..
Mohammed Rafee ….. నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా
– యువ గాయకుడికి నేపాల్ ప్రజలు చేసిన పట్టాభిషేకం!
బాలెన్ షా… నేపాల్ కాబోయే ప్రధాని! ప్రస్తుత ప్రధాని కెపి శర్మ ఓలి లాంటి సీనియర్ నేతను ఢీ కొని 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడించిన యువ చైతన్య కెరటం బాలెన్ షా!
మైధిలి మాధేసికి చెందిన అతని పూర్తి పేరు బాలేంద్ర షా! ఇతను స్ట్రక్చరల్ ఇంజనీర్! ఎంటెక్ మన కర్ణాటకలో విశ్వేశ్వరయ్య కళాశాలలో పూర్తి చేశాడు. చిన్న ఉద్యోగంలో చేరి ఒక డాక్టర్ ను వివాహం చేసుకుని ర్యాప్ సింగర్ గా హిప్ హాప్ సింగర్ గా నేపాల్ సమాజం లోని సమస్యలపై పాటలు పాడుతున్న రోజుల్లో ఒక సంఘటన అతని జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది.
భార్య ప్రసవం కోసం అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లుతున్నప్పుడు అడ్డదిడ్డమైన ట్రాఫిక్, రోడ్లను ఆక్రమించుకుని అమ్మకాలు సాగించే చిరు బండ్లు అతన్ని ఆందోళనకు గురి చేశాయి! ఏదో చేయాలి మార్పు తీసుకు రావాలనే సంకల్పం అప్పుడే మొదలైంది. అంతే ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడే వచ్చిన ఖాట్మండ్ ఎన్నికల్లో మేయర్ గా పోటీ చేశాడు.
Ads
కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ లెనినిస్ట్ పార్టీల వైపు చూడకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ నేతలకు చుక్కలు చూపించి విజయం సాధించి మేయర్ అయ్యి సంచలనం సృష్టించాడు. అప్పుడతని వయసు 31…
- ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్ డోజర్ పంపించి ఆక్రమణదారులపై కొరడా ఝలిపిస్తుంటే అంతే ఎత్తున ప్రత్యర్ధి పార్టీలు రాజకీయం చేస్తున్నాయి! కానీ, మేయర్ అయిన రెండవ రోజే బాలెన్ షా స్వయంగా బుల్డోజర్ తో రంగంలోకి దిగి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టిన కాంప్లెక్స్ లను కూల్చి పడేసాడు!
ఒక్కరు కూడా అడ్డుకునే సాహసం చేయలేదక్కడ! ట్రాఫిక్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు! ఫుట్ పాత్ ఆక్రమణదారులను తొలగించి వారికి అమ్ముకోవడానికి అక్కడక్కడా ప్రత్యేక మార్కెట్ సౌకర్యం కల్పించాడు! ముఖ్యంగా చెత్తను ఏరోజుకారోజు తొలగించే చర్యలు తీసుకున్నాడు!
కట్ చేస్తే, నాలుగేళ్ళ అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో ఈ ఏడాది జనవరి 5న చేరాడు! ఈసారి నేరుగా ప్రధానమంత్రి అభ్యర్దిగా ప్రధాని కెపి శర్మ ను ఢీ కొట్టి నేపాల్ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేశాడు! ఇప్పుడతని వయసు 35…
నేపాల్ చరిత్రనే తిరగరాసాడు! జెన్ జీ యువ నేతగా రికార్డు సృష్టించాడు! మాధేసి తెగ నుంచి మొట్టమొదటి నేతగా ఎదిగి ఏకంగా ప్రధాని కాబోతున్నాడు! ఒక గాయకుడు నేపాల్ లో సృష్టించిన సరికొత్త చరిత్ర ఇది!
నేను రెండు సార్లు నేపాల్ వెళ్ళాను! ఒకసారి 2019లో! ఎక్కడి చెత్త అక్కడ, ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్లు సరిగా లేకపోవడం చూశాను. భూకంపం వచ్చాక ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పట్టించుకుంటోందని అక్కడున్న మిత్రులు చెప్పారు. మళ్ళీ 2023లో నేపాల్ వెళ్ళాను!
ఖాట్మండ్ నగరంలో వారం రోజులు వున్నాను! మొత్తం రూపు రేఖలు మారిపోయి ఉన్నాయి! రోడ్లు నల్లగా మెరుస్తున్నాయి! ట్రాఫిక్ బొమ్మ గీసినట్లుగా ఎంతో క్రమశిక్షణ! నిరంతరం పోలీసుల నిఘా! రోడ్డు మధ్యలో వుండే వైట్ లైన్ కు అటు ఇటు వాహనాలు ఒక లైన్ లా కదులుతున్నాయి!
ఫుట్ పాత్ లపై ఎంచక్కా నడచుకుని వెళ్లే సౌలభ్యం! ముఖ్యంగా నేపాల్ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే పోఖరాన్లో కుమారి, గణేష్ సంస్కృతిని కళ్ళకు కట్టేలా తీర్చిదిద్దారు. అద్భుతం అనుకున్నాను. మాటల్లో తెలిసింది ఏమిటంటే మార్పుకు కారణం ఒకే ఒక్కడు బాలెన్ షా! అతని పేరు మార్మోగిపోతోంది!
మేయర్ గా ఒక యువకుడు సాధించిన విజయం! గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఖాట్మండ్ ను అందంగా మలిచాడు! ఇంకా నాకు నచ్చింది… బాలీవుడ్ సినిమాలపై బాలెన్ షా నిషేధం విధించడం, జనం అది పాటించడం!
ఆదిపురుష్ లో సీతమ్మ వారు పుట్టింది ఇండియాలో అని చూపించడం అతనికి నచ్చలేదు! నిజానికి సీతమ్మ వారి పుట్టిల్లు నేపాల్! మన ఇండియా భిన్న జాతులు సంస్కృతుల సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వ దేశం! కానీ నేపాల్ అలా కాదు! పక్కా హిందూ దేశం! అక్కడి గుడులు, సంస్కృతి, సంప్రదాయాలు, సంపూర్ణ హిందూత్వం స్పష్టంగా కనిపిస్తుంది.
స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేపాల్ ప్రధాని ఇంటిపై ఉద్యమకారులు చేసిన సామూహిక దాడి వెనుక బాలెన్ షా సహకారం ఉందని అంటుంటారు. కానీ అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ప్రధాని కార్యాలయానికి నిప్పు అంటుకున్నప్పుడు సరైన సమయంలో అగ్నిమాపక యంత్ర వాహనాలు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసాడని బాలెన్ షా పై అప్పట్లో ఆరోపణలు వినిపించాయి!
ఏమైనా మొత్తానికి యువ నాయకుడుగా బాలెన్ షా కేవలం నాలుగేళ్ళ రాజకీయ అనుభవంతో మేయర్ నుంచి పైమెట్టు ఎక్కి ఇప్పుడు ప్రధాని కాబోతున్నారు. ఒక ర్యాప్ గాయకుడికి దక్కిన గౌరవం ఇది! ఒక యువ సంఘసంస్కర్తకు ప్రజలు చేసిన పట్టాభిషేకం ఇది! అతనిది రాజకీయ వారసత్వ కుటుంబం కాదు!
డబ్బున్నోడు కాదు! ప్రధాన పార్టీల అండ లేదు. ఒక ఆయుర్వేద డాక్టర్ కుమారుడు! కేవలం మనసున్నోడు! కళా హృదయం ఉన్నోడు! సమాజంలో మార్పు తీసుకు రావాలనే నమ్మకం ఉన్నోడు! ఇవే అతని బలాలు! అందుకే జెన్ జీ అంతా అతని వెనకే వుంది! – డా. మహ్మద్ రఫీ
Share this Article