.
Mohammed Rafee … జనం నేత జీవన్ రెడ్డి… – 73 ఏళ్ల వయసులో ఆయన వేస్తున్నది మంచి అడుగా, తప్పుటడుగా? తాటిపర్తి జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత అలక వహించారు. ఈనెల 25న పార్టీకి రాజీనామా చేసి కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం! 73 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న సాహసం! (గతంలో పొన్నాల)…
అధికార పార్టీని వదలి వేరే పార్టీ వైపు చూడటం అంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడమే! కొంతమంది అదృష్టం అలాగే ఉంటుంది! ఆయన్ని తప్పు పట్టడం లేదు గానీ, 1983 నుంచి రాష్ట్ర రాజకీయాల చూస్తూ వస్తున్నా! 1992 నుంచి ఇంకా దగ్గరగా చూస్తున్న!
Ads
కొందరు నేతలు తమ పార్టీలో కష్టపడి సేవలు అందిస్తూ ఉంటారు! అధికారంలోకి తీసుకొస్తారు! ఆ తరువాత అసంతృప్తిలో పడిపోతారు! చెలరేగిపోతారు! కాలు దువ్వుతారు! ప్రతిపక్షంలోకి వెళతారు! కొన్నాళ్ళకు చల్లబడిపోతారు! రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతారు!
ఉదాహరణలు పేర్లు అనవసరం కానీ, ఇలా తప్పులో కాలేసి రాజకీయ జీవితాలను తమకు తాము కూల్చుకున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు! ఇప్పుడు అదే జాబితాలో తాటిపర్తి జీవన్ రెడ్డి చేరబోతున్నారా !
అయితే ఇలా పార్టీలు మారిన వారిలో కొందరు అదృష్టవంతులు కూడా ఉన్నారు. వీళ్ళు జంప్ చేయడంలో నైపుణ్యం వున్నవారు! సరిగ్గా చూసి మరీ పదవుల బుట్టలో దూకుతుంటారు! ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసేస్తారు! పదవులు దక్కించుకుంటారు! పార్టీ మారినా తప్పని పరిస్థితుల్లో మారాల్సి వచ్చినట్లుగా చాకచక్యంగా తమకు అనుకూలంగా మలచుకుంటారు! ఎవ్వరు తప్పు పట్టలేని విధంగా మార్చుకుంటారు! దాన్నే రాజకీయం అంటారు!
కొందరు వాపును బలంగా భావిస్తారు! జేజేలను తమ వ్యక్తిగత బలం అనుకుంటారు! అదే భ్రమల్లో ఉండి అందనంత ఎత్తు ఎగిరి ధబీల్మని పడిపోతారు! మళ్ళీ పైకి లేవలేరు! కొందరు మాత్రం పడినా కెరటంలా తిరిగి లేచి నిలబడి సత్తా చాటుకుంటారు! వ్యక్తిగత బలం ఉండొచ్చు కానీ, పూర్తిగా అదే బలం అనుకోవడం వారి అపోహ!
కొందరు నేతలు పార్టీలకు అతీతంగా వారి వారి నియోజకవర్గాల్లో సత్తా చాటుకుంటూనే ఉంటారు! అలా అని ప్రజలను తక్కువ అంచనా వేసిన బలమైన నేతలు కూడా బోల్తా పడినవారు చరిత్రలో చాలామంది ఉన్నారు.
తాటిపర్తి జీవన్ రెడ్డి సీనియర్ నేత! కరీంనగర్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు! రాష్ట్ర వ్యాప్త కరిష్మా లేకున్నా తన ప్రాంతంలో రెండు మూడు నియోజక వర్గాల్లో బలమైన ప్రభావం చూపించగల నాయకుడే!
అందులో సందేహం లేదు! 1983లో తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఆరు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపు బాట పట్టిన నేత! టిడిపి నుంచి నాదెండ్ల ప్రభుత్వంలోకి జంప్ చేశారు! అదో తప్పుటడుగు!
తరువాత కాంగ్రెస్ లోకి జంప్ చేసి వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా బిఆర్ఎస్ బలమైన గాలిని తట్టుకుని గెలిచిన కాంగ్రెస్ నేత!
- ఆ తరువాత ఎన్నికల్లో సంజయ్ చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి గత ఏడాది వరకు కొనసాగారు. అంతకు ముందు కరీంనగర్ నుంచి ఎంపి గా పోటీ చేసి ఓడిపోయారు!
ఎమ్మెల్యే ఎన్నికల్లో అతనిపై గెలిచిన సంజయ్ రేవంత్ రెడ్డికి దగ్గరవడంతో విబేధాలు మొదలయ్యాయి. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో సంజయ్ వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గాన్ని పోటీ చేయించి గెలిపించుకున్నారు! సంజయ్ వర్గం కూడా పోటీ ఇచ్చి ధీటుగా ఆయన కూడా తన సత్తా చాటుకున్నారు.
ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఘోర అవమానంగా భావించారు. “పార్టీ ఇంతగా అవమానిస్తున్నప్పుడు ఎందుకు ఉండటం, పార్టీ మారదాం” అని తన కుమారులే అంటున్నారని మొన్న రాయబారం నడిపిన మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ లతో స్వయంగా జీవన్ రెడ్డి చెప్పేసి దండం పెట్టి సారీ అనేసారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బిఆర్ఎస్ లోకి జంప్ చేస్తున్నారు. మరో వైపు బిజెపి కూడా ఎదురు చూస్తోంది!
- నిజానికి 73 ఏళ్ల వయసులో అధికార పార్టీని వదులుకోవడం అనేది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది! ఆయన సీనియర్ నేత! పార్టీలో ఎంతటి వారికైనా టైమ్ బాగా లేనప్పుడు ఒక్కోసారి అవమానాలు జరుగుతుంటాయి! వాటిని తట్టుకుని నిలబడాలి! (ఇది కాంగ్రెస్, మహా సముద్రం, ఎవరెవరో వస్తుంటారు- పోతుంటారు నాయకులు… బలంగా నిలబడేవాడే నాయకుడు…)
ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి! అధిష్టానం పట్టించుకోలేదంటే ఆయన నిజమైన జన బలం తగ్గినట్లు అంచనా! ఏ పార్టీ కూడా బలమైన నేతను వదులుకోదు! అప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులను, పీసీసీ అధ్యక్షుడినే పంపించారంటే జీవన్ రెడ్డికి పార్టీలో సీనియర్ నేతగా గౌరవం చూపించినట్లే! అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి నేరుగా రేవంత్ రెడ్డిని కలవాలి!
- తన సమస్య చెప్పుకోవాలి! అందులోంచి అధిగమించాలి! అధికార పార్టీని వదులుకుని ఎప్పుడో మూడేళ్లకు అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పార్టీలోకి ఈ వయసులో జంప్ చేయడం ఇంకాస్త ఆలోచించి చేయాల్సిన విషయమే! ఇక్కడే ఉండి తనకు కావాల్సింది తాను చేజిక్కించుకుంటే ప్రస్తుత అధికార రాజకీయాల్లో ఆయన హవా అలాగే ఉంటుంది! (ఒక్కసారి బీఆర్ఎస్‌లోకి వెళ్తే కేటీయార్, హరీష్ రావులకు అనుచరుడిగా మారాలి, అంతకన్నా తన సుదీర్ఘ కెరీర్‌కు అవమానం ఏముంటుంది..?)
కానీ, ఆయన తాటిపర్తి జీవన్ రెడ్డి! ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం వున్న నాయకుడు! తనకు నచ్చిందే చేస్తారు! ఎవ్వరి మాట వినరు! ఎక్కడా రాజీ పడరు! ఆయన జనం మనిషి! ప్రజల నాయకుడు! అలుపెరుగని దిగ్గజ నేత! ధైర్యం చేస్తున్నారు! ఆ అడుగు మంచిదా, తప్పటడుగా అనేది భవిష్యత్ చెబుతుంది!
– డా. మహ్మద్ రఫీ
Share this Article