.
Subramanyam Dogiparthi........
కధల్లోను , సినిమాల్లోను మాత్రమే వద్దూవద్దన్నా డబ్బు వచ్చేది . రియల్ లైఫులో అంబానీ ఆదానీలకు కూడా వద్దూవద్దంటే డబ్బు రాదు . నానావిధాలుగా ఇప్పటికీ తిప్పలు పడుతూనే ఉంటారు . మామూలు జనం మనమెంత వెంపర్లాడినా లక్ష్మీ కటాక్షం దొరకదులే అని చేతులెత్తేస్తారు .
1902 లో వచ్చిన Brewster’s Millions అనే నవల ఆధారంగా 1954 లో తండ్రి యన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు కధాంశంతోనే 1985 ఫిబ్రవరిలో కొడుకు బాలకృష్ణ బాబాయ్ అబ్బాయ్ సినిమాలో నటించాడు . ఈ రెంటికీ తేడా ఏంటంటే పాత సినిమాలో యన్టీఆర్ , పేకేటి ఒకే వయసులో ఉన్న స్నేహితులు ; కొత్త దాంట్లో కొద్దిగా వయసు తేడాతో బాలకృష్ణ , సుత్తి వీరభద్రరావులు బాబాయ్ అబ్బాయిలు . పాత సినిమాలో షావుకారు జానకి , జమున , రాజనాల ప్రధాన పాత్రల్లో నటించారు .
Ads
కొత్త సినిమా స్క్రీన్ ప్లే , దర్శకత్వం జంధ్యాల వహించారు . ఆయనకు సెంటిమెంటయిన విశాఖపట్నం , చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ చేసారు . నలభై ఏళ్ల కిందే ఎవరికి వారే చాలా సినిమాలను సుందర విశాఖ ప్రాంతంలో షూటింగులు చేసారు . సినిమాలో జంధ్యాల మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది . సహజమే కదా ! ఆయన సినిమాలో ఆయన మార్కేగా కనిపించేది .
మచ్చుకు కొన్ని . రుణదాతల సంఘం , వీరభద్రరావు నా సరే డైలాగ్ , పావలా శ్యామల అమ్మా నాకు సిగ్గేస్తుందే , సుత్తి వేలు తిక్క రేగినప్పుడల్లా గుద్దటానికో ఓ గుండ్రాయి గాడు , ఏడుపుల అమ్మాయి శ్రీలక్ష్మి , హీరోహీరోయిన్ల మధ్య హీరోయిన్ తమ్ముడు పాట రాయభారం , వగైరాలు .
సీతారామ సంగ్రామం నాటకం . నలభై ఏళ్ల కింద కాబట్టి ప్రజల మనోభావాలు దెబ్బతినలేదు . ఈ నాటకం వేస్తే ఆస్తికుల సంఘం వారు చితకబాదుతారు అనే డైలాగ్ కూడా ఉందనుకోండి .
ఈ సినిమా ద్వారా ముగ్గురు నటులు తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు . పావలా శ్యామల , వైజాగ్ ప్రసాద్ . ఈ ఇద్దరు చాలా సినిమాల్లో నటించారు .
మూడవ వారు అనితారెడ్డి (నటుడు సురేష్ భార్య, తరువాత విడాకులు తీసుకున్నారు)… ఈ సినిమా తర్వాత ఇదే జంధ్యాల శ్రీవారి శోభనం సినిమాలో కూడా తీసుకున్నారు… జంధ్యాల టేస్ట్ కొన్ని విషయాల్లో చిత్రమే… పూర్ణిమ, అనితారెడ్డిలను బాగా ప్రోత్సహించాడు… అనితారెడ్డి ఇంకా ఏమయినా పెద్ద సినిమాల్లో నటించిందేమో తెలియదు . (టెర్రర్, కదల్ పిసాసె సినిమాలు కూడా చేసినట్టు గుర్తు)…
ఈమెను జంధ్యాల ఎందుకు ఎంపిక చేసుకున్నారో ప్రేక్షకులకు ఆమెను ఎటువైపు నుంచి చూసినా అర్థం కాదు . ఆమె ఓ సింగర్ . ఆమె కాకుండా మరే ఇతర పాపులర్ , గ్లామరస్ హీరోయిన్ అయినా బాగుండేదేమో !!
బాలకృష్ణ కామెడీ పాత్రలో బాగానే నటించాడు . పాపం ఈ సినిమాలో రెండు ఏక్సిడెంట్లు కూడా అయ్యాయి అతనికి . ఒకటి హీరోయిన్ అనితారెడ్డి బాలకృష్ణను కారుతో గుద్దే సీన్లో డ్రైవింగ్ బాగా రాని ఆమె ఘట్టిగా గుద్దేసింది . మరొకటి గుర్రం మీద నుండి పడిపోయాడు . అదృష్టవశాత్తూ రెండూ చిన్న ప్రమాదాలే .
బాబాయిగా నటించిన వీరభద్రరావుకు ఈ పాత్ర కొట్టిన పిండే . ఇతర ముఖ్య పాత్రల్లో సుత్తి వేలు , కాకినాడ శ్యామల , నిర్మలమ్మ , రాళ్ళపల్లి , శ్రీలక్ష్మి , రాధాకుమారి , ప్రభృతులు నటించారు . కోట శ్రీనివాసరావు , రాజేంద్రప్రసాద్ చిన్న పాత్రల్లో నటించారు . అప్పటికి వారిద్దరు ఇంకా పెద్ద ఏక్టర్లు కాలేదు . డబ్బు ఖర్చు చేయటం అనే కండిషనుతో ఈ రెండు సినిమాలే కాదు , మరో బ్లాక్ బస్టర్ కూడా ఉంది .అది రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా , డిఫరెంటుగా ఉంటాయి . ఓ ప్రియా సరసమా విరహమా న్యాయమా పాటను అనితారెడ్డే పాడుకుంది . తెలుసా నీకు తెలుసా , నీ రూపు అంటూ సాగే డ్యూయెట్లు బాగుంటాయి . సొమ్ము పెంచకు బాబయా అనే పాట బాబాయ్ అబ్బాయిల మీద ఉంటుంది . సీతారామ సంగ్రామంలో లేడి లేడి అంటూ ఓ పాట ఉంటుంది . బాగుండదు . పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మలు పాడారు .
ఈ సినిమాలో జగదంబ సెంటర్లో గజం ధర వెయ్యి రూపాయలు అని ఓ సన్నివేశంలో ఉంటుంది . 1984/85 లో అక్కడ గజం వెయ్యి రూపొయలు . ఇప్పుడు ఎంత ఉందో వైజాగ్ మిత్రులు చెప్పాలి . సరదాగా సాగే ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే ట్రై చేయొచ్చు . బాలకృష్ణ అభిమానులు అయితే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article