.
ఉద్యమ పార్టీ అని చెప్పుకునేది… తొమ్మిదినరేళ్లు తెలంగాణను పాలించింది… ఆ పార్టీ ఓటమిలోనూ, గెలుపులోనూ ఎంత హుందాగా వ్యవహరించాలి..? పైగా ఒక దశలో ఆ పార్టీ అధినేత ఏకంగా ప్రధాని కావాలని అనుకున్నాడు… దేశమంతా తిరిగాడు… తనే కాదు, తన క్యాంపు, తన ముఖ్య అనుచురులు, తన మీడియా ఇంకెంత హుందాగా ఉండాలి..?
కానీ డకౌట్ అయినవాడు సెంచరీ చేసిన విజేతను చూసి పకపకా నవ్వడాన్ని ఏమనాలి..? ప్రజలు తమను బట్టలిప్పి బజారులో బరిబాతల నిలబెడితే, కింద పడినా నేనే తోపు నేనే తురుము అంటూ ఎదుటోడిని చూసి వెక్కిరింపులకు దిగితే ఏమనాలి..? దాన్ని బీఆర్ఎస్ అనాలి… దాన్ని నమస్తే తెలంగాణ అనాలి…
Ads
కటువుగా ఉన్నా సరే, ఇదే నిజం… నిజమైన ప్రజానాయకుడు ఓటమిని హుందాగా అంగీకరిస్తాడు, వోటరు తీర్పును గౌరవిస్తాడు… అది రాజకీయ సంస్కారం… కానీ కేసీయార్ బదులు తన వారసులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా అన్నీ తామే ఐన హరీష్ రావు, కేటీయార్ ఏమంటున్నారు..?
90 శాతం గెలవలేని గెలుపు ఓ గెలుపా అంటున్నాడు కేటీయార్… కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు అంటున్నాడు హరీష్ రావు… పింక్ మీడియా అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అని రాసి పారేసింది… కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారట… మరీ పాఠకులు, ప్రజలు నవ్వుకుంటారనే సోయి కూడా తప్పినట్టుంది…

అది పత్రిక కాదు, కరపత్రికే… విద్వేషం చిమ్మే విషపుత్రికే… కానీ ప్రజలు ఓ తీర్పు చెప్పినప్పుడు, దాన్ని యథాతథంగా చెప్పాలి కదా, ఆ ప్రజలను గౌరవిస్తూ…! అది పాత్రికేయ విజ్ఞత…! తనే రాసుకుంది కదా 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపు అని… మరి 66 గెలిచినోడు బోర్లాపడ్డట్టు ఎలా అయింది..?
అసలు నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ రాలేదు… 14 మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటే… కార్పొరేషన్లలో అయిపూజాడా లేదు… మరి దీన్నేమనాలి..? చివరకు పార్టీ అధినేత ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వెల్‌లో కూడా చావుదప్పి కన్నులొట్టబోయిన చందమే కదా… మరి ఎందుకిలా విజేతను చూస్తూ వెక్కిరింపులు..? ఇది వోటరును కూడా అవమానించడమే..!

అసలు 90 శాతం గెలవని గెలుపూ ఓ గెలుపేనా అనే విమర్శలో… ఆ లెక్కలో ఏ తర్కం ఉందో కేటీయార్‌కే తెలియాలి… ఇవి కాంగ్రెస్‌కు చెంపపెట్టు ఫలితాలు ఎలా అయ్యాయో హరీష్ రావే చెప్పాలి… కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 123… పింక్ బ్యాచ్ గెలిచింది 13 (తన లెక్కే)… అంటే ఎంత శాతం..? పది శాతం…
అంటే ఏ రేంజుకు పడిపోయినట్టు..? అన్నట్టు 66తో కాంగ్రెస్ బొక్కబోర్లా పడటం కాదు… హంగులు క్లియరైతే ఏకంగా 90 దాటిపోతుంది ఆ పార్టీ నంబర్… ఆరు కార్పొరేషన్లు కూడా… అంటే, కష్టమ్మీద పది పరుగులు చేసిన బ్యాటర్ అలవోకగా 90 పరుగులు చేసినోడిని వెక్కిరించినట్టుగా ఉంది ఇది… వారెవ్వా..!! ఫ్రస్ట్రేషన్ పీక్స్..!!
Share this Article