.
బహుశా పవన్ కల్యాణ్ వీరాభిమానులు మాత్రం కాస్త అక్కడక్కడా ఎంజాయ్ చేస్తారేమో… పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగిన సినిమాగా మాత్రం దీన్ని రూపొందించలేకపోయాడు దర్శకుడు హరీష్ శంకర్… ఇంటర్వ్యూల్లో, ప్రిరిలీజు ఫంక్షన్లలో దంచి కొట్టాడు సినిమా గురించి, కానీ ఆ మేరకు సినిమాపై కాన్సంట్రేట్ చేస్తే బాగుండేది…
ఒకవైపు దురందర్ వంటి న్యూజనరేషన్ కల్ట్ సినిమా థియేటర్లను ఊపేస్తోంది… సినిమాలకు ఓ కొత్త దిశను చూపిస్తోంది… దానికి పోటీగా రిలీజు చేయడమే ప్రథమ పొరపాటు… పైగా ఏముంది..? సగటు తెలుగు స్టార్ హీరో రొటీన్ ఇమేజ్ బిల్డప్పులు, ఎడాపెడా ఎలివేషన్లు, కాస్త కామెడీ, నాలుగు ఫైట్లు, కాస్త సరసం… అంతే కదా… హరీష్ శంకర్ కొత్తగా చేసిందేముంది..?
Ads
సారీ, పవన్ కల్యాణ్, హరీష్ శంకర్‌ను మరీ అంత నమ్మకుండా ఉండాల్సింది… డీఎస్పీ, థమన్ ప్రిరిలీజుకు రాలేదంటేనే ఎక్కడో తేడా కొట్టిందని అర్థం కాలేదా..? అదే గబ్బర్ సింగ్ కాలం నుంచి హరీష్ శంకర్ ఇంకా బయటికి రాలేకపోయాడు అని షూటింగు టైములోనైనా అర్థమై ఉండాలి కదా…
చంద్రశేఖర్ రావు (KS రవికుమార్) ఒక టీచర్‌గా ప్రారంభమై తర్వాత సీఎం అవుతాడు… తన టీచింగ్ రోజులలో ఓ అనాథ బాలుడికి గార్డియన్‌గా మారి అతడిని “ఉస్తాద్ భగత్ సింగ్” (పవన్ కళ్యాణ్)గా పెంచుతాడు… సీఎం మీద దాడి జరిగినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి? నల్ల నాగప్ప ఎవరు? ఉస్తాద్ జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ సంక్షోభాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొంటాడు? ఇదే సినిమా ప్రధాన కథ… ఏదో ఓ రొటీన్ కథ… మరి ట్రీట్‌మెంటైనా కొత్తగా ఉందా..?
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫామ్‌లో కనిపిస్తాడు… తన స్టైల్‌తో అలవోకగా ఈ సినిమాను మోశాడు… చాలా రోజుల తర్వాత ఆయన కామెడీ కూడా కనిపిస్తుంది… ఫైట్స్ కూడా తనదైన బాడీ లాంగ్వేజ్‌తో బాగానే అనిపించాయి… ఇది మరో గబ్బర్ సింగ్ స్థాయి కాదు, పవన్ కల్యాణ్ ఉన్నాడు కాబట్టి చాలా లోపాలు కవరైపోయాయి…
హమ్మయ్య, శ్రీలీలను ఇందులో కూడా నాలుగు పిచ్చి స్టెప్పులకు వాడుకుని వదిలేస్తారేమో అనుకుంటే… పర్లేదు, హీరోపై ప్రేమలో పడే బబ్లీగరల్ పాత్ర… ఈజీగా చేసేసింది… అదేమీ తనకు పరీక్ష పెట్టే పాత్రేమీ కాదు… రాశిఖన్నా ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కనిపించినా, తరువాత మాయం అయిపోయింది ఏమిటో మరి..? ఆమె వినోదం ట్రాక్ కూడా వర్కవుట్ కాలేదు…
హరీష్ శంకర్ ఈ సినిమాకు రచయిత, దర్శకుడు… పవన్ కళ్యాణ్‌తో ఇది ఆయన రెండో సినిమా… మొదటిది గబ్బర్ సింగ్—బ్లాక్‌బస్టర్… కానీ ఆ సినిమాతో పోలిస్తే ఇది తీసికట్టు… రచనపరంగా, దర్శకత్వం పరంగా… పవన్ కల్యాణ్ కొన్నాళ్లుగా సనాతన్ పాత్రలో ఉన్నాడు కదా రాజకీయంగా కూడా… సో, పాత గబ్బర్ సింగ్‌కు ఇది ఓ సనాతన సీక్వెల్ అన్నట్టుగా సాగింది…
పలుచోట్ల సినిమాలో గబ్బర్ సింగ్ పోలికలు కనిపిస్తాయి… కానీ ఈ భగత్ సింగ్ కాస్త తెలివిగా పలు అంశాలపై కామెడీతో జ్ఞానబోధ చేయడానికి ప్రయత్నిస్తాడు… ప్రేమ, లైఫ్, మతం, దేశభక్తి, బంధాలు, నిరాశ ఇలా బోలెడు అంశాలపై ఉపన్యాసాలు… ముందే చెప్పినట్టు హరీష్ శంకర్ గతంలోనే ఇరుక్కుపోయిన ప్రయోగాలు ఎందుకులే అనుకుని, సీన్లను పాత పద్ధతిలోనే రాసుకున్నాడు, అలాగే తీశాడు… ఔట్ డేటెడ్…
ఏదో మిడ్ రేంజ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలు తమ సినిమాల్లో పాత స్పూఫులు పెట్టుకున్నారంటే ఏమైనా సమర్థించొచ్చు… కానీ టాప్ రేంజ్ స్టార్లు కూడా అవే పాత మేనరిజమ్స్, ఏవో పాత సినిమాల పాటలు, స్పూఫుల మీద ఆధారపడి సినిమాను వదలడం ఏమిటి అనే భావన తటస్థ ప్రేక్షకుడిని వేధిస్తూనే ఉంటుంది సినిమా చివరి దాకా…
మొత్తానికి ఇది హరీష్ శంకర్ నుంచి వచ్చిన రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్… హీరోపై ఫోకస్ ఉండడం వల్ల కాస్త బెటర్… దీంతో ఇది పూర్తిగా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అయిపోయింది… ఏదో కులం పేరు చెప్పి విమర్శల పాలై తరువాత సారీ చెప్పిన పార్తీబన్ విలనీ ప్రభావవంతంగా ఏమీలేదు… జస్ట్, సో సో… గౌతమి పాత్ర అండర్ యుటిలైజేషన్…
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆశించినంత స్థాయిలో లేదు… థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ట్రెండీ లౌడ్ టెక్నో స్టైల్… జస్ట్, ఓకే… సారీ, పవన్, ఇది నీ లెవల్‌కు సరిపోయేలా మాత్రం లేదు..!! అవునూ, హరీష్ శంకర్‌కు చిరంజీవి తదుపరి సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ప్రమాదంలో పడ్డట్టేనా..?!

Share this Article