.
నిజం… మణిరత్నం సినిమాలో అవకాశం అంటే అది కేవలం ఓ అవకాశం మాత్రమే కాదు, ఓ గౌరవం, ఓ గుర్తింపు… సాయిపల్లవికి దక్కింది ఇప్పుడు… మణిరత్నం ప్రకటించిన కొత్త సినిమాలో ఆమె కథానాయిక…
చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్నదే, కానీ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా తీస్తున్నట్టుగా ప్రకటన వెలువడింది, కాబట్టి అధికారికం… ఇందులో విజయ్ సేతుపతి హీరో… ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం మరో అదనపు ఆకర్షణ… ఇంట్రస్టింగు…
Ads
ఎందుకు మణిరత్నం పిలుపు ఓ గౌరవం అంటున్నానంటే..? నటనలో మెరిట్ ఉన్నవాళ్లనే ఎంచుకుంటాడు, తన పాత్రలకు తగ్గట్టు నటన రాబడతాడు… కథాకథనాలు, ట్రీట్‌మెంటులో తనది భిన్నమైన శైలి… అలా తన సినిమా చాన్స్ ఏ యాక్టర్‌కైనా ఓ గుర్తింపే…
ఈమధ్య ప్రతి భిన్నమైన స్టోరీ లైన్ వార్తల్లోకి వస్తున్నా వెంటనే సాయిపల్లవి పేరు వినిపిస్తోంది ఆ పాత్రకు… బలగం వేణు ఎల్లమ్మ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఆమే… కానీ కుదరలేదు… తరువాత ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ వార్తల్లోకి వచ్చింది, దానికీ ఫస్ట్ పేరు సాయిపల్లవే… బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్ వార్తల్లోకి వచ్చినప్పుడూ సాయిపల్లవి పేరే…
ఎలాగూ ప్రిస్టేజియస్, బిగ్ పిక్చర్ రామాయణం చేస్తూనే ఉంది… త్వరలో ఓ బాలీవుడ్ సినిమా రిలీజ్ కాబోతోంది… సో, ఆమె బాలీవుడ్ మీదే కాన్సంట్రేట్ చేస్తూ, సౌత్ సినిమాలకు దూరం జరుగుతుందనే వార్తల నడుమ… ఓ తమిళ సినిమా చేస్తుండటం విశేషమే… అఫ్‌కోర్స్, ఆమె బిజీ షెడ్యూళ్ల నడుమ మణిరత్నంకు ఎన్ని కాల్‌షీట్లు ఇస్తుందో చూడాలి…
అయితే… ఇది లవ్ రొమాంటిక్ యాక్షన్ సినిమా అంటున్నారు… లవ్, ఎమెషన్స్ చిత్రీకరించడంలో మణిరత్నం ఒకప్పుడు అందెవేసిన చేయి… తరువాత ఎందుకో అందులో వెనుకబడ్డాడు… ఇవే కాదు, చాన్నాళ్లుగా తను హైలైట్ అయిన సినిమా రాలేదు… పొన్నియన్ సెల్వన్ తరువాత, దానికి ముందు పెద్ద హిట్లు లేవు తనకు…
ఆ పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కూడా తమిళంలో కాస్త నడిచాయి, వాళ్ల సంస్కృతి, వాళ్ల చరిత్రకు సంబంధించిన కథ కాబట్టి… అంతేతప్ప ఇతర భాషల్లో ఫ్లాప్, అసలు ఆ కథ, ఆ పాత్రలు ఎవరికీ అర్థం కాలేదు వేరే భాషల్లో… మణిరత్నంకు తెలుగులో వీరాభిమానులున్నారు… ఐనా నో యూజ్… ఆయన భార్య సుహాసిని తెలుగువారికి బాగా తెలిసిన నటి కాబట్టి, ఆమెను ఈ సినిమా ప్రచారానికి తీసుకొచ్చారు, ఫలితం లేదు…
కానీ విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంట అనేసరికి కాస్త ఆడ్‌గా అనిపిస్తుంది ఎందుకో… సరే, ఆ కథేమిటో, ఆ పాత్రలేమిటో, వాటిని మణిరత్నం ఎలా మలుస్తాడో చెప్పలేం కాబట్టి ఇప్పుడో ఆ జంటను ఓ రొటీన్ లవ్ పెయిర్‌గా కంక్లూజన్‌కు రాలేం… ఐనా ఆమధ్య త్రిషతో 96 సినిమాను రక్తికట్టించాడు కదా…
నిజంగానే లవ్, రొమాన్స్, ఎమోషన్ ఉన్న కథతో… ఈ ఇద్దరు ప్రధాన నటీనటులతో ఓ పాత మణిరత్నం కనిపిస్తే అంతకన్నా కావల్సిందేముంది..?
Share this Article