.
నిజమే, నిన్న సాక్షిలో ఏదో సెంటర్ నుంచి ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? సహజ ప్రసవం కోసం చూడకుండా గర్భిణులు మంచి ముహూర్తం చూయించుకుని, అన్ని గ్రహాలూ సరైన స్థితిలో ఉన్నప్పుడే, కడుపు కోయించుకుని మరీ పిల్లల్ని కంటున్నారు అనేది సారాంశం…
ఇదొక పెద్ద దందా అయిపోయింది… ముహూర్తాలు పెట్టేవాళ్లకు డబ్బులు, సిజేరియన్లు సరిగ్గా అదే సమయంలో కానిచ్చేయడానికి డాక్టర్లకు, హాస్పిటల్స్‌కు డబ్బులు… ఈరోజుల్లో డబ్బులు కానిదేముంది..? ఆహా, మంచి నక్షత్రంలో, మంచి ఘడియాల్లో పిల్లల్ని కన్నాం అనే తృప్తి… ఇక ఆ పిల్లల జాతకాలకు ఢోకా లేదనే భరోసా తల్లిదండ్రులకు…
Ads
ఐతే ఇది కొత్తేమీ కాదు, చాన్నాళ్లుగా సాగుతున్నదే.., అన్ని సందర్భాలకూ పంతుళ్ల దగ్గర విరుగుడు మంత్రాలు ఉంటాయి… మరీ మూఢాలు, వర్జ్యాలు తప్ప మిగతా ఏ రోజంటే ఆరోజున, ఏ సమయం కావాలంటే ఆ సమయానికి అభిజత్ లగ్నం పెట్టేస్తారు…
మీరు చూడండి, ఈమధ్య పెళ్లిళ్లన్నీ ఉదయమే ఉంటాయి… పొద్దున వచ్చిన బంధుగణం, సాయంత్రానికల్లా గాయబ్… కంఫర్ట్ చూసుకుంటున్నారు… సరే, అలాగే పిల్లల జననాలకూ ఇదే… మామూలుగా గ్రహసంచార సంబంధ జాతకాలకు జన్మసమయమే ప్రధానాధారం కదా… అదే కదా వ్యక్తుల జాతకాల్ని నిర్దేశించేది…
సో, అనుకూల గ్రహాలు, అనుకూల గళ్లల్లో కూర్చున్నప్పుడే… అన్నీ చూసుకుని మరీ పిల్లల్ని కనేస్తే వాళ్ల జాతకం దివ్యంగా ఉంటుందనేది ఈ ముహూర్తాలు పెట్టేవాళ్లు చెప్పే మాట… ఆ తల్లిదండ్రుల బాట… అంటే, బ్రహ్మ రాసే జాతకాన్ని వీళ్లు తిరగరాసే ప్రయత్నం అన్నమాటే కదా… మరి నిజంగానే ఈ జాతకాలు దివ్యంగా ఉంటాయి..? పిల్లల జాతకాల్ని మనమే కృత్రిమంగా మార్చేయగలుగుతున్నామా..?
ఈ సందేహం వచ్చింది… అబ్బే, అది తల్లుల ఆరోగ్యానికి మంచిది కాాదని కొందరు… సహజ ప్రసవాలు తప్ప ఈ కృత్రిమ కడుపుకోత జననాలతో పిల్లల ఎదుగుదలకు అనారోగ్యకరం అని మరికొందరు ఏదో చెబుతున్నారు గానీ… అవన్నీ తప్పు… సిజేరియన్ ప్రమాదం కాదు, పిల్లలకైనా, తల్లులకైనా… నిజానికి ఏ అర్ధరాత్రో, అపరాత్రో బిడ్డ అడ్డం తిరిగే తిప్పలకన్నా సిజేరియన్ డేంజరేమీ కాదు… గండమూ కాదు…
ఎస్, సహజ ప్రసవం మంచిదే గానీ, సిజేరియన్ ప్రమాదం అనే అభిప్రాయం మాత్రం తప్పు… ఇప్పుడు మెజారిటీ సిజేరియన్లే కదా… సరే, అదీ ఓ దందా… ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం… కానీ ముహూర్తాలు చూసుకుని, ఇష్టమైన టైములో ప్రసవం చేయించుకుంటే అది ఆ పిల్లల జాతకాల్ని మారుస్తుందా..?
మార్చదు అంటున్నాడు ధర్మపురి గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ (Onlinejyotish) .. * జాతకం అంటే జన్మ లగ్నంతో పాటుగా ఆ సమయంలో ఉన్న గ్రహ స్థితి.., కేవలం మనం లగ్నాన్ని మారుస్తున్నాం కానీ గ్రహ స్థితులను, అంటే ఒక్కో రాశిలో ఉన్న గ్రహాన్ని మార్చడం లేదు… మార్చలేం… అటువంటప్పుడు మనం ఎంత అనుకూల ముహూర్త సమయాన్ని చూసుకొని డెలివరీ చేసుకున్నా… నీచంలో ఉన్న గ్రహం ఉచ్చ స్థితిలోకి రాదు*
మరెందుకు కొందరు ఈ ముహూర్తాలు పెడుతున్నారు..? అది వాళ్లకు ఉపాధి, బతుకుతెరువు, అవి నమ్మాలా వద్దానేది తల్లిదండ్రులు తేల్చుకోవాల్సిందే… పిల్లల్ని వాళ్లకు రాసి ఉన్న సమయంలోనే రానివ్వండి..!! కృత్రిమ జనన లగ్నం స్థూలంగా శిశువు జాతకాన్ని ప్రభావం చేయదు, చేయలేదు… నొసటి రాతను మార్చలేదు…!!
Share this Article