Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొందరు.. కొంత మత్తుమందు.. కొన్ని హత్యలు … The Crime with an Injection…

March 15, 2025 by M S R

.

Sai Vamshi ……. కొందరు.. కొంత మత్తుమందు.. కొన్ని హత్యలు … The Crime with an Injection

తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాకు చెందిన తైక తంబి తన వ్యాపార పనుల కోసం చెన్నై వెళ్లాడు. అలా వెళ్లినవాడు ఏమయ్యాడో తెలియదు. అతణ్నుంచి ఏ సమాచారమూ లేదు. అతని మామ చెన్నైకి వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్లూ విచారణ ప్రారంభించారు. కానీ అతను ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది అంతుచిక్కలేదు.

Ads

రోజులు గడుస్తున్నాయి. కానీ ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారం దొరకలేదు. అయితే కనిపించకుండా పోవడానికి ముందు తకై తంబి మహమ్మద్ అనే వ్యక్తిని కలిసినట్టు గుర్తించారు. రామనాథపురం జిల్లా కిలకరై సమీపంలో అతణ్ని అరెస్టు చేసి తమ శైలిలో విచారించారు.

కనిపించకుండా పోయిన తకై తంబిని కొందరు కస్టమ్స్ అధికారులు, ఒక ప్యూన్‌‌కి చూపించానని, అందుకుగానూ వాళ్లు తనకు డబ్బు ఇచ్చారని మహమ్మద్ చెప్పాడు. కస్టమ్స్ అధికారులకు అతనితో ఏం పని? అతణ్ని చూపించినందుకు డబ్బు ఎందుకు ఇచ్చారు?

పోలీసులు ఈ కోణంలో విచారణ మొదలుపెట్టారు. భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. 1970 నుంచి 1972 మధ్య తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘విషపు సూది’ కేసు ఇది. ఎందరో అమాయకులను బలి తీసుకున్న ఈ ఘటన అలా తొలిసారి వెలుగులోకి వచ్చింది.

చెన్నై నగరంలోని జార్జి టౌన్‌కు చెందిన వైదీశ్వరన్ ఒక ఫార్మసీ దుకాణం నడుపుతూ ఉండేవాడు. దాంతోపాటు సినిమా ప్రముఖులతో సంబంధాలు పెంచుకొని, వారికి డ్రగ్స్ అలవాటు చేసేవాడు. ఈ క్రమంలో అతనికి దావూద్‌తో పరిచయం ఏర్పడింది.

దావూద్ డ్రగ్స్ అమ్మకందారు. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో వైదీశ్వరన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. వాటి నుంచి బయటపడేందుకు దావూద్ అతనికో సలహా ఇచ్చాడు. అదే Fake Customs Officer. స్మగ్లింగ్ చేస్తున్న వారిని గుర్తించి, బెదిరించి, వారి దగ్గర డబ్బు తీసుకోవచ్చని అన్నాడు.

ఆ మాట నచ్చిన వైదీశ్వరన్ తన స్నేహితులు పార్థసారథి, వేణుగోపాల్, ఆయూబ్ ఖాన్‌లతో కలిసి ఈ‌ పనికి పథకం రూపొందించాడు. ఆయూబ్ ద్వారా జఫ్రుల్లా, మాజిద్ అనే ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నాడు. వారిద్దరూ మద్రాసు నగరంలోని Hotel-de-Broadwayలో పనిచేస్తున్నారు.

హోటల్‌కు వచ్చేవారిలో స్మగ్లర్లు, నల్లడబ్బు రవాణా చేసేవారి సమాచారాన్ని వైదీశ్వరన్‌కు చేరవేయడం వారి పని. 1970 అక్టోబర్ 19న వడివేలన్ చెట్టియార్ అనే వ్యక్తి రూ.1.50 లక్షలతో ఆ హోటల్‌కి వచ్చాడు. అతని దగ్గరున్నది నల్లడబ్బు అని కనిపెట్టిన జఫ్రుల్లా, మాజిద్ ఆ సమాచారాన్ని వైదీశ్వరన్‌ ముఠాకు అందించారు.

కస్టమ్స్ అధికారుల్లా వడివేలన్ దగ్గరికి వచ్చిన వైదీశ్వరన్, అతని స్నేహితులు విచారణ పేరుతో అతణ్ని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. మధ్యలో అతని చేత బలవంతంగా అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగించారు. అతను స్పృహ తప్పగానే చెన్నై సమీపంలోని సెన్నేరి అనే ఊరి వద్ద అతణ్ని వదిలేశారు.

స్థానికులు వడివేలన్‌ను ఆసుపత్రిలో చేర్పించగా, రెండు రోజుల తర్వాత అతను మరణించాడు. ఆ తర్వాత వారి నేరాల పరంపర కొనసాగింది. వారితో మరికొంతమంది చేతులు కలిపారు. మలేషియాకు చెందిన సాహుల్ హమీద్‌ను ఇదే రకంగా కారులో తీసుకెళ్ళి, నిజం చెప్పించే ద్రవం ఇస్తున్నామని అతనికి ఇంజెక్షన్ చేశారు.

ఎక్కువగా మత్తు మందు ఇచ్చి, అతని వద్ద డబ్బు తీసుకుని, చిత్తూరులోని నగరిపేట దాకా తీసుకెళ్ళి అతణ్ని ఒక చెట్టుకు ఉరేసి చంపారు. ఆ తర్వాత దక్షిణామూర్తి అనే వ్యక్తి వారి గురించి తెలుసుకొని అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతనిపై పగబట్టి అతణ్ని కారులో తీసుకెళ్ళి చిత్తూరు సమీపంలోని ఒక కల్వర్టు వద్ద అతనిపై పెట్రోల్ పోసి చంపేశారు.

ఆ తర్వాత బుహారీ అనే మరో వ్యాపారికీ తమను తాము కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకొని అతనికి మత్తు మందు ఇచ్చి, దూరంగా తీసుకెళ్ళి చంపేశారు. ఇలా అనేకమంది వారి వల్ల ప్రాణాలు కోల్పోయారు.‌

చిట్టచివరగా తకై తంబి హత్య వారిని పోలీసులకు చిక్కేలా చేసింది. అతని శవాన్ని ఒక వాగు వద్ద గుర్తించిన పోలీసులు తీగ లాగడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రాష్ట్రంలో ఈ హత్యలు సంచలనంగా మారాయి. పోలీసులు, ఫారెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విచారణలో అనేక విషయాలు తెలిశాయి. హత్య చేయబడ్డవారు తమిళనాడు ప్రాంతం వారు మాత్రమే కాదని, వివిధ దేశాల వారూ అందులో ఉన్నారని తేలింది.

దాదాపు 263 మంది సాక్షులను విచారించి, 672 ఆధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు 1975లో నిందితులు వైదీశ్వరన్, కన్నన్, పార్థసారథి, లక్ష్మణన్‌లకు మరణశిక్ష విధించింది. దావూద్, ఆయూబ్, మజీద్, గోపాల్‌లకు జీవితఖైదు వేసింది. ఈ కేసును ఇంత బాగా విచారణ చేసి, నిందితులను పట్టుకున్నందుకు జడ్జి తమిళనాడు క్రైం బ్రాంచ్ సీఐడీని ప్రత్యేకంగా అభినందించారు.

తమకు వేసిన శిక్షలు తగ్గించాలని ముద్దాయిలు తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. ఉరి శిక్షను సమర్థించిన హైకోర్టు, దావూద్, ఆయూబ్‌ల జీవిత ఖైదును ఏడేళ్లకు, మజీద్ జీవిత ఖైదును ఐదేళ్లకు, గోపాల్‌కు రెండేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆ తర్వాత వైదీశ్వరన్, కన్నన్, పార్థసారథి, లక్ష్మణన్‌లు తమకు క్షమాభిక్ష ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. కానీ అక్కడనించి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions