.
Subramanyam Dogiparthi ….. Wife is not a servant maid . You are marrying a wife not a maid . నాలుగు రోజుల కిందటే సుప్రీంకోర్టు ఈ హితవు పలికింది . మా తరం వాళ్ళకన్నా ఇప్పటి తరం మగవారు బెటర్ . మాతరంలో మగవారు ఇంటి పనులు చేయడం ఏంటి ? అది ఆడవారి బాధ్యతే అని అప్పటి పెద్దోళ్ళు కూడా మగవారిని , ఆడపిల్లల్ని అలాగే పెంచారు .
గత పాతిక ముప్పై సంవత్సరాల నుండి సమాజంలో కొంత మార్పు వచ్చింది . ముఖ్యంగా పట్టణాల్లో , నగరాల్లో ఆడవారు కూడా మగవారితో సమానంగా ఉద్యోగ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాక ఇంటి పనుల్ని భర్తలు కూడా పంచుకుంటున్నారు . గొప్ప పరిణామమే .
Ads
ఉమ్మడి కుటుంబాలు , బాధ్యత లేని కొడుకులు , కోడళ్ళు కధాంశాలతో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కలేదు . యన్టీఆర్ , సావిత్రి , కన్నాంబ నటించిన కుటుంబ గౌరవం నుండి ఉమ్మడి కుటుంబం , పండంటి కాపురం , సంసారం ఒక చదరంగం దాకా ఎన్ని వచ్చాయో ! ఆల్మోస్ట్ అన్నీ హిట్టయ్యాయి .
కొంత అలాంటి కధాంశమే అయినా ఈ అమ్మకు రాజీనామా సినిమాలో ఫోకస్ ఇంటి ఇల్లాలి మీద . చాలామంది అమ్మల్లాగానే ఈ సినిమాలో అమ్మ పాత్రలో శారద కొడుకులకు , కోడళ్ళకు , మనమరాళ్ళకు ఎలాంటి లోటు రానీయకుండా అన్నీ అమరుస్తూ ఉంటుంది . రిటైరయిన భర్త కూడా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా అనే బేచ్ కావటంతో ఇంటి ఇల్లాలికి భర్త కూడా బాధ్యత లేని బిడ్డే అవుతాడు .
వీళ్ళందరితో విసుగెత్తిపోయిన అమ్మ హఠాత్తుగా రాజీనామా ప్రకటించేస్తుంది . అందరూ ఎవరికి వారి పెత్తనాలతో తమ జీవితాలను ఇబ్బందుల్లో పడేసుకుంటారు . అందరినీ గట్టెక్కిస్తానికి అప్పటికే ఆరోగ్యం పోగొట్టుకున్న అమ్మ కిడ్నీ అమ్మి ఆదుకుంటుంది .
అందరినీ వదిలి ఒక్కతే వెళ్ళిపోవటానికి రైలెక్కిన ఆమెకు భర్త తన పొరపాటు గ్రహించుకుని తోడు ఉండేందుకు బోగీ ఎక్కుతాడు . కానీ , అతను ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటయిపోతుంది . భర్త చేతిలో చనిపోతుంది .
ఈ సినిమా శారదది . సినిమా అంతా ఆమె చుట్టే . ఆమే షీరో . అద్భుతంగా నటించింది . ఇలాంటి భారీ విషాద పాత్రలను వేయటంలో ఆమెకు ఆమే సాటి . అలాగే నటించింది . సత్యనారాయణ పాత్రతో సహా అన్ని పాత్రలూ ఆమె చుట్టూ తిరిగేవే .
సాయికుమార్ , ప్రసాద్ బాబు , కవిత , రజిత , తులసి , బేబీ మానస , బ్రహ్మానందం , బాబూమోహన్ , పాకీజా , అన్నపూర్ణమ్మ , చలపతిరావు తదితరులు నటించారు . చిరంజీవి పోలికలో ఉండే రాజ్ కుమార్ ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యాడు . శ్రీ శాంతి అనే నూతన నటి కూడా పరిచయం అయింది . తర్వాత ఏ సినిమాల్లో నటించిందో తెలియదు .
మూలకధ అశోక్ పటేల్ కు క్రెడిట్ ఇచ్చినా రచన క్రెడిట్ మరలా గణేష్ పాత్రోకి కూడా ఇవ్వబడింది . మరలా టైటిల్సులో కధ , మాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం క్రెడిట్ దాసరి గారికి ఇవ్వబడింది . ఈ సినిమాలోని అమ్మ పాట చాలా పాపులర్ . మదర్స్ డే నాడు ఈ పాటను వేయని చానల్ ఉండదు . ఏదో చానల్లో ఈ సినిమా కూడా రావలసిందే ఆరోజున .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . దాసరి , సిరివెన్నెల పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జేసుదాస్ (టైటిల్సులో అలాగే వేసారు) , మనో , చిత్ర , మిన్ మినీ శ్రావ్యంగా పాడారు . ముఖ్యంగా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ అనే పాట దాసరి మీదే చిత్రీకరించబడింది . కళ్ళు లేని బిచ్చగాడుగా ఈ పాటను పాడుకుంటూ కనిపిస్తాడు .
మరో అమ్మ పాట ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం . చాలా బాగుంటుంది . నేపధ్యంలో వచ్చే చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది , ఇది ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు పాటలు చాలా బాగుంటాయి . రాజ్ కుమార్ , శ్రీ శాంతి మీద చీకటిలో ఆడపిల్ల అంటూ ఓ డ్యూయెట్ ఉంటుంది .
ఈ సినిమాకు విశేషం ఏమిటంటే ముగ్గురు హేమాహేమీలు నిర్మాతలు . ఇంత తక్కువ బడ్జెట్ సినిమాను ముగ్గురు హేమాహేమీలు నిర్మించటం . కె దేవీ వరప్రసాద్ , టి త్రివిక్రమరావు , చలసాని అశ్వనీదత్ . షూటింగ్ ఎక్కువ భాగం విజయవాడలో జరిగింది . అప్సర థియేటర్ కూడా కనిపిస్తుంది…
తెలుగులో విజయం సాధించిన ఈ సినిమా కన్నడంలో అమ్మ టైటిలుతో రీమేక్ చేయబడింది . లక్ష్మి , అనంత నాగ్ , పవిత్ర తదితరులు నటించారు . 1991 డిసెంబర్ చివర్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . సంసారపక్ష శాకాహార సినిమా . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడవచ్చు . ముఖ్యంగా ఇంట్లో ఇక్కడ చీపురు పుల్లని అక్కడ పెట్టని మగ మహారాజులు తప్పక చూడాలి .
ఈ ప్రపంచంలో భార్యలు అందరి కన్నా భర్తలకే ఎక్కువ అవసరం . అదీ వృధ్ధాప్యంలో . కంట్లో eye drops కూడా వేసుకోవడం చేతకాని నాలాంటి భర్తలకు భార్యలు సకలం . అలాంటి అమ్మలకు , భార్యలకు నా ఈ రైటప్ అంకితం . సినిమా ఆఖర్లో అన్నట్లు స్త్రీకి విశ్రాంతి కాకూడదు మరణం . ఆమె జీవించి ఉండగానే కావలసినంత , ఇవ్వకలిగినంత విశ్రాంతిని , ఆదరణని , ప్రేమని ఇవ్వాలి ….. – దోగిపర్తి సుబ్రహ్మణ్యం
Share this Article