.
అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి….. అని తెలంగాణ ముఖ్యమంత్రి అభిలషించాడు… షేక్ హ్యాండ్ ఇచ్చాడు… అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన అత్యాధునిక అల్లు సినిమాస్ మల్టీ స్క్రీన్ కాంప్లెక్స్‌ను కూడా తనే ప్రారంభించాడు…
అదేమిటి..? సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు కదా అల్లు అర్జున్… అల్లు అర్జున్‌ను జైలులో వేశాడు కదా… బెయిల్ కూడా ఇచ్చారు… అసలు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులంతా లైన్లు కట్టి మరీ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి, ఏదో విపత్తు సంభవించినట్టుగా పరామర్శించి, రేవంత్ రెడ్డినే ఉల్టా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కదా… మరిదేమిటి అంటారా..?
Ads
- రాత్ గయీ బాత్ గయీ… ఏదయినా ఝలక్ తగిలితే తప్ప టాలీవుడ్ ఎవరినీ గుర్తించదు కదా… టాలీవుడ్ పెద్ద తలకాయలకు అప్పట్లో ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు… అంతే, ఇంకెవరినీ గుర్తించవు… అందుకే జగన్ కూడా వాతలు పెట్టి, దారికి తెచ్చుకుంది…
ఫ్యాన్స్ వీరావేషాలు, కళ్లెదుట కోట్లకుకోట్ల డబ్బులు, అడుగుతీసి అడుగేస్తే వైభోగం… అసాధారణ పాత్రలు వేసీ వేసీ… మేం కూడా అసాధారణ మనుషులమే, నడిచే దేవుళ్లం అన్నట్టుగా మబ్బుల్లో తిరిగే చాలామందిని రాజకీయాధికారం నేల మీదకు దింపింది… దింపుతుంది… తగిలే కొరడా దెబ్బను బట్టి ఉంటుంది… జైలులో వేసిన మనిషినే ‘నువ్వు హాలీవుడ్‌లో కూడా రాణించాలి బ్రదర్’ అని ఆకాంక్షిస్తుంది వేదిక మీద..!!
- అల్లు సినిమాస్ ప్రారంభ వేదిక మీద అల్లు అర్జున్ ఏం మాట్లాడతారా అని ఆసక్తిగా చూశారు అందరూ… గతంలో ఓ వేదిక మీద రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయి, కనీసం అక్కడే ఆ పొరపాటును సరిదిద్దుకోకుండా, ఓ పిచ్చి నవ్వు నవ్వితేనే కదా… రేవంత్ రెడ్డి కొరడా పట్టుకుంది… అందుకే ఇప్పుడెలా సంబోధిస్తాడా అని చూశారు… గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడమే కాదు, ముందే బాగా ప్రిపేరయి, ఉపముఖ్యమంత్రి భట్టిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అడ్రెస్ చేశాడు…
సినిమా పెద్దలందరికీ హైదరాబాదులో ఇప్పుడు పెద్ద పెద్ద థియేటర్లు… ఇంకా కడుతూనే ఉన్నారు… హైదరాబాద్ వదిలేసి, ఆంధ్రాకు వెళ్తుంది టాలీవుడ్ అనేది ఓ భ్రమ… ఓ శుష్క స్వప్నం… ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు, అత్యాధునిక ల్యాబులకు బాలీవుడ్ పెద్ద తలలే సిద్ధపడుతున్నాయి… నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ప్రారంభిస్తూ… ‘హాలీవుడ్‌నే రప్పిద్దాం’ అన్నాడు సీఎం… సంకల్పానికి దరిద్రం దేనికి..? అలా హైదరాబాద్ వినోదరంగంలో దూసుకుపోతూనే ఉంది…
- బెనిఫిట్ షోలు రద్దు, ప్రిరిలీజ్ ఫంక్షన్లు రద్దు, టికెట్ రేట్ల పెంపు రద్దు… నిజంగా ఆహ్వానించదగిన ఈ నిర్ణయాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి… రేవంత్ రెడ్డి మడమ తిప్పాడు, మాట తప్పాడు… అన్నీ మళ్లీ స్టార్ట్… చివరకు హైకోర్టు టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తున్నా సరే, మొన్న ఏదో చిరంజీవి సినిమాకు రహస్యంగా, ఐదారు రోజుల ముందే జీవో ఇచ్చేశాడు…
అంతెందుకు… ఉస్తాద్ భగత్ సింగ్ అని పవన్ కల్యాణ్ సినిమా ఏదో వస్తుంది కదా… దాని ప్రిరిలీజ్ ఫంక్షన్‌కూ సై అనేశారట… మరి దిల్ రాజు ఉన్నది దేనికి..? ఇవి చక్కబెట్టడానికే కదా…! సో, రాజకీయాధికారమే అల్టిమేట్… దాని ముందు సినిమా వ్యాపారం జుజూబీ… మబ్బుల్లో తిరిగే తాత్కాలిక, కృత్రిమ వైభోగాలు, అట్టహాసాలు దిగివస్తాయి, దారికొస్తాయి, సంధి చేసుకుంటాయి… అల్లు సినిమాస్ కథ చెప్పేది ఇదే నీతి…
- అన్నట్టు అల్లు సినిమాస్‌లో ఒక స్క్రీన్ 70 అడుగుల లార్జ్ ఫార్మాట్ అట… డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియో, 4 కే ప్రొజెక్షన్ అనేవి హైలీ అల్ట్రా మోడరన్ టెక్నికల్ స్టాండర్డ్స్… ఆసియాలోకెల్లా అతి పెద్ద తెర అంటున్నారు… 50 అడుగుల ఏదో స్క్రీన్ (ముంబై)లో దురందర్ -2 సినిమాకు 3100 రూపాయల రేటు పెట్టారట… అల్లు సినిమాస్ (ఒక స్క్రీన్) అల్ట్రా లగ్జరీ కేటగిరీ కాబట్టి ఇక రేట్లు ఏమేరకు ఖరారు చేయబోతున్నారో… అంతా ఏలినవారి దయ మరి..!!
అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని..! మహేశ్ బాబూ వింటున్నావా...?
Share this Article