.
నన్ను కోసినా పైసా పుట్టదు, అప్పులు ఎవడూ ఇస్తలేడు, బ్యాంకులు చివరకు చెప్పుల దొంగల్ని చూసినట్టు చూస్తున్నయ్, ఏ ప్రజాపథకం కట్ చేయాలో మీరే చెప్పండి… వస్తున్న ఆదాయం అంతా పెన్షన్లు, జీతాలు, పాత అప్పుల మిత్తీలకు సరిపోతోంది…
.
Ads
ఫాఫం, రేవంత్ రెడ్డి ఇలా వాపోయాడు… దాదాపు దివాలా ప్రకటన… ఈ విషయంలో సారు గారి అనుభవలేమి, పాలన వైఫల్యం అని హఠాత్తుగా ఓ ముద్ర వేయలేం… నిజంగానే ఆ దొర చేసిన అప్పులు ఈ దురవస్థకు ఓ ప్రధాన కారణమే… అయితే..?
ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీయార్ మీద పడి ఏడవాల్సిన అవసరం లేదు… దీన్ని చేతకానితనం అంటారు… 3 లక్షల కోట్ల అప్పులు అన్నారు, తీరా చూస్తే 8.5 లక్షల కోట్ల అప్పులు, నేనేం చేయాలె మరి అంటున్నాడు సీఎం…
ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎన్నో తెలుసుకునే సోయి లేదా..? మరి ఏం తెలుసుకుని అడ్డగోలు హామీలతో మేనిఫెస్టో రాశారు, అవన్నీ అమలు చేయడం సాధ్యమేనా..? వోట్లు పొంది గద్దెనెక్కాక చూసుకుందాలే అనే ధోరణే కదా…? జనాన్ని మభ్య పెట్టింది, ముంచింది ఎవరు..? అసలు బీఆర్ఎస్, కేసీయార్ దొందూ దొందే… కేసీయార్ కూడా తన మేనిఫెస్టోలో ఇలాంటి పథకాలే బోలెడు పెట్టాడు…
పోనీ, ఈ స్టాండ్ మీద నిలబడి ఉంటాడా రేవంత్ రెడ్డి… నెవ్వర్… ఏ మీనాక్షి నటరాజనో వచ్చి, ‘అధికారిక’ భేటీలు వేస్తుంది… తరువాత ఉద్యోగుల డిమాండ్లకు ఎక్కడో ఓచోట ప్రభుత్వమే రాజీపడి సరెండర్ అయిపోతుంది… ఉద్యోగగణంతో ఏ ప్రభుత్వమూ గోక్కోవడానికి సిద్ధపడటం లేదు… ఇదీ అంతే…
రేవంత్ రెడ్డి ఏమీ జయలలిత తరహా కాదుగా… ఉద్యోగగణాన్ని తన ఎదుట మోకరిల్లజేసుకున్నది ఆమె… బహుశా అప్పట్లో జయలలిత వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులు అనే ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి తెలిసి ఉండదు, ఎవరూ చెప్పి ఉండరు, చెప్పినా తను విని ఉండడు…
ఎస్, ఉద్యోగులంటే ఈ ప్రజలకు అల్లుళ్లు… మేపుతూనే ఉండాలి… లోకం ఏమైపోయినా సరే, వాళ్లు చల్లగుంటే చాలు… కరోనాలు, రైతుల ఆత్మహత్యలు, మిడిల్ క్లాస్ కన్నీళ్లు, చిరుద్యోగుల అవస్థలు, వట్టిపోయిన కుటుంబాలు… ఎవడేం అయిపోతే మనకేం… మనమే లోకమంటే… మనమే సమాజమంటే… మనం బాగుంటే… కాదు, కాదు, చాలా బాగా ఉంటే చాలు… ఇదే ప్రభుత్వ ఉద్యోగి అంటే…
సొసైటీలో రాను రాను ప్రభుత్వ ఉద్యోగి అంటే విముఖత పెరుగుతోంది… అదెప్పుడో బరస్ట్ అవుతుంది… రాష్ట్రాల ఆదాయాన్ని మింగేస్తున్న జీతాల వ్యయమే… పోనీ, ఉద్యోగగణంలో జవాబుదారీతనం ఉందా..? అనేక విభాగాల్లో అసలు పనే లేదు… వాటిపై ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా దృష్టి పెట్టాడా..? పోనీ, అనేక అవినీతి కేసులు పట్టుబడ్డాయి కదా, కొందరైతే తిమింగలాల్ని మించి, వందల కోట్లతో…
ఒక్కడికైనా శిక్ష పడిందా..? ఒక్కడైనా జైలులో ఉన్నాడా..? అడ్డమైన డిపార్ట్‌మెంటల్ ఎంక్వయిరీ పేరుతో కేసుల్ని డైల్యూట్ చేసి, తిరిగి ఆ పోస్టుల్లోనే నియమించి..! పోనీ, ప్రభుత్వ ఉద్యోగి పనితీరు శాస్త్రీయ మదింపు ఉందా..? అదీ లేదు కదా… రాబోయే కాలంలో ప్రభుత్వ యంత్రాంగం జీతభత్యాలకే ప్రభుత్వ ఆదాయం హరించుకుపోయే దురవస్థ రాబోతోంది… ఇంకా దుర్దినాలు రాబోతున్నాయి… ఇది రియాలిటీ…
చివరకు ఈ ప్రభుత్వం దగ్గర సీఎంఆర్ఎఫ్ సాయాలకూ డబ్బుల్లేవు… పైగా అరకొర సాయం… ఫీజు రీయింబర్స్‌మెంటు, కంట్రాక్టర్ల బిల్లులు, ఆరోగ్యశ్రీ అన్నీ వేల కోట్ల బకాయిలు… పంట నష్టపోతే పరిహారాలు, బీమా దిక్కులేదు… చెబుతూ పోతే అడ్డగోలుగా, అరాచకంగా ఉంది పాలన… రియాలిటీ ఇదే…
రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వలేక కేసీయార్ ఏకంగా ఉద్యోగ విరమణ వయస్సే పెంచేశాడు… అది తన పాలన నిర్వాకం… మరి నిరుద్యోగుల గతేమిటని ఆలోచించలేదు… ఇప్పుడు ఈయనేమో నన్ను కోసినా పైసా పుట్టదు అంటున్నాడు… హేమిటో… ఈ పార్టీలు, ఈ నాయకులు, ఈ పాలకులు, ఈ ఉద్యోగులు..!! స్థూలంగా ప్రజలే బాధితులు..!!
ఇక్కడే మరో విషయం చెప్పాలి… తుమ్మల చెబుతున్నాడు ఎక్కడో… ఉచిత పథకాలు అర్హులకే ఇవ్వాలి, 3 రూపాయల బియ్యాన్ని 2 రూపాయలకు ఇస్తే వోకే, 60 రూపాయల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలా..? కుటుంబాలు కోటీపది లక్షలయితే రేషన్ కార్డులు కోటీపాతిక లక్షలున్నయ్… అని ఏదేదో చెప్పాడు, డిబేటబుల్…
కానీ అమాత్యా… దొంగ రేషన్ కార్డులు అంతగా ఉంటే, మరి ప్రతి ప్రభుత్వ పథకానికీ ఆ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకున్న తమరి ప్రభుత్వానిది ఏం సోయి అంటారు..? దీన్నే అడ్డగోలుతనం అంటారు సార్… పథకాల సమీక్ష, ఉద్యోగులపై అదుపు, రేషన్ కార్డుల ప్రక్షాళన వంటి సాహసాలు ఇలా అదృష్టవశాత్తూ కుర్చీ మీదకు వచ్చీపోయే నాయకులతో కాదు…! ఇప్పుడు సమాజానికి కావల్సింది రాజకీయ నాయకులు కాదు, రాజనీతిజ్ఞులు… సమాజం దురదృష్టం కొద్దీ వాళ్లు లేరు..!!
మరో విషయం… రేవంత్ రెడ్డికి పాలన అనుభవం లేదు కదా… బీఆర్ఎస్ వందల కోట్ల ఖర్చుతో నెగెటివ్ ప్రచారం చేస్తుంటే దీటుగా కౌంటర్ చేసుకునే సోయి లేదు సరికదా… హామీలు ఏమైనయ్, చల్, ఎప్పుడు చేస్తవ్ అని నిలదీస్తుంటే ఆ ట్రాపులోకి పడిపోయాడు పాపం…
అదే తన గురువు చంద్రబాబు మాత్రం పీ4 అనీ, మరొకటో అనీ… మెల్లిమెల్లిగా తనకు తోచిన ఒకటీ అరా పథకాలు, హామీలు అమలు చేసినట్టు కనిపిస్తున్నాడు… ఎంచక్కా మళ్లీ అమరావతి దందాలో పడిపోయాడు… వేల ఎకరాల అదనపు భూమి పూలింగ్ అట… తాత్కాలిక భవనాల్ని కూల్చేసి కొత్త కట్టడాలు కడతాడట… చాలా కథలున్నయ్…
Share this Article