Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!

February 7, 2026 by M S R

.

సోషల్ మీడియాలో ఒక పోస్టు కనిపించింది… ‘‘విజయవాడలో 50 కోట్ల విలువ చేసే ఒక స్థలం అమ్మకానికి ఉంది, దానికి సంబంధించి ఒక మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడితే అతను చెప్పిన మాట ఏమిటంటే… 2029 జగన్ రాకుండా, మళ్లీ చంద్రబాబు వస్తే అప్పుడు చూద్దాం… 50 కోట్లు పెట్టి ఇప్పుడు కొన్నా, తర్వాత జగన్ వస్తే
10 కోట్లకు కూడా అమ్ముకోలేం అంటున్నాడు… రెండు రోజులు బాగా ఆలోచించి…’’

పాపం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడూ బాధపడిపోతూనే ఉంటాడు… కానీ చంద్రబాబుకే అర్థం కావడం లేదు… విషయం ఏమిటంటే..? రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా ప్రజలు ఎన్నో ఆశలతో అధికారం అప్పగిస్తే, అమరావతి రాజధానిని కట్టలేక సగంలో వదిలేస్తే… అఫ్‌కోర్స్, పోలవరం కూడా… జగన్ అధికారంలోకి వచ్చాక రెండూ పఢావు పడిపోయాయి కదా…

Ads

తరువాత ఏమైంది..? జగన్ వ్యతిరేక వోటో, చంద్రబాబు పాజిటివ్ వోటో… కారణం ఏమైతేనేం… చంద్రబాబు మళ్లీ గెలిచాడు… అమరావతి మళ్లీ మొదలైంది… పోలవరం కూడా స్పీడ్ పెరిగింది… కానీ..?

చంద్రబాబు ఏం ఆలోచించినా సరే… మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అనే భయమే సర్వత్రా ఆవరించి ఉన్నట్టు కనిపిస్తోంది… మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు కూడా ఎదురుతన్నాయి ఇందువల్లే… ఒరేయ్, మీరెవడైనా రండి, కానీ మళ్లీ నా పవర్ రాగానే అవి రద్దు చేసి పారేస్తాను అన్నాడు జగన్… మెడికల్ కాలేజీల కథ ఆ దెబ్బకు స్థంభించిపోయింది …

సో, చంద్రబాబు ఏం చేయాలనుకున్నా సరే… తన పీరియడ్‌లోనే చేసేయాలి… కానీ తను చేయడు… ఇదీ అసలు సమస్య… జగన్ మళ్లీ గనుక అధికారంలోకి వస్తే అన్నీ ‘రివర్స్ టెండర్ల’ దశలోకి వెళ్లిపోయి, మళ్లీ అన్నీ రివర్స్ పంథాలోకి తీసుకుపోతాడు, పక్కా…

జగన్ వందల కోట్ల ప్రజాధనంతో కట్టుకున్న రుషికొండ ప్యాలెస్‌ను చంద్రబాబు ఏం చేసినా సరే, తను మళ్లీ పవర్‌లోకి వస్తే గనుక, వెంటనే దాన్ని హస్తగతం చేసుకుని, అందులోనే తిష్ట వేస్తాడు… అదీ పక్కా… పోలవరం కూడా అంతే… నవయుగను గతంలో తస్మదీయ కులం కారణంతో తన్ని తరిమేశాడు కదా జగన్… ఎందుకైనా మంచిదని చంద్రబాబు కూడా అందరికీ ఆప్తుడైన అదే మేఘా కృష్ణారెడ్డితో చేయించుకుంటున్నాడు… తనకూ పట్టిసీమ హితుడే కదా, కులం వేరైనా…

amaravathi

అమరావతికి వద్దాం… జగన్ వస్తే మళ్లీ అది పఢావే… అందులో సందేహం లేదు… అసలే అది ఓ రియల్ ఎస్టేట్ దందా అనే విమర్శలున్నాయి కదా… అది కమ్మల రాజధాని మాత్రమే అని జగన్ ప్రగాఢ నమ్మకం… అసలే కమ్మ అంటేనే తనకు అదోరకం వ్యతిరేకత కదా…

చంద్రబాబేమో గతంలో సేకరించిన వేల ఎకరాలు సరిపోవని… ఇంకా ఇంకా సేకరిస్తాడట… ఎంత భూమీ సరిపోదు తనకు… ఉన్నది చాలు, వేగంగా ఉద్దరించవయ్యా అనేవాళ్లు లేరు… అన్నా వినడు… ఓవైపు ఫస్ట్ ఫేజ్ పూలింగు రైతులకే ఏ దిక్కూదివాణం లేదు… పైగా మళ్లీ జగన్ వస్తే అనే భయం ఉండనే ఉంది… దాంతో సెకండ్ ఫేజ్ పూలింగుకు ఎవరూ ఆసక్తిగా ముందుకు రావడం లేదు…

సహజం… తెలుగుదేశం అనుకూల గ్రామాల్లో కూడా రెండో దశ పూలింగుకు ఎవరూ ముందుకు రావడం లేదని వార్తలు… మళ్లీ జగన్ వస్తే ఎలా..? ఇదే భయం… చేసేదేదో చకచకా వేగంగా నీ హయాంలోనే పూర్తిచేయవయ్యా అంటారు అస్మదీయులు చంద్రబాబును ఉద్దేశించి… కానీ, అలా చేస్తే చంద్రబాబు ఎలా అవుతాడు..?

అవసరమైతే మూడో దశ పూలింగు కూడా చేపడతాను అంటాడేమో… ఊదు కాలదు, పీరు లేవదు… ఆ రాజధాని ఓ కొలిక్కి రాదు… నెల క్రితం సెకండ్ ఫేజ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటివరకు వచ్చిన ఎకరాల సంఖ్య జస్ట్ 664 ఎకరాలు… తొలి దశ పూలింగుకు ఇప్పటికీ ఎంత తేడా..? రైతుల్లో ఆసక్తి లేదు, ఫస్ట్ దశ పూలింగు రైతుల అనుభవాలు చూస్తున్నారు కదా, భయపడుతున్నారు…

రెండో దశ పూలింగు కోసం వడ్డమాను, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి రెవెన్యూ గ్రామాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు… వీటిల్లో వడ్డమాను మినహా మిగిలిన మూడు గ్రామాలు తెలుగుదేశం అనుకూలం కావడం, పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని అమరావతి మండలంలో ఉండటంతో రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తారని ప్రభుత్వం ఆశించింది…

అప్పట్లో రైల్వే ప్రాజెక్టు వస్తుందని, కేంద్రం భూములు తీసుకుంటుందనే ప్రచారం రావడంతో పూలింగుకు ఇవ్వాలని నిర్ణయించి కర్లపూడి రైతులు ఎమ్మెల్యేను కలిశారు… స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ తమ భూములు సమీకరణకు తీసుకోవాలని 2024లో సిఎంకు ఒక లేఖ సమర్పించాడు…

దీంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారని, భూములు ఇస్తారని ఆశించి ఆయా గ్రామాలకే ముందు నోటిఫికేషన్‌ ఇచ్చారు… బుధవారం నాటికి ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు… యండ్రాయి రెవెన్యూలో 291 ఎకరాలు, పెదమద్దూరులో 192 ఎకరాలు, కర్లపూడిలో 181 ఎకరాలు పూలింగు కింద వచ్చింది… వీరిలోనూ ఎక్కువ మంది పూలింగుకు ఇవ్వడం కోసమే కొనుగోలు చేసినవారివే…

నోటిఫికేషన్‌ సమయంలో… మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ నిర్వహించిన గ్రామసభల్లో  సమయంలో రైతులు అనేక సమస్యలు ముందుకు తెచ్చారు… వాటిని పరిష్కరించాలని కోరారు… అయితే అవి ఇప్పటికీ పరిష్కారానికి నోచలేదు… పైగా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వడ్డమానులో రైతులు నిరసన కూడా వ్యక్తం చేశారు…

అమరావతి

ప్రస్తుత పూలింగు గ్రామాల్లో కౌలు పరిహారం పెంపు, రుణమాఫీ, అవిభాజ్య హక్కుల పరిష్కారం, గ్రామకంఠాల నిర్ధారణ వంటివాటితో రిటర్నబుల్‌ ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, ఒకేచోట ఇస్తారా? లేక వేర్వేరుగా ఇస్తారా? అనే అంశాలపై ప్రభుత్వం వైపు నుండి స్పష్టత లేదు…

అసలు ఏం జరుగుతోందని అమరావతిపై మంచి అవగాహన ఉన్న ఓ సీనియర్ జర్నలిస్టు వల్లభనేని సురేష్‌ను అడిగినప్పుడు… ‘రైతుల్లో విశ్వాసం నెలకొల్పితేనే అమరావతి రెండో దశ పూలింగు వేగవంతం అయ్యే చాన్స్ ఉంది’ అని అభిప్రాయపడ్డాడు… నిజం, చాలా చిక్కులున్నయ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?
  • గుణశేఖర్ గుణాత్మక పంథా… సామాజిక ఇతివృత్తాల వైపు… కానీ..?
  • ఆ సయామీ బంధం తెలిసీ… కాళేశ్వరాన్ని సీబీఐలో ఎందుకు ముంచినట్టు..!!
  • వాషింగ్టన్ పోస్ట్ ‘ప్రమాద ఘంటికలు’ – ప్రపంచ మీడియాకు హెచ్చరిక
  • జనంలోకి రాడు… ఇల్లు కదలడు… అజ్ఞాతం వీడని ‘జాతిపిత’…
  • పాలకుల తెలివిడి- భవిష్యత్తు తరాలకు భరోసా… అదీ ఈ దేశపు కథ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions