Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాత్రి 10… సీఎం హఠాత్తుగా మాయం… ఒక్కడే కారులో ఎటో వెళ్లిపోయాడు…

March 21, 2026 by M S R

.

Bhavanarayana Thota …. వైరముత్తుకు జ్ఞానపీఠ మీద వాదోపవాదాలు… తమిళంలో ఇప్పటివరకూ ముగ్గురికి జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. వాళ్ళలో మొదటి ఇద్దరూ రచయితలు. కానీ వైరముత్తు నవలలు, వ్యాసాలు కూడారాసినా ప్రధానంగా కవిగానే గుర్తింపు తెచ్చుకున్నారు.

24 ఏళ్ల తరువాత తమిళనాడుకు ఈ పురస్కారం దక్కిన వేళ ఆ రాష్ట్రంలో అభినందనలతోబాటు కొన్ని విమర్శలు కూడా తప్పలేదు. కవిగా ఆయన ప్రతిభను మెచ్చుకోవాలని కొంతమంది, వ్యక్తిగతంగా ఆయన దిగజారారంటూ ఇంకొంతమంది చర్చోపచర్చలు చేస్తూనే ఉన్నారు.

Ads

ఈ సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వైరముత్తు అంటే కరుణానిధికి చాలా ఇష్టం. నాస్తికుడు కావటం, పెరియార్ బాటలో నడవటం, కవిత్వంలో మెరుపులు కరుణానిధిని బాగా ఆకట్టుకున్నాయి. స్వయంగా కవి, రచయిత అయిన కరుణానిధిని మెప్పించగలగటంలో వైరముత్తు ప్రతిభను ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ మధ్య స్నేహానికి సంబంధించి నాకు తెలిసిన రెండు ఉదాహరణలు చెప్పాలి.

కరుణానిధి, ఎమ్జీఆర్ మధ్య స్నేహాన్ని, ఆ తరువాత వచ్చిన వైరాన్ని చిత్రిస్తూ మణిరత్నం ‘ఇరువర్’ అనే సినిమా తీశాడు ( ఇద్దరు పేరుతో మురళీ మోహన్ ఈ సినిమా తెలుగులో డబ్ చేసి నష్టపోయారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్, ఎమ్జీఆర్ పాత్రలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు.

  • ఈ సినిమాకు మాటలు రాసింది ఆయన భార్య, నటి సుహాసిని. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్, ఎమ్జీఆర్ పాత్రలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. అయితే, ఈ రెండు పాత్రల మధ్య బలమైన సంభాషణలు ఉండాల్సిన చోట వైరముత్తుతో రాయించమని కరుణానిధి సలహా ఇచ్చారు. మణిరత్నం పాటించారు కూడా.

దేహం మట్టికి, ప్రాణం తమిళానికి ( ఉడల్ మణ్ణుక్కు, ఉయిర్ తమిళుక్కు) అంటూ భాష మీద ప్రేమ చాటినా, నేను మాట్లాడేది నా స్వరం కాదు. ప్రజల స్వరం (నాన్ పేశువదు ఎన్ కురల్ ఇల్ల, మక్కళ్ కురల్) అంటూ ఒక ప్రజాప్రతినిధి నాయకత్వ లక్షణాన్ని చెప్పినా, రాజకీయాలంటే నాటకం కాదు, అది జీవితం (అరశియల్ ఒరు నాడకమ్ ఇల్ల ,, అదు వాళ్క్కై) అంటూ రాజకీయాల సీరియస్ నెస్ గురించి మాట్లాడించినా.. ‘నటుడు వేదిక మీద జీవిస్తాడు, రాజకీయ నాయకుడు ప్రజల మనసుల్లో జీవించాలి’ (నడిగన్ మేడైయిల్ వాళ్గిరాన్ .. అరశియల్ వాది మక్కళిన్ ఉళ్ళత్తివాళ వేండుమ్) అంటూ సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని పోల్చినా, “నిజమైన స్నేహితుడంటే ఏంటి? ప్రత్యర్థిగా మారనివాడే?” అంటూ స్నేహాన్ని నిర్వచించినా అది వైరముత్తుకే చెల్లింది.

(నిజానికి ఈ సినిమా ప్రివ్యూ కరుణానిధి కోసమే వేసినప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన చెప్పినట్టు కొన్ని సీన్లు తీసేశారు. కూడా. నేను కూడా ప్రివ్యూ, ఆ తరువాత రిలీజైన చూశాను కాబట్టి ఏవి కట్ చేశారో తెలిసింది. అందుకే ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యే రోజు ఏయే సీన్లు తీసేశారో ‘వార్త’లో రాశాను. కరుణానిధి కొన్ని డైలాగ్స్ వైరముత్తుతో తన పాత్రను కొంత ఎలివేట్ చేసుకున్నారు. నటనతో ప్రకాశ్ రాజ్ కూడా ఎలివేట్ చేశారు).

వైరముత్తుతో కరుణానిధి స్నేహబంధానికి మరో ఉదాహరణ కూడా చెప్పాలి. ఇది పాతికేళ్లనాటి సంఘటన. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకరోజు రాత్రి 10 దాటాక మాయమయ్యారు. ప్రైవేటు వాహనంలో వెళ్ళారు. వెంట ఉండాల్సిన సెక్యూరిటీ వాళ్ళను వదిలేసి మరీ వెళ్లారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి.

ఒకవైపు ఆయన కనబడటం లేదన్న ఆతృత, ఇంకో వైపు ప్రతిపక్షానికి తెలిస్తే ఇంటలిజెన్స్ వైఫల్యమంటూ నానా యాగీ చేస్తారన్న భయం. ఈ వార్త బైటికి పొక్కకుండా జాగ్రత్త పడుతూనే ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. కానీ ఫలించలేదు. తెల్లవారుజామున నాలుగ్గంటలకు ఆయనంతట ఆయనే వచ్చారు. కానీ ఎక్కడికి వెళ్లారన్నది మాత్రం బైటికి రాలేదు. ఇంటలిజెన్స్ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు.

డీఎంకే పార్టీ పత్రిక ‘మురసొలి’లో ఆ మరుసటి రోజు వచ్చిన ఫుల్ పేజ్ వ్యాసం చదివాక గాని అసలు విషయం అర్థం కాలేదు. ఆరోజు రాత్రి ముఖ్యమంత్రి బాధ్యతలన్నీ పక్కనబెట్టి మహాబలిపురం రోడ్డులో సముద్ర తీరంలో ఇసుకలో కూర్చొని ఐదారు గంటలపాటు ఇద్దరూ సాహిత్య చర్చ సాగించారు. ఆ వివరాలన్నీ కరుణానిధి తనదైన శైలిలో అద్భుతంగా రాశారు. చాలా పత్రికలు ఆ సుదీర్ఘ వ్యాసాన్ని ‘మురసొలి’ నుంచి తీసుకొని ప్రచురించాయి. పనిలో పనిగా ‘అర్థరాత్రి అదృశ్యమైన ముఖ్యమంత్రి – కవి వైరముత్తుతో ఏకాంత చర్చలు’ లాంటి శీర్షికలు పెట్టాయి.

  • అయితే, వైరముత్తు చాలా వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. కమల్ హాసన్, మనీషా కోయిరాలా నటించిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమాలో ఆయన రాసిన “టెలిఫోన్ మణిపోల్ సిరిప్పవళ్ ఇవళా .. “ అనే పాట మీద ‘కవియరసు కణ్ణదాసన్’ కూతురు విశాలి కణ్ణదాసన్ అభ్యంతరం లేవనెత్తారు. ఒక యువతిని లేటెస్ట్ సెల్ ఫోన్ తో పోల్చటం, జాకీర్ హుస్సేన్ తబలాతో పోల్చటం ఏంటని కాస్త ఘాటుగానే తిట్టారు. మహిళా సంఘాలు కూడా గొంతెత్తాయి.

ఈ మధ్య కాలంలో ‘మీ టూ’ఉద్యమంలోనూ వైరముత్తు మీద ఆరోపణలు వచ్చాయి. గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణల మీద పెద్ద చర్చే జరిగింది. కొంతమంది ఆయన అలాంటివాడు కాదని సమర్థించారు. ఆ సంగతలా ఉంచితే ఐదారు నెలల కిందట ఇంకో సంఘటన జరిగింది.

కంబ రామాయణం రాసిన ప్రాచీన కవి కంబర్ పేరు మీద ఇచ్చే అవార్డు తీసుకునే కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. కంబ రామాయణం లో వాలి మాట్లాడే మాటను ఉటంకిస్తూ “రాముడికి బుర్ర చెడింది” అని వ్యాఖ్యానించటం పెనుదుమారం రేపింది. సీత కనబడకుండా పోయిన బాధలో రాముడికి మతి చెడటాన్ని అర్థం చేసుకోగలం” అనటం మీద బీజేపీ తీవ్రగా స్పందించింది. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆయన మీద విరుచుకుపడ్డాయి.

ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించటంతో తమిళనాట మళ్ళీ ఈ విషయాలన్నీటిమీదా చర్చ మొదలైంది. ఒక వ్యక్తి ప్రతిభను మాత్రమే చూడాలా? అతడి వ్యక్తిగత జీవితాన్ని, ప్రవర్తనను కూడా చూడాలా అనే ప్రశ్న లేవనెట్టారు. కలిపే చూడాలని కొంతమంది, వేరువేరుగా చూడాలని ఇంకొంతమంది వాదిస్తున్నారు. ఇంకో నెలలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా ఈలోపు ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఈ విషయం మీద నోరు మెదపకూడదని డీఎంకే నిర్ణయించుకుంది.  – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాత్రి 10… సీఎం హఠాత్తుగా మాయం… ఒక్కడే కారులో ఎటో వెళ్లిపోయాడు…
  • మణిరత్నం పిలుపు ఓ అవకాశం మాత్రమే కాదు… ఓ గౌరవం, ఓ గుర్తింపు..!!
  • చిరంజీవి వ్యాఖ్యలపై ఇంత వ్యతిరేకతకు కారణాలేమిటి..?!
  • కొత్త సీసాలో పాత సారా..? కాదు.., కొత్త సీసా, కొత్త సారా, కొత్త రంగు కూడా..!!
  • ఇటు గరికపాటి రచ్చ… అటు భట్టి కొత్త ఆహార ప్రకటన… భలే కంట్రాస్టు…
  • హేపీనెస్ ఇండెక్స్..! ‘హేపీగా’ పగలబడి నవ్వుకునే ఓ వరల్డ్ రేంజ్ జోక్..!
  • ఇరాన్ దెబ్బ… ఇంత బతుకూ బతికి… F35 జెట్ చావు దప్పి కన్నులొట్ట…
  • మై డియర్ గరికపాటి… నీ ప్రాపంచిక జ్ఞానం ఏపాటి..? వుయ్ పిటీ…!!
  • నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా… నిశ్శబ్దంగా అయోధ్యలో ఓ ప్రధాన ఘట్టం…
  • పది దేశాలకు అంటుకున్న చమురు మంటలు… What Next ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions