.
సాధారణంగా చిరంజీవి ఇంటర్వ్యూల్లో గానీ, బహిరంగ వేదికలపై గానీ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడతాడు… వాడే భాష కూడా పదునుగా లేకుండా, పరుషంగా ఉండకుండా, సరైన పదాల్ని వాడతాడు… కానీ గద్దర్ ఫిలిమ్ అవార్డుల ఫంక్షన్లో అనుకోకుండా నోరు జారాడా..? ఉద్దేశపూర్వకంగానే సూచనల పేరిట కూటమి సర్కారుపై వ్యాఖ్యలు చేశాడా..?
చిరంజీవి కాబట్టి జనసేన, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను ఏమీ అనకుండా తమాయించుకుంటున్నారు గానీ, టీడీపీ సోషల్ మీడియా ఘాటుగానే స్పందిస్తోంది… సో వాట్, తమ ప్రభుత్వ భాగస్వామి పవన్ కల్యాణ్ అన్న అయితేనేం అన్నట్టుగా నిందిస్తోంది… వాళ్లే కాదు, ఏపీకి సంబంధించిన తటస్థ సెక్షన్ కూడా చిరంజీవి వ్యాఖ్యల పట్ల నెగెటివ్‌గా స్పందిస్తోంది…
Ads
తన వ్యాఖ్యల్లో ప్రధానంగా వ్యతిరేకతను పెంచిన పదం… పక్క రాష్ట్రం అనే పదం… తను పుట్టింది ఆంధ్రా… ఇన్నేళ్లూ తనను ఓ మెగాస్టార్‌ను చేసి, వందలు- వేల కోట్ల ఆస్తుల్ని, వైభోగాన్ని, పదవుల్ని, పురస్కారాల్ని, గౌరవాన్ని ఇచ్చింది తెలుగు ప్రజలు… అనేక కారణాల రీత్యా తెలంగాణ- ఏపీ విడిపోయినా… తను హైదరాబాదులో ఉంటున్నాడు కాబట్టి హఠాత్తుగా చిరంజీవికి ఏపీ పక్క రాష్ట్రం అయిపోయిందా అనేది ప్రధాన విమర్శ…
నిజానికి ఆర్.నారాయణమూర్తి కూడా ఏపీ ప్రభుత్వం సినిమా అవార్డులను పునరుద్ధరించాలని కోరాడు… ఇండస్ట్రీ మొత్తం కోరుతోంది… కానీ చిరంజీవి ఒక రాష్ట్ర ప్రభుత్వ వేదిక మీద మరో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నట్టుగా… ఈ ప్రభుత్వం నుంచి స్పూర్తి తీసుకోవాలని సూచించడం ఏపీ జనానికి చిర్రెక్కించింది…
అవార్డుల విషయమే తీసుకుంటే… పవన్ కల్యాణ్ తన సొంత తమ్ముడే కదా… తను డిప్యూటీ సీఎం… నంది అవార్డుల్ని పునరుద్ధరిస్తే బాగుంటుంది అని తనకే నేరుగా సూచిస్తే సరిపోయేది కదా… రేవంత్ రెడ్డిని ఒకవైపు ప్రస్తుతిస్తూ, అక్కడే ‘ప్రోత్సహించడం నేర్చుకొండి’ అన్నట్టుగా, చంద్రబాబును నిందిస్తున్నట్టుగా తన ప్రసంగం సాగడంతో వచ్చింది అసలు వ్యతిరేకత… ఏపీ ప్రోత్సహించాలని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను అంటూనే రేవంత్ రెడ్డి సినిమా సంకల్పానికి మద్దతుగా, తనేం చెప్పినా చేయడానికి రెడీ అనే తరహాలో… మేమంతా చేదోడువాదోడుగా ఉంటామని ప్రకటించిన సంసిద్ధత కూడా, మరి ఏపీ మాటేమిటి అనే ప్రశ్నను లేవనెత్తింది…
సినిమాలకు ప్రోత్సాహం విషయమే తీసుకుంటే… హైదరాబాద్ భౌగోళికంగా, అన్ని సౌకర్యాలపరంగా, ఓ మెట్రో కల్చర్ సిటీగా సినిమా ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ లొకేషన్… దీంతో పోలిస్తే ఏపీలో ఒక్క వైజాగ్ తప్ప వేరే అనుకూల నగరం ఏదీ కనిపించదు… అక్కడ కూడా రామానాయుడు ఓ స్టూడియో కట్టినా ఈరోజుకూ అక్కడ యాక్టివిటీ ఏమీ ఉండదు… ఇదంతా అననుకూలత… ఇది రియాలిటీ…
ఐనాసరే, ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమాలకు సంబంధించి ఏం తక్కువ చేసింది..? చంద్రబాబు స్వయంగా ఓ మహానటుడి అల్లుడు, ఆయన గ్లామరే తెలుగుదేశాన్ని పుట్టించింది, పెంచింది, నిలబెట్టింది… ఆ కుటుంబం అంతా సినిమాయే… చంద్రబాబు వియ్యంకుడు స్టార్ హీరో… ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం స్వయంంగా ఓ స్టార్ హీరో, ఆయన కుటుంబం నుంచి బోలెడు మంది హీరోలు… ఇదే చిరంజీవి బావమరిది టాలీవుడ్‌ను శాసించే నలుగురిలో ఒకడు… సినిమా వాళ్లదే కదా ఏపీ అధికారం… వాళ్లెందుకు టాలీవుడ్ మీద వివక్ష చూపిస్తారు..?
టికెట్ రేట్ల ధరల్ని అడిగినంత పెంచేస్తారు, బెనిఫిట్ షోలకూ పర్మిషన్లు ఉదారంగా ఇస్తారు… పోనీ, ఎవరైనా స్టూడియోలు కడితే, షూటింగులు చేస్తే, ఏమైనా రాయితీలు అడిగితే ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించలేదా..? అసలు తెలుగు సినిమా పెద్దలు ఆ చొరవ తీసుకుంటే కదా… కేవలం నంది అవార్డులను ముందుపెట్టి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వం వెనకబడిపోయిందనే వ్యాఖ్య సబబేనా..? ఐనా టాలీవుడ్‌ను, వినోదరంగాన్ని శాసించే ప్రముఖలందరికీ హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు… వాళ్లకు ఇదే అడ్డా… ఇదండీ చిరంజీవి వ్యాఖ్యల మీద వినిపించిన విమర్శలు…
ఇదే కదా వేణుస్వామి చెప్పింది... ప్రముఖుల నోటీతీట సమస్యల్ని తెచ్చిపెట్టే పరాభవ నామ సంవత్సరం అని... మొన్న గరికపాటి, నిన్న చిరంజీవి..!!
Share this Article