.
Mohammed Rafee ….. ఆ కుర్చీని మడతబెట్టి….
ఫేమస్ అయిన లారీ డ్రైవర్!
– గుంటూరు కారం సినిమాతో పేరు తారుమారు
ఆయన తాగుడు తందనాలు చూసి భార్య ఆసియా పుట్టింటికి వెళ్ళిపోయింది! ఆ విషయం తెలిసి ఆయన రెండు బీర్లు తాగి, ఇంకో బీరు బొడ్లో పెట్టుకుని బ్లేడ్ తీసుకుని నేరుగా అత్తారింటికి వెళ్లి తలుపు తట్టాడు గట్టిగా! ఆరోజు అటో ఇటో తేలిపోవాలని నిర్ణయించుకున్నాడు! అందుకే ఆ మొండి ధైర్యం! మరదలు తలుపు తీసింది. మడత బెట్టే కుర్చీ ఓపెన్ చేసి వేసి కూర్చోమన్నది! భార్య ఆసియా వచ్చింది, పద ఇంటికి అన్నాడు!
Ads
ఇంతలో గడ్డపార తీసుకుని బామ్మర్ది కొట్టడానికి వచ్చాడు! అంతే, ఈయన ఆ కుర్చీని మడతబెట్టి కొట్టిన కొట్టుడుకి ఆ బామ్మర్ది గోడకు కొట్టుకుని కింద పడ్డాడు! ఆసియా భయపడి మళ్ళీ బ్యాగుతో “చలో” అని ఆయన వెనుక నడిచింది! ఇది కుర్చీ తాత మహమ్మద్ పాషా స్వయంగా నాతో చెప్పిన కథనం!
గుంటూరు కారం సినిమా ప్రి రిలీజ్ కు ముందే “ఆ కుర్చీని మడత బెట్టి” అనే పాట మోత మోగిపోయింది! ఏ క్యాబ్ లో చూసినా అదే పాట! ఏ సెలూన్ లో విన్నా అదే పాట అప్పట్లో! మహేష్ బాబుకు గొప్ప పాట ఇచ్చాడు తమన్ అనుకున్నాం! ఆ తరువాత తెలిసింది ఆ పాటకు మూలం కుర్చీ తాత మహమ్మద్ పాషా! ఆ కుర్చీని మడతబెట్టి అంటూ ఆయన నాలుక వెనక్కి గుండ్రంగా తిప్పి చెప్పే విధానం రాత్రికి రాత్రి వైరల్ అయిపోయింది! ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు! అప్పట్లో ఓ పది వేలు తమన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి! అది నిజమో కాదో తెలియదు!
తాగి తాగి అలసిపోయి వడదెబ్బ కొట్టి రెహమత్ నగర్ లోని అద్దె ఇంట్లో తన భార్య ఆసియా ఒడిలో తల పెట్టి పడుకుని, ఆమె చేతులను తీసుకుని మొహానికి అద్దుకుని మంగళవారం కనుమూశాడు! ఆయన చనిపోయాక ఒక ఛానెల్ తో భార్య ఆసియా మాట్లాడుతూ ఇదే విషయం వెల్లడించారు. కుర్చీ తాతకు కూలర్లు ఏసీలు గిట్టవు! అందుకే ఆయన ఎక్కువగా దగ్గరలో ఉన్న కృష్ణకాంత్ పార్క్ లోనే గడుపుతారు. పగలంతా అక్కడే గడుపుతారు. రాత్రిళ్ళు యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ దగ్గర పడుకుంటారు! మనవళ్ళు గుర్తొచ్చినప్పుడు లేదా స్నానానికి మాత్రమే ఇంటికి వెళ్లే వాడు! ఏదొక చిన్న ట్రక్ డ్రైవర్ గా చేస్తూ నెలకు 16 వేలు సంపాదించే వాడు!
తరువాత కొన్నాళ్ళు కూరగాయలు అమ్మాడు! సోషల్ మీడియా ఇన్-ఫ్లూయెన్సర్ అయ్యాక అది వదిలేసాడు! యూ ట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తే 200, సినిమా షూటింగ్ అయితే 1200 రోజుకు! ఇదే ఆయన సంపాదన! ఇష్టం ఉంటే పనికి వెళ్ళేవాడు! లేదంటే కృష్ణకాంత్ పార్క్ ఆయన అడ్డాగా మార్చుకున్నాడు!
వయసులో వున్నప్పుడు ఆయన లారీ డ్రైవర్! వరంగల్ జిల్లా కరీమాబాద్ ఆయన సొంతూరు! కాజీపేట్ శివనగర్ లో వుండే వాడు! లారీ డ్యూటీ లేనప్పుడు హనుమకొండలో ఓ గుడి అతని అడ్డా! అక్కడ నుంచి ఆసియాకు దూరం నుంచి లైన్ వేయడమే ఆయన పని! అప్పట్లో ఆసియా టైలర్! అలా వెంటపడి ప్రేమించి వేధించి ఆసియాను వివాహం చేసుకున్నాడు!
ముగ్గురు అబ్బాయిలు, ఒకమ్మాయి సంతానం! పెద్దబ్బాయి మేడ్చల్ లో పూల వ్యాపారం. మిగిలిన ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేసే వారు! సంవత్సరం క్రితం చిన్న కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు! ముగ్గురూ మద్యం షాపులకు ఆదాయం ఇస్తారు! తల్లిదండ్రులను పట్టించుకోరు. అందుకే ఆ ఒక్క కుమార్తె ఇన్నాళ్లు కుర్చీ తాతను చూసుకుంది!
కుర్చీ తాత షార్ట్ టెంపర్! నోటి దూల! చదువులేదు! యూ ట్యూబర్లు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడే వాడు! కెసిఆర్ ను తిట్టే వాడు! రేవంత్ రెడ్డిని పొగిడే వాడు! ఈమధ్య సీన్ రివర్స్ అయ్యింది! కెసిఆరే మళ్ళీ రావాలనడం మొదలుపెట్టాడు! కుర్చీ తాతను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు! రెండు కోట్ల మంది ఫాలోవర్స్ వున్నారు ఆయనకు!
ఒక్కొక్కరు తమాషా చూడకుండా ఒక్క రూపాయి ఇచ్చినా తనకు సొంత ఇంటితో పాటు తన కుటుంబం బాగుపడుతుందని అంటుండే వారు! పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇంటికి తాను అర్హుడ్ని కాదా అని ప్రశ్నిస్తుండే వారు! ఆయన చనిపోయినప్పుడు అన్ని పత్రికలు ఫోటో వేసి ప్రచురించాయి. బిక్షాటన చేస్తూ చనిపోయాడని దారుణంగా రాశాయి!
నిజానికి ఆయనకు మొహమాటం, నవాబు దర్పం ఎక్కువ! మొదట్లో ఎవ్వడిని అడగలేదు, చెయ్యి చాచలేదు! ఈమధ్య కాలంలో 90 ml కోసం ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా అడగడం, ఎవరైనా సెల్ఫీ అడిగితే చాయ్ పైసలు అడగడం మొదలుపెట్టాడు!
మన మీడియాకు సెలబ్రిటీలను ముందస్తుగా చంపేయడం అలవాటే! కొన్నాళ్ళ క్రితం కుర్చీ తాత చనిపోయాడని వార్తలు బ్లాస్ట్ చేశారు! ఆ వార్తలు చూసి నిజమే అనుకుని అమ్మా కూతురు తెగ ఏడ్చి ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీలు వెతికారు. కానీ, తెలుగు వ్యాన్ వాలా వెబ్ సైట్ వాళ్ళు బాపట్ల బీచ్ కు తీసుకెళ్లి ఆయన ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.
ఇంట్లో చెప్పకుండా ఈయన వెళ్ళడంతో వాళ్ళు నిజమేనని ఆందోళన చెందారు. ఆ వార్త తెలిసిన కుర్చీ తాత బీచ్ ఒడ్డున కూర్చుని “నేను బతికే వున్నా” అని చెప్పుకోవాల్సి వచ్చింది. చాలామంది తమ వ్యూయర్ షిప్స్ పెంచుకోవడానికి కుర్చీ తాతను బాగా వాడుకున్నారు. క్వార్టర్ బాటిల్, టైంకు ఫుడ్ ఇస్తే చాలన్నట్లుగా ఆయన వ్యవహరించాడు. “అయనతో కలసి బయటకు వెళ్లాలంటే చిరాకు వేస్తుంది. అందరూ ఫోటోలు దిగుతారు. మా పని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఒంటరిగా వెళ్లడం అలవాటు చేసుకున్న” అని ఆయన భార్య ఆసియా చెప్పారు.
వైజాగ్ సత్యను మెచ్చుకోవాలి. కులం మతం చూడకుండా కుర్చీ తాతను చివరి వరకు అంటిపెట్టుకునే వున్నాడు! ఈవెంట్స్ కు తీసుకెళ్లి ఎంతో కొంత ఖర్చులకు ఇస్తుండే వారు! ఆసియాకు కూడా కొంత ఆర్ధిక సహకారం చేసేవారు. చనిపోయినప్పుడు కూడా దగ్గరుండి అందరికి సమాచారం ఇచ్చి ముస్లిం సంప్రదాయం ప్రకారం దర్జాగా సాగనంపడంలో వైజాగ్ సత్య తోడుగా నిలిచారు.
“పరేషాన్ బాయ్స్” ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ వచ్చి ఖర్చులకు అంటూ ఆసియా చేతిలో 30 వేలు పెట్టారు. ఇంకా బషీర్, ఉప్పల బాలు, లోకల్ పిల్ల, స్వాతి నాయుడు వారి గ్రూప్ అంత్యక్రియల ఖర్చులు భరించినట్లు తెలిసింది. దివ్వెల మాధురి కూడా ఆసియాకు కొంత ఆర్ధిక సహకారం అందించారు.
మొత్తానికి సోషల్ మీడియా వచ్చాక ఊహకు అందని వారిని సైతం స్టార్స్ ను చేసి నిలబెడుతోంది! సోషల్ ఇన్-ఫ్లూయర్స్ ను చేస్తుంది. అభిమానులను అందిస్తుంది. ఫాలోవర్స్ ను పెంచుతుంది. సెలబ్రిటీలుగా మారుస్తుంది! చదువులేని ఒక లారీ డ్రైవర్ మహమ్మద్ పాషా ఇంత సంచలనం సృష్టిస్తారని ఎవరైనా ఊహించారా? ఊహకు అందని సక్సెస్ అది!
పెద్దగా సంపాదించలేక పోవచ్చు! పూట గడవక పోవచ్చు! కానీ, 64 ఏళ్ల వయసులోనూ ఆయనొక పెను సంచలనం అయ్యాడు! ఒక సంచలన సినిమా పాటకు సృష్టికర్త అయ్యాడు! గుంటూరు కారం “ఆ కుర్చీని మడతబెట్టి” పాట వున్నంత కాలం, వినిపించినంత కాలం కుర్చీ తాతను మరవదు ఈ తెలంగాణ గడ్డ!
– డా. మహ్మద్ రఫీ
Share this Article