Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

1961 లో ఎన్టీయార్… 1990 లో చిరంజీవి… అదే జగదేకవీరం… అతిలోక సుందరం…

February 23, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. శ్రీదేవిని నిజంగానే ఇంద్రలోకం నుండి దిగివచ్చిన ఇంద్రకుమారిగా , అతిలోకసుందరిగా ప్రేక్షకులు మరచిపోలేని విధంగా తీర్చిదిద్దిన రాఘవేంద్రరావుని , కాస్ట్యూమ్స్ డిజైనర్ నీతా లుల్లాని ముందుగా మెచ్చుకోవాలి . అలాగే ఆమెకు మేకప్ చేసిన ఆర్టిస్టుని . ఎంత అందంగా ఉంటుందంటే అబ్బ ఇంత అందమా అని ప్రవరుడికి కూడా అనిపించేంత .

1990 లో ఈ సినిమా రిలీజయ్యే టైంకు సోషల్ ఫేంటసీ తరగతిలో ప్రేక్షకులు మరచిపోలేని సూపర్ డూపర్ హిట్ 1961 లో వచ్చిన యన్టీఆర్ జగదేకవీరుడి కధ . ఆ సినిమాలో ఇంద్రకుమారి బి సరోజాదేవి . ఆరోజుల్లో ఆమెను ఇలాగే అబ్బ అనే చూసారు .

Ads

ఎలా అయితే పింగళి వారు ఆ సినిమాలో హలా , మానవ వీరుడు వంటి పదప్రయోగాలను చేసారో 1990 లో వచ్చిన ఈ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కూడా జంధ్యాల ప్రేక్షకులు మరచిపోని పదప్రయోగాలను చేసారు . మానవా అని అతిలోకసుందరి అంటే నువ్వా మాట మానవా అనే హీరో రాజు డైలాగ్ అద్భుతంగా పేలింది . అలాగే తింగరబుచ్చి . ఈ సినిమా తర్వాత ఈ మాట ఈరోజుకీ ఊతపదమే .

మరో గొప్ప పదప్రయోగం . అచ్చిక బుచ్చికలాడి . పింగళి వారి తర్వాత మనం మరచిపోలేని రచయిత జంధ్యాల . చాలా సినిమాలలో ఎన్నో పదాలను ఇచ్చి వెళ్ళారు .హేట్సాఫ్ .

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవటానికి చిరంజీవి స్టార్డం , ఆయన క్రమశిక్షణ , అంకితభావం . 104 డిగ్రీల జ్వరంతో , జ్వరంలో నటించి , మద్రాసు తిరిగొచ్చి పదిహేను రోజులు హాస్పిటల్ పాలయ్యారట . శ్రీదేవి బొంబాయి వెళ్ళవలసి ఉండి షూటింగుని పూర్తి చేయవలసి వచ్చిందట . ఆషామాషీగా మెగాస్టార్ కాలేదు . స్వయంకృషీవలుడు .

రాష్ట్రం తుఫానుతో వణికిపోతున్న సమయంలో కూడా సినిమా రిలీజయిన డే వన్ నుంచి కూడా కలెక్షన్ల తుఫానే . 15 కోట్లు వసూలయిందట . 2025 లో 3D లో రీరీలీజ్ చేసారు . ఎన్నిసార్లు టివిలో వచ్చినా ప్రేక్షకులను కట్టిపడేసే ఫేంటసీ సినిమా .

ఈ సినిమా అఖండ విజయానికి మరో దోహదకారి పాటలు . వేటూరి వారు అద్భుతంగా వ్రాసిన పాటలకు ఇళయరాజా సంగీత దర్శకత్వంలో బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర , శైలజ ప్రాణం పోసారు . సుందరం మాస్టారు బ్రహ్మాండమైన నృత్యాలను కంపోజ్ చేసారు . తెరవెనుక వీరందరి కష్టానికి అంతకు పది రెట్లు న్యాయం చేసారు చిరంజీవి , శ్రీదేవి .

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బా , అందాలలో అహా మహోదయం భూలోకమే నవోదయం , ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా , యమహో నీ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం , మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా , జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజనీ కుమారా పాటలు ఈరోజుకీ సూపర్ డూపర్ హిట్టే .

ఈ పాటల అద్భుత చిత్రీకరణలో దర్శకేంద్రుడు రాఘవేంద్రునికి చేదోడుగా ఆర్ట్ డైరెక్టర్ బి చలం నైపుణ్యాన్ని అభినందించాలి . ఈ మొత్తం అందమైన చిత్రీకరణను ప్రేక్షకులకు చూపిన ఫొటోగ్రఫీ డైరెక్టర్ కె యస్ ప్రకాష్ .

చిరంజీవి , శ్రీదేవిల తర్వాత ప్రేక్షకులు మరచిపోలేని నటుడు విలన్ పాత్రలో అమ్రీష్ పురి . తన డబ్బింగ్ తానే చెప్పుకోవడంతో ఆ డైలాగులు ఇంకా బాగున్నాయి . చిరంజీవి పెంచే నలుగురు అనాధలుగా బేబీ షామిలి , బేబీ షాలిని , మాస్టర్ రిచర్డ్స్ , మాస్టర్ అమిత్ బాగా నటించారు . మొదటి ముగ్గురు నిజ జీవితంలో కూడా తోబుట్టువులే . ఈ ట్రూపులో ఓ శునకరాజము కూడా ఉంటుంది . దాని చేత కూడా దర్శకుడు బాగా నటింపచేసాడు .

ఇతర పాత్రల్లో కన్నడ ప్రభాకర్ , రామిరెడ్డి , బ్రహ్మానందం , జనకరాజ్ , అల్లు రామలింగయ్య , తనికెళ్ళ భరణి , సంగీత  తదితరులు నటించారు . తెలుగులో స్వైరవిహారం చేసిన ఈ సినిమా హిందీ , తమిళ , మళయాళ భాషల్లోకి డబ్ చేయబడింది . అన్ని భాషల్లోను విజయం సాధించింది .

ఇంత గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించింది ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ . వైజయంతి మూవీస్ బేనర్లో వచ్చిన ఈ సినిమా చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరేమో ! ఈ సినిమా కధను కూడా నేను వ్రాయటం లేదు . వ్రాయడమంటే carrying coal to New Castle . తెలుగు సినీ రంగంలో క్లాసిక్స్ అయిన మాయాబజార్ , గుండమ్మ కధ , ప్రేమనగర్ , దసరాబుల్లోడు వంటి సినిమాల కధలు ఎలా పాపులరో ఈ మాస్ క్లాసిక్ సినిమా కధ కూడా అంతే .

ప్రేక్షకుల గుండెల్లో అతిలోకసుందరిగా నిలిచిపోయిన అందాల తార శ్రీదేవి . మన కళ్ళ ముందే పెరిగి మనకన్నా ముందే ఈ భువిని విడిచి పైలోకాలకు వెళ్ళిన ఇంద్రజకు నా ఈ రైటప్ అంకితం ….

నేను పరిచయం చేస్తున్న 1245 వ సినిమా   #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 1961 లో ఎన్టీయార్… 1990 లో చిరంజీవి… అదే జగదేకవీరం… అతిలోక సుందరం…
  • బయటికి కనిపించని రంగుల మాయాలోకం… ముంబై నైట్ లైఫ్…
  • కాలం మారిపోతోంది..! భారతీయ వైవాహిక వ్యవస్థలో ఓ నిశ్శబ్ద విప్లవం..!!
  • దోషి – నిర్దోషి… ఓ మంచి స్టోరీ లైన్… పైగా పకడ్బందీ స్క్రీన్‌ప్లే…
  • తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ ‘పింక్ మేనియా’ నుంచి బయటపడలేదా..?!
  • ఆయేషా మీరా..! కేస్ ఖతం..!! మరి ఎవరు హత్యాచారానికి పాల్పడింది..!?
  • ఓ తండ్రి చితి… పక్కన కొడుకు… ఈ వైరల్ కథకు వాస్తవ ముగింపు అదేనా..?
  • 37 ఏళ్ల తర్వాత తల్లి పక్కకు తండ్రిని చేర్చాడు..! పక్కపక్క సమాధులు..!!
  • సరిత..! అప్పట్లో ఈ నటి విడాకుల కేసు ఓ సంచలనం…!!
  • స్టెమ్ సెల్ థెరపీ..! సుగర్ వ్యాధిపై మనిషి గెలుపు త్వరలోనే..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions