.
రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు అని నిన్న ఓ కార్యక్రమం నిర్వహించారు కదా… అక్కడ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి పక్కపక్కన కూర్చుని, నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న వీడియో బిట్స్, ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి…
బహుశా రేవంత్ రెడ్డి ఎప్పుడో ఓరోజు ముఖ్యమంత్రిగా మారి, తన పక్కనే కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఇలా ముచ్చట్లు చెబుతాడని బహుశా చంద్రబాబు అప్పట్లో ఊహించి ఉండడు… (భలే ఫోటో ఇది)… సరే, గురుశిష్యుల మాటెలా ఉన్నా, ఎవరి అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు కదా…
Ads
(ఈ ఫోటో చూశాక ఓ మిత్రుడు పాత ముచ్చట ఒకటి గుర్తుచేశాడు… బహుశా కరోనా తర్వాత కావచ్చు, కేసీయార్, జగన్ కలిశారు… జగన్ కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు… కేసీఆర్ ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో ఓ విలేఖరితో… ఎవరికైనా కళ్ళు మండుతున్నాయా అని వెటకారంగా అడిగాడు.., సీన్ కట్ చేస్తే.,. ఇదుగో ఈ ఇద్దరూ ఇలా పక్కపక్కన… ముఖ్యమంత్రులుగా…!!)

ఆ ఈవెంటులో రేవంత్ రెడ్డి షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం ఆసక్తికరం… తను రామోజీరావు ద్వారా ఓ మంత్రి పదవి కోసం పైరవీ చేయాలనుకున్న తీరు గురించిన అనుభవం అది…
https://www.facebook.com/reel/1491897002069655
https://www.facebook.com/reel/1401366961325871
2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసినట్టే అనుకున్నారు తెలుగుదేశం నాయకులు… ఎలాగైనా వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని తెలుగుదేశం మహాకూటమి ఏర్పాటు చేసింది… అందులో టీఆర్ఎస్ (ప్రజెంట్ బీఆర్ఎస్) సీపీఐ, సీపీఎం కూడా ఉన్నాయి…
అయిదేళ్ల వెనక్కి వెళ్తే… 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి యూపీఏ కూటమి… టీఆర్ఎస్ 54 పోటీచేస్తే 26 గెలిచింది… లెఫ్ట్ కూడా 15 సీట్లు… ఎన్డీఏలోని టీడీపీ, బీజేపీ కలిసి 49 సీట్లకు పరిమితం… ఆ ఎన్నికల్లో చంద్రబాబు పాలన మీద వ్యతిరేకతే కాంగ్రెస్ కూటమిని గెలిపించింది… అది ఓ అధ్యాయం…
కేసీయార్‌తో అంతకుముందు కాంగ్రెస్ పలు అవస్థలు పడింది… అసలు టీడీపీకి, టీఆర్ఎస్‌కూ అస్సలు శృతి కుదరదు… అంటే, చంద్రబాబుకూ, కేసీయార్‌కూ..! ఐనా సరే బలమైన వైఎస్‌ను ఓడించడానికి కేసీయార్‌తో అవగాహనకు చంద్రబాబు అంగీకరించాడు…
కాంగ్రెస్ వదిలించుకున్న కేసీయార్ మహా కూటమి తరఫున 24 సీట్లకు ఒప్పుకొని 45 సీట్లలో అభ్యర్థులను పెట్టాడు… కేసీయార్‌తో ఏదీ సజావుగా, సాఫీగా ఉండదు కదా యవ్వారం…!! కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే పోటీచేసి అత్తెసరు మెజారిటీ (156 సీట్లు- పాస్ మార్కులు) సాధించి, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది… మహాకూటమి చతికిలపడింది… కేసీయార్ మరీ 10 మార్కులకు పడిపోయాడు…

నిన్న రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన విషయం ఏమిటంటే..? పోలింగ్ జరిగాక రిజల్ట్‌కు నెల రోజుల జాప్యం జరిగింది… మహాకూటమి గెలిచినట్టే అని లెక్కలేసుకున్నారు తెలుగుదేశం నాయకులు… రేవంత్ రెడ్డి మరో నలుగురు రామోజీరావు అపాయింట్‌మెంట్ అడిగారు… ఆయన సరే రమ్మన్నాడు…
అప్పట్లో ప్రచారం కదా… రామోజీరావు ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో రామోజీరావు జాబితా పంపిస్తే చంద్రబాబు వాటి మీద ఎస్ టిక్ పెట్టేవాడని… సో, రామోజీరావు ద్వారా మంత్రి పదవికి పైరవీ చేసుకుందామని రేవంత్ రెడ్డి టీమ్ అనుకుంది… రామోజీరావు వీళ్ల వాలకం చూసి, ఆ పైరవీ కోసమే వచ్చారని గ్రహించాడు… (రేవంత్ రెడ్డి అప్పట్లోనే నేను ఇక మంత్రిని అయిపోయినట్టే అనుకున్నాడు బలంగా…)
ఆ నలుగురికీ కమ్మని భోజనం పెట్టి, పైరవీలు గట్రా ఏమీ ఉండవు, అంతా చంద్రబాబు ఇష్టం అని తేల్చేసి వీడ్కోలు చెప్పాడు… రేవంత్ రెడ్డి తన మంత్రి పదవి పైరవీల కథ ఇలా చెబుతుంటే చంద్రబాబు వింటూ నవ్వుతున్నాడు… ఇంట్రస్టింగు పైరవీ కథ వయా రామోజీ..!!
Share this Article