.
John Kora …. ‘చిరైయా’ (Chiraiya) వెబ్ సిరీస్…
మనది పితృస్వామ్య సమాజం. ఇక్కడ ఆడవాళ్లను మార్చి 8న గొప్పగా పొగిడేసి.. మరుసటి రోజు నుంచే మళ్లీ ఆధిపత్యం మొదలుపెట్టే సమాజం. ఆ మధ్య పింక్ సినిమా వచ్చే వరకు ‘నో మీన్స్ నో’ అనే విషయమే చాలా మందికి తెలియదు.
ఇక పెళ్లైన దంపతుల మధ్య సంభోగానికి కూడా consent ఉండాలన్న సోయి ఎంత మందికి ఉండి ఉంటుంది?. ఆ విషయం ఆడవాళ్లలో కూడా ఎంత మందికి తెలుసు?. భార్య అనుమతి లేకుండా సంభోగం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందన్న ఎరుక ఉన్న మగాళ్లు ఎంత మంది ఉన్నారో నాకైతే తెలియదు. అయితే ఇదే పాయింట్ మీద ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.
Ads
జియో హాట్‌స్టార్‌లో విడుదలైన కొత్త వెబ్ సిరీస్ ‘చిరైయా’.. సమాజంలో ఎవరూ బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని ఒక అత్యంత సున్నితమైన అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. అదే “వైవాహిక అత్యాచారం” … పెళ్లి జరిగినంత మాత్రాన భార్య ఇష్టంతో (Consent) సంబంధం లేకుండా, భర్త బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పు అని చెప్పే ఒక బోల్డ్ ప్రయత్నం ఈ సిరీస్.
ఒక సాంప్రదాయ కుటుంబంలో పెద్ద కోడలి పేరు కమలేష్ (దివ్య దత్తా). ఆమెది ఇంటిని, కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండే ఒక సాధారణమైన ఇల్లాలి మనస్తత్వం. ఇక కమలేష్ మరిది అరుణ్ (సిద్ధార్థ్ షా), పూజ (ప్రసన్న బిష్త్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు అనుకునే లోపు, కొత్త కోడలు పూజ ఒక షాకింగ్ నిజం బయటపెడుతుంది. పెళ్లైన మొదటి రోజే తన భర్త అరుణ్ తన ఇష్టానికి వ్యతిరేకంగా తనపై అత్యాచారం చేశాడని కమలేష్‌తో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మొదట పూజ మాటలను నమ్మడానికి.. కాదు కాదు.. అది తప్పెలా అవుతుందని కమలేష్ తిరిగి పూజనే తిడుతుంది. భార్యాభర్తల మధ్య ఇవన్నీ సహజమే కదా అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, నెమ్మదిగా అసలు నిజం తెలుసుకుంటుంది.
దశాబ్దాలుగా పితృస్వామ్య భావజాలంలో బతికిన కమలేష్, తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకుంది? తన తోటి మహిళకు జరిగిన అన్యాయంపై తన సొంత కుటుంబం మీదే ఎలా తిరుగుబాటు చేసింది? అన్నదే ఈ సిరీస్ కథ. ఇందులో LGBTQ+గురించి కూడా చర్చించారు.
నేను అక్కడక్కడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సీరియల్ టైప్‌లో కాస్త మెలో డ్రామా ఎక్కువైనట్లు అనిపించింది. కానీ ఇలాంటి పాయింట్ మీద వెబ్ సిరీస్ చేయాలని అనుకోవడం గ్రేట్. హిందీలో తీసిన ఈ వెబ్‌సిరీస్ తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
నేను హిందీలో చూశాను. ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూస్తేనే దర్శకుడు ఏం చెప్పాలనుకున్నది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. లేకపోతే ‘సర్వం మాయ’ సినిమా తెలుగు డబ్బింగ్‌లో క్లైమ్యాక్స్ మారిపోయినట్లు మారిపోతుంది.
ఇది 18+ వాళ్లకే అని సర్టిఫై చేశారు. కారణం ఇందులో బెడ్రూమ్ దృశ్యాలు ఉండటమే. కానీ ఆడామగా, పెళ్లైన వాళ్లు, పెళ్లి కాని వాళ్లు.. అందరూ తప్పకుండా చూడాల్సిన సిరీస్.
PS: బాధితురాలు (పూజ) భర్త అత్యాచారాల నుంచి తప్పించుకోవడానికి చేసే పని ఒళ్లు గగుర్పొడుస్తుంది.
Share this Article