Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!

June 8, 2025 by M S R

.

Director Devi Prasad.C… సూపర్‌ స్టార్ హీరోగా “గూఢచారి 117” సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో వేసిన “విమానం ఇంటీరియర్ సెట్” లో జరుగుతోంది.

సమయం అర్ధరాత్రి 2 గంటలు…
బాల నటుడైన మహేష్‌ బాబుతోసహా దాదాపు సినిమాలోవున్న నటీనటులందరూ ఆ ఫ్లైట్ సెట్లో ఉన్నారు.
ఫ్లైట్ ఎక్స్‌టీరియర్ వర్క్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది.

Ads

కృష్ణ గారు డైరెక్టర్‌ గారితో “ముందు మహేష్ షాట్స్ తీయగలిగితే తీసి పంపించేయండి. నిద్రకి ఆగలేడు. నేను కావాలంటే తెల్లవారేవరకూ ఉంటాను” అని నవ్వుతూ చెప్పారు.

ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మహేష్‌బాబు టకటకా డైలాగులు చెబుతుంటే కృష్ణ గారు చూస్తూ భలే మురిసిపోతుండేవారు.
కధ ప్రకారం టెర్రరిస్ట్ భానుప్రియ గ్రూప్ ఫ్లైట్ హైజాక్ చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం ఒక్కొక్కరినీ చంపుతుంటారు. ఆ ప్రోసెస్ లో భాగంగా కొత్తగా పెళ్ళైన ఓ జంటలోని యువకుడిని చంపుతారు.

మా మిత్రుడు పురం రాధాకృష్ణ (తర్వాతి కాలంలో “చిరంజీవులు” సినిమాకి దర్శకత్వం వహించాడు) ఆ యువకుడి పాత్ర పోషిస్తే అతని జంటగా ఓ కొత్తమ్మాయి వేసింది.

డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో “టెర్రరిస్ట్‌లు మీ ఆయన్ని కాల్చేశారు, అది చూసి నువ్వు కెవ్వుమని అరిచి పడిపోవాలి” అని చెప్పారు.
సెట్లో ఒకరిద్దరు గురకపెడుతున్నవాళ్ళను, నిద్రకు జోగుతున్నవాళ్ళను లేపి టేక్ అని అరిచాము.

డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పగానే రాధాకృష్ణ బుల్లెట్ తగిలినట్లు అరిచి పడిపోతే, అతన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తల పైకెత్తి తన చెవులు రెండూ మూసుకుని “కెవ్వు” అనే పదం పెద్దగా పలుకుతూ పడిపోయింది.
అంతే దెబ్బకి సెట్లో అందరికీ నిద్రమత్తు ఒదిలిపోయింది. విరగబడి నవ్వారందరూ.

మీరు చెప్పిందే కదా చేశాను, ఎందుకు నవ్వుతున్నారు అన్నట్లు చూసిందా అమ్మాయి.
డైరెక్టర్ గారు “కెవ్వుమని అరవమంటే”కెవ్వూ” అని అనక్కర్లేదమ్మా. అరిచి పడిపోతే చాలు” అని మళ్ళీ యాక్షన్ చెప్పారు.

మళ్ళీ సెకెండ్ టేక్ లో కూడా ఆ అమ్మాయి “కెవ్వూ” అంటూ దీర్ఘం తీయడంతో మళ్ళీ నవ్వులే నవ్వులు. మూడో టేక్ కి అర్ధమైందామెకి. టేక్ ఓకే అయ్యింది.
అప్పటి నుండి ఆ అమ్మాయి “కెవ్వుకుమారి” అయ్యింది. కొన్ని తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఆ అమ్మాయి తరువాత కనిపించలేదు.

నేను దర్శకత్వం వహించిన “బ్లేడ్‌ బాబ్జీ” సినిమాలో…. అల్లరి నరేష్ బృందం బ్యాంక్ రాబరీ చేసి పోలీసుల నుండి తప్పించుకున్న ఆనందంలో వైజాగ్ బీచ్ ఒడ్డున లంగరేసి వున్న ఓ చిన్న షిప్ లో మందు కొట్టి పడుకుని, తెల్లారి లేచి చూసేసరికి షిప్ సముద్రం మధ్యలో ఉంటుంది…

షాక్ అయ్యిన వాళ్ళు చేతులు చెవులకు ఆనించి “కెవ్వు” అని అరుస్తారు పెద్దగా. అలా అరిపించటానికి ఆనాటి కెవ్వు కుమారి “కెవ్వే” నాకు ప్రేరణ.
ఆ “కెవ్వు” ఆనాడు సెట్లో అందరినీ ఎలా నవ్వించిందో అలాగే ఈ “కెవ్వు” ధియేటర్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది…

వెతకాలే గానీ మన చుట్టూ జరిగే సంఘటనల్లో, చుట్టూ ఉండే మనుషుల్లో ఎన్నో నవ్వులు దాక్కుని వుంటాయి.
మనిషికి కష్టమొచ్చినపుడు కష్టపడకా, దుఃఖం వచ్చినపుడు దుఃఖపడకా తప్పదు.
కానీ మిగిలిన విలువైన సమయాన్నికూడా భారంగా ఎందుకు ఖర్చు చెయ్యటం?
ఏమాత్రం “ఖర్చు”లేని “నవ్వు” ని ముఖానికెందుకు దూరం చెయ్యటం?
సాధ్యమైనన్ని నవ్వుల్ని పోగేసుకుని బ్రతికేద్దాం….. ____ దేవీ ప్రసాద్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions