిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పట్టు దొరికించుకున్నాడు… అంతేకాదు, తనకంటూ ఓ సొంత లాంగ్వేజీ క్రియేట్ చేసుకున్నాడు… దాంతో అక్షరాలా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు…
ఇతర మంత్రులు ఈర్ష్యపడేవాళ్లు… ఎవరో గుర్తించాలని, ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు….. మనిషి కనిపెట్టిన ఓ సాంకేతిక పరికరం అది… అదేమైనా బ్రహ్మపదార్థమా..? అనుకున్నాడు… పూర్తి పట్టు సాధించాడు… నిజానికి ఆ కుటుంబ పార్టీలో గనుక ఉండకుండా ఉంటే పీవీ ఎక్కడో ఉండేవాడు…
సోనియా వంటి లీడర్ నెగెటివ్ దృష్టి పడకుండా ఉంటే ఎక్కడికో వెళ్లేవాడు… కాదు, ఈ తెలుగు బిడ్డ దేశానికి మరో దశను, దిశను చూపించేవాడేమో… ఒక లాల్ బహద్దూర్ శాస్త్రి, ఒక వాజపేయి, ఒక పీవీ…. ఇంకెవ్వరూ కనిపించడం లేదు ఆ కాలం తెర మీద… ఈరోజుకూ..!!
Share this Article