Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శృతి మించిన శృంగారం… నారీ నారీ నడుమ ‘లైన్’ తప్పిన మురారి…

March 7, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఇరువురు భామల కౌగిలిలో స్వామీ ఇరుకున పడి నీవు నలిగితివా . 1990 లో వచ్చిన బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారీ అనగానే ఏ రస హృదయం కల స్త్రీ పురుషుడుకయినా గుర్తొచ్చే పాట ఇదే . ఒక్కటంటే ఒక్క ఫైట్ లేకుండా బాలకృష్ణ ఫక్తు రొమాంటిక్ హీరోగా నటించిన సినిమా కూడా . బాలకృష్ణకు 50 వ సినిమా .

ఈ సినిమా నిండా అందరూ 1+2 రసికులే . ముందుగా మెయిన్ హీరో బాలకృష్ణ , ఆయనకు ఇద్దరు . బాలకృష్ణ మేనమామ సత్యనారాయణకు ఇద్దరు భార్యలు . హాస్య పాత్రధారిణి రమాప్రభకు 1+2 . ఇంట్లో ఒకరు , పక్కింట్లో ఒకరు .

Ads

మనకు చాలామంది అందమైన ప్రౌఢ అత్తలు ఉన్నారు . శారద , లక్ష్మి , వాణిశ్రీ , జయచిత్ర , రమ్యకృష్ణ , నగ్మా !! ప్రౌఢలు కాకుండా వయసుడిగిన అత్తలు సూర్యకాంతం , యస్ వరలక్ష్మి , హేమలత , ఛాయాదేవి , ఇత్యాదులు .

ఈ సినిమాలో అత్త శారద . అందంగా ఉన్నావని అన్నా , వయసులో చిన్నదానివి లాగా ఉన్నావనో ఉబ్బిచ్చినా ఐసయిపోతూ ఉంటుంది . ఎవరు కారు !? ఒకప్పుడు ఆడవారు వయసుని తక్కువగా చూపించుకునేందుకు తాపత్రయపడే వారు . ఇప్పుడు మగవారు కూడా ఏం తీసిపోవటం లేదు . నాలాంటోళ్ళు తప్పితే అయిదారు వెంట్రుకలున్నా రంగేస్తున్నారు . జనంలోకి వచ్చినప్పుడు పొట్ట లోపలికి లాక్కుంటూ ఉంటారు . ఎన్ని ఆపసోపాలో మనుషులకు ! ఇంకా ఇంకా ఆకర్షించాలని తపన !! Poor chaps !!

శారదకు ఇద్దరు కుమార్తెలు . శోభన , నిరోష . శృతిమించిన ఆభిజాత్యంతో అత్తను పుట్టింటికి పంపించేస్తుంది . ఆమె మనమడు బాలకృష్ణ . పేరు వెంకటేశ్వరరావు . మరి ఇద్దరు భామల ముద్దుల మొగుడు కదా ! ఆ వెంకన్న పేరే పెట్టారు సినిమాలో . పంతం పట్టి మేనమామ పక్కింటిలో చేరి మరదళ్ళకు సైట్ కొడుతూ ఉంటాడు .

సినిమా చివరి దాకా 1+2 రొమాంటిక్ డ్యూయెట్లు , బావామరదళ్ళ చెతుర్లు , పరస్పర అల్లర్లు . క్లైమాక్సులోనే బ్రహ్మాండమైన ట్విస్ట్ పెట్టారు నిర్మాత మురారి , దర్శకుడు కోదండరామిరెడ్డి . సత్యనారాయణ ఇద్దరు భార్యలు ఒకే టైంలో ప్రసవిస్తారు . శారదకు కవలలు . రెండో ఆమె సరస్వతికి ఒక ఆడ బిడ్డ . పురిట్లోనే శారద బిడ్డల్లో ఒకరు చనిపోతారు . ఆమె ఎక్కడ తట్టుకోలేదో అని సరస్వతి ఒక్క బిడ్డను తీసుకుని వచ్చి శారద పక్కలో పడుకోపెడతారు .

సినిమా చివర్లో సత్యనారాయణ ఆ నిజాన్ని శారదకు , కూతుళ్ళకు చెప్పి బాంబు పేలుస్తాడు . ఇద్దరిలో ఎవరు ఎవరి బిడ్డో తెలిసిన సత్యనారాయణ , అతని తల్లి అంజలీదేవి , రెండో ఆమె సరస్వతో చెప్పటానికి ఇష్టపడరు . అది సినిమా అయిపోయినా సస్పెన్సే . ఇద్దరూ హీరో గారిని ప్రేమించారు కావున తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఇద్దరు భామలనూ స్వీకరించటంతో సినిమా శుభాంతం అవుతుంది .

యువచిత్ర వారి సినిమాలన్నీ చాలా సంసారపక్షంగా ఉంటాయి . ఎందుకనో ఈ సినిమాలో శృంగార రసాన్ని ఎక్కువగా కురిపించారు . సినిమాల్లో హీరోయిన్ స్నానం చేస్తుంటే హీరో చూస్తుంటాడు . ఈ సినిమాలో హీరో గారి నగ్న స్నాన శరీరాన్ని హీరోయిన్లు , వారి తల్లి , ఇంట్లో ఉండే మరో ప్రౌఢ రమాప్రభ అందరూ తరిస్తారు . కాస్త డైలాగులు కూడా అలాగే గీకారు . అయిననూ అందంగానే ఉంటుంది సినిమా . స్త్రీ పురుషులు బాలలు వృధ్ధులు అందరూ ఆనందించారనే చెప్పొచ్చు .

ఈ సినిమా సూపర్ విజయానికి మరో ప్రధాన కారణం కె వి మహదేవన్ సంగీతం , ఆత్రేయ , వేటూరి ,సిరివెన్నెల లిరిక్స్ , బాలసుబ్రమణ్యం సుశీలమ్మ గాత్రం , తార సుందరం శేషులు కంపోజ్ చేసిన నృత్యాలు . పాటలను అద్భుతంగా చిత్రీకరించిన కోదండరామిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించాలి .

ఆయనను మరొకందుకు కూడా మెచ్చుకోవాలి . సాధారణంగా 1+2 సినిమాల్లో ఎవరో ఒకర్ని లేపేస్తుంటారు . లేదా ఒకరు త్యాగం చేస్తుంటారు . అలా కాకుండా హేపీగా సర్దుకుపోతారు ఈ సినిమాలో . సినిమా అంటే ఇలా ఉండాలి .

ఇరువురు భామల కౌగిలిలో పాటను మనసు కవి ఆత్రేయ వ్రాసారు . ఓ వాన పాట కూడా ఉంది . ఏం వానో తడుపుతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది . మనసులోని మర్మము తెలుసుకో త్యాగరాజ కృతిని చక్కగా వాడుకున్నారు . వయసు సొగసు కలిసిన వేళ , పెళ్ళంటేనే వేడెక్కిందిగా డ్యూయెట్లు చాలా అందంగా చిత్రీకరించబడ్డాయి . వీటిని వేటూరి , సిరివెన్నెల వ్రాసారు . Not to be missed .

ఈ సినిమాకు డైలాగులను నలుగురు వ్రాసారు . అన్ని సుమోలు ఎందుకు అవసరమయ్యాయో ! భమిడిపాటి రాధాకృష్ణ , తనికెళ్ళ భరణి , సత్యమూర్తి , వినాయక శర్మ .

ఈ సినిమా చూసి తరించని వారు ఉండరు . ఎవరయినా ఒకరూ అరా ఉంటే యూట్యూబులో చూడవచ్చు . An excellent romantic entertainer with melodious songs . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్   (ఇదే టైటిల్‌తో రీసెంటుగా శర్వానంద్ సినిమా వచ్చింది)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టాప్ వన్ బౌలర్ అండ్ టాప్ వన్ బ్యాటర్… తీసేస్తారా, ఉంచేస్తారా…
  • శృతి మించిన శృంగారం… నారీ నారీ నడుమ ‘లైన్’ తప్పిన మురారి…
  • మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం, నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…
  • “హే గూగుల్… గతం మరవనివ్వవా..! కర్ణాటక హైకోర్టుకు శ్రీలంక సుప్రీం జడ్జి”
  • ఇరాన్ యుద్ధాన్ని ఎఐ శాసిస్తోంది… ఇది కృత్రిమ మెదళ్ల సమరం…
  • యూపీఎస్సీ టాపర్..! ఈ సక్సెస్ స్టోరీ వెనకాలే మరో కంట్రాస్టు కోణం..!
  • డెడ్ హ్యాండ్..! శత్రువుల గుండెల్లో వణుకు..! అసలు ఏమిటది..?!
  • అనంత పెద్ది శ్రీరాముడు… అనంతానంత భావగంభీర పదప్రయోగుడు…
  • చికెన్ నెక్… సిలిగురి కారిడార్… కేంద్ర పాలిత ప్రాంతం కాబోతున్నదా..?
  • ‘మృత్యుంజయా… ఇంతకీ ఈ సినిమా కథేమిటి మహాశయా…’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions