Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జనంలోకి రాడు… ఇల్లు కదలడు… అజ్ఞాతం వీడని ‘జాతిపిత’…

February 6, 2026 by M S R

.

‘ఇన్నాళ్లు ఊరుకున్నాం, ఇగ నేనొస్తున్నా, తోలు తీస్తాం…’’ అన్నాడు కదా కేసీఆర్ కొన్నాళ్ల క్రితం… పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఆందోళనల నుంచి… ఇక జనంలోకి వస్తాడనే హైప్ కృత్రిమంగా క్రియేట్ చేసింది కదా బీఆర్ఎస్ క్యాంపు…

ఏమీ లేదు… ఏమీ ఉండదు… తను ఫామ్ హౌజు నుంచి కదలడు… జనంలోకి రాడు… అప్పుడే మనం చెప్పుకున్నాం…, బయటికి ప్రచారం చేసిన నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభలు జరగవనీ, కేసీఆర్ రాడు అనీ…! అదే జరిగింది, మున్సిపల్ ఎన్నికల సాకు చెప్పి అన్నీ రద్దు… మళ్లీ చడీచప్పుడు లేదు…

Ads

ఇదే కాదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వికారాబాద్ నేవీ రాడార్ దగ్గర నుంచి నిన్నామొన్నటి నైనీ బొగ్గు బ్లాక్ దాకా ఎన్నెన్నో ఇష్యూలు లేవనెత్తి, ప్రెస్ మీట్లు పెడుతుంది బీఆర్ఎస్… అదీ జస్ట్, హరీష్ అండ్ కేటీయార్… ఇంకెవరూ మాట్లాడేది లేదు… ఆ ఇద్దరే… కానీ ఏ ఒక్క ప్రధాన ఇష్యూపైన కూడా పోరాటంలో కన్సిస్టెన్సీ ఉందా, కొనసాగింపు ఉందా, అదీ లేదు… రోజుకొక ఇష్యూ మీద రచ్చ… కానీ ఊదు కాలదు, పీరు లేవదు…

అదే జరిగింది… అసెంబ్లీ అటెండెన్స్ కోసం ఓ పదినిమిషాలు వచ్చిపోయాడు… తప్పదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విచారణకు వచ్చిపోయాడు… అంతే… మాగంటి గోపీనాథ్ మరణిస్తే వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప కేసీయార్ తమకు వోటేయాలని జనాన్ని అభ్యర్థించలేదు… పంచాయతీ ఎన్నికలూ అంతే, బయటికి వచ్చింది లేదు, వోట్లు అడిగింది లేదు…

ఇప్పుడూ అంతే… మున్సిపల్ ఎన్నికల బరిలో ఎవరెవరనేది ఖరారైంది… కానీ కేసీయార్ మాట లేదు, ముచ్చట లేదు, పార్టీ అభ్యర్థులకు వోటేయాలని జనానికి అప్పీల్ లేదు… పైగా తను పార్టీకి అధినేత… ప్రధాని కూడా కావాలని ఓ దశలో ఆశపడిన నేత… ప్రస్తుతానికి ప్రజాజీవితంలోని లేని ప్రజానాయకుడు, ప్రతిపక్షనాయకుడు..!!

కేసీయార్ చుట్టూ కృత్రిమంగా అల్లబడుతున్న జాతిపిత అనే పెంకును రేవంత్ రెడ్డి బద్దలు కొడుతున్నాడు కదా… ఈలోపు తెలంగాణ సొసైటీలో అయితే గియితే జయశంకర్ జాతిపిత అవుతాడు తప్ప, కేసీయార్ ఎలా అవుతాడనే చర్చ బయల్దేరింది… జనంలో లేనివాడు, ప్రజాజీవన బాధ్యత విస్మరించేవాడు, అజ్ఞాతంలో బతికేవాడు జాతిపిత ఎలా అవుతాడనేది ఆ చర్చ సారాంశం…

కానీ ఎందుకో హఠాత్తుగా బీఆర్ఎస్ క్యాంపు కోదండరాంను తెర మీదకు తీసుకొచ్చింది… జేఏసీ పెట్టింది కేసీయార్, దానికి కోదండరాంను చైర్మన్‌ను చేసింది కేసీయార్, అంతేతప్ప కోదండరాంకు వేరే అస్థిత్వం ఏముందనేది ఆ క్యాంపు ప్రచారం…

ఈ ప్రచారానికి సోషల్ యాక్టవిస్టు డాక్టర్ గుఱ్ఱం సీతారాములు కౌంటర్ ఏమిటంటే..?



ఒకడు చేస్తే అవడానికి అది పిండి బొమ్మ కాదు. చేసింది ఏ అవతార పురుషుడు కాదు. ఒకడు చేస్తే వూగడానికి అది తోలు బొమ్మా కాదు. అది దొమ్మరి సంత (క్షమాపణతో) కాదు. ఒకడు కీ ఇస్తే కదలడానికి లోలకం కాదు , గోడగడియారం అంతకన్నా కాదు .

ఒకడు నడిపితే నడపడానికి అది పెట్రోల్‌తో నడిచే బండి కాదు. అది JAC. అంటే జాయింట్ యాక్షన్ కమిటీ. అది ఎవడో కలిపితే కలిసింది కాదు. నడిపితే నడిచింది కాదు . బండి కింద నడిచే కుక్క బండినీ, బండి మీద ఉన్న వడ్లనీ, బండిని గుంజే ఎడ్లనూ తానే మొస్తుంది అనుకుందట.

JAC అంటే నీ గడీ ముందు మొరిగే పెంపుడు కుక్క కాదు , నీ ఇంటి ముందు కుక్కను కట్టేసే పందిరి గుంజ కాదు . నీ మెహిఫిల్‌లో కలిపే కాక్ టెయిల్ అసలే కాదు, మధ్యలో నంజుకునే ముక్క అసలే కాదు. ఒక వేళ ఎవడన్నా అంటే వాడు కచ్చితంగా గడీ ముందు కట్టేసిన కట్టు బానిసనే. కాకుంటే చరిత్ర తెలియని వంచకుడు .

ఎక్కడ పుట్టింది తెలంగాణ నినాదం? ఎవడు కన్నాడు ఈ రక్త కాసారం? ఎవడు ఈదాడు నిర్భంధాల వైతరిణి? ఎన్ని ప్రాణాలు, ఎన్ని ఎన్ని పోట్లు, ఎంత వంచన, ఎంత రక్త పాతం … ప్రపంచంలో ఇటువంటి ఉద్యమం, ఇంత దీర్ఘకాలిక తండ్లాట, కత్తుల వంతెన మీద నడిచిన త్యాగాల బాట. ఉద్యమ పూదోట jac …

పందొమ్మిది వందల అరవై తొమ్మిది మొదలు జమ్మికుంట, మంథని,పెద్దపల్లి, జగిత్యాల కేంద్రంగా ముప్పై నలభై మంది తెలంగాణ నినాదం అందుకొని అడవుల్లోకి పోయారు. ఆ తరంలొనే కనీసం యాభైకి పైగా కరపత్రాలు వచ్చాయి

ఓరయ్యా JAC చరిత్ర తెలుసుకో…
ఐక్య కార్యాచరణ కమిటీ పందొమ్మిది వందల అరవై తొమ్మిది దశకంలోనే ఉంది.
సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ మొదలు ఐక్య విప్లవకారుల ప్రతిఘటనా కమిటీ , భావసారూప్యత కలిగిన విప్లవ శ్రేణులు. విరసం. జన నాట్యమండలి , ఆల్ ఇండియా రివల్యూషనరీ కో ఆర్డినేషన్ కమిటీ, ఇక విద్యార్ధుల ఇక ఐక్య సంఘటన PDSU, RSU , దాని కొనసాగింపు టీవీఎస్ , తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ కళాసమితి, తెలంగాణ ప్రజా ఫ్రంట్, టి వి వి. ప్రజా కళామండలి…

కొండపల్లి సీతారామయ్య, శివసాగర్ , కొండా లక్ష్మణ్ బాపూజీ, ఎంటి ఖాన్, కేశవ రావ్ జాదవ్, గద్దర్, దివాకర్, బెల్లి లలిత, రాజన్న, అమర్, వీరన్న, ఇన్నారెడ్డి , ఆదివాసీ లిబరేషన్ ఫ్రంట్ రాము అన్న. జయశంకర్, కోదండ రామ్… ఇవి కాకుండా వందలాది కుల సంఘాలు, ఆఖరికి అనాథల సంఘం, అడుక్కునే బిచ్చగాళ్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో బాధ్యులే .

నాటికి తెలుగుదేశం , సిపిఐ , సిపిఎం, న్యూ డెమొక్రసీ తప్ప అన్ని రాజకీయ విప్లవ పార్టీలు తెలంగాణ కోసం భుజం భుజం కలిసి నడిచాయి .
తెలంగాణ రాస్ట్ర సమితి ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది?
కోదండరామ్ ఒకరు చేస్తే నాయకుడు అవలేదు. ఒకరు నడిపిస్తే నడవలేదు. అప్పటికే ఆయన అధ్యాపకుడు, మేధావి, విద్యావంతుల వేదిక నిర్మాణంలో… అంతకు ముందు ముప్పై ఏళ్లుగా పౌర హక్కుల సంఘం వందల వ్యాసాలు రాసిన మనిషి.

ఇకపోతే, jac రూపకల్పన నాదే, దానికి ఛైర్మన్ ను చేసింది నేనే అంటే అది ఈ మిలీనియం జోక్.
డియర్ పింకీస్, ఉద్యమానికి మీ అవసరం ఎప్పుడూ లేదు, మీరే ఉద్యమంలోకి వృద్ద నీలి జంబూకమ్ లాగా వచ్చారు, ఇప్పుడు రంగు వెలిసింది. అంతే.

మీరు జాతి పితలను తయారు చేసుకుంటారో, జాతిపీత అని పిలుచుకుంటారో మీ ఇస్టం. కానీ చరిత్ర అనేది ఒకటి ఉంది.
అందులో తాలు ఏదో, గింజ ఏదో పండించిన రైతుకు, సేద్యం చేసిన కూలీకి తెలుసు.
గెట్టు మీద కూర్చున్న దొంగ పెత్తందారుకి అసలే తెలియదు….. డా. గుర్రం సీతారాములు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!
  • వావ్, షేన్ వార్న్..! సంపద సృష్టించడం అంటే, ఇదుగో ఇదీ…
  • అన్నీ నిజాలు చెప్పడం మొదలెడితే… ప్రతి క్షణం అమెరికా ఇరాన్ వార్ మరి..!!
  • కార్పొరేట్ క్రికెట్ దందా… ఖాళీ సీట్లు… డొల్ల బాధ్యత… కాస్మెటిక్ కన్నీళ్లు…
  • ఇండియాపై విద్వేష యుద్దం… కశ్మీరీ సపరేటిస్టు లేడీకి యావజ్జీవం…
  • జీవన్‌రెడ్డి తప్పుటడుగులా..? ఇంత సీనియర్ నేత తప్పులో కాలేస్తున్నాడా..?!
  • శృతితప్పిన గురుకుల నిర్వహణ… సరిగమల్లేని సర్కారీ కొలువు…
  • అమెరికా, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్… మన ఆకాశ్‌కు గిరాకీ…
  • తాళి చుట్టే మణిరత్నం సినిమా కథలన్నీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions