( గోపు విజయకుమార్ రెడ్డి ) ….. మార్కెటింగ్‌లో అత్యంత క్లిష్టమైన, సవాళ్లతో కూడిన రంగం ఏదైనా ఉంటే, అది FMCG (Fast Moving Consumer Goods) సెగ్మెంట్… ఈ రంగంలో చాలా చిన్న మార్జిన్లతో పెద్ద పెద్ద వాల్యూమ్స్‌పై గేమ్ నడుస్తుంది. ముఖ్యంగా మన భారత మార్కెట్‌లో మధ్యతరగతి వినియోగదారుల మైండ్‌సెట్ చాలా ప్రైస్ సెన్సిటివ్‌గా ఉంటుంది — ఇది ఈ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తుంది….
ఎన్నో బ్రాండ్లు వేల కోట్ల టర్నోవర్ సాధించినప్పటికీ, కనీస ధర ఒక్క రూపాయి నుంచే ప్రారంభమవుతుంది. దానికి మంచి ఉదాహరణగా చిక్ షాంపూ (Chik Shampoo) ను తీసుకోవచ్చు. క్లినిక్ ప్లస్ (Clinic Plus), హెడ్ అండ్ షోల్డర్స్ (Head & Shoulders) వంటి పెద్ద బ్రాండ్స్‌తో పోటీ పడుతూ కూడా ఈ బ్రాండ్ మార్కెట్‌లో నిలబడగలిగింది. దానికి ప్రధాన కారణం కంపెనీ ప్రవేశపెట్టిన ఒక రూపాయి సాషే ప్యాకెట్…
అలాగే ఈ ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు నంబర్ వన్‌గా నిలుస్తారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఉదాహరణకు HUL (Hindustan Unilever Limited) అనే పేరు చూసినప్పుడు ఇది భారతీయ కంపెనీ అనిపించినా, వాస్తవానికి ఇది ఒక బ్రిటిష్ సంస్థ. అయినప్పటికీ, ఇప్పటికీ ఇది భారతదేశంలో నంబర్ వన్ FMCG కంపెనీగా కొనసాగుతోంది.అలాగే అమెరికన్ కంపెనీలు అయిన Pepsi, Coca-Cola వంటి బ్రాండ్లు కూడా భారత మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించాయి.
Ads
కానీ ఇంతటి భారీ పోటీ మధ్యలో కూడా, గ్లోబల్ బ్రాండ్స్‌ను ఎదుర్కొని విజయాన్ని సాధించిన కొన్ని భారతీయ బ్రాండ్ల కథలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన బ్రాండ్ స్టోరీస్‌ని ఒకసారి చూద్దాం.
Haldiram’s ~₹85,000 కోట్లు,
Bikaji ~₹15,000 కోట్లు,
Balaji Wafers ~₹40,000 కోట్లు.
ఈ బ్రాండ్లు తమ మార్కెట్ షేర్‌తో Lay’s, Kurkure వంటి గ్లోబల్ బ్రాండ్స్‌కు గట్టి పోటీ ఇస్తూ, ఇప్పుడు తామే గ్లోబల్ స్థాయికి ఎదుగుతున్నాయి.
- ఎక్కడో బికానేర్‌లో హల్దిరామ్ అగర్వాల్ (Ganga Bishan Agarwal Original Name ) స్థాపించిన శతాబ్ద కాలం చరిత్ర కలిగిన బ్రాండ్… తరువాత అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరిగాక, తమ్ముడు స్థాపించిన మరో బ్రాండ్ Bikaji. ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువ ఇప్పుడు కలిపి చూస్తే దాదాపు ఒక లక్ష కోట్లు దాటింది.
ఇక మరో వైపు… రాజ్‌కోట్‌లో చిన్న స్థాయిలో చిప్స్ తయారు చేసే సంస్థగా ప్రారంభమైన Balaji Wafers, ఈరోజు ₹40,000 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది.
అసలు ఈ బ్రాండ్ల విజయ రహస్యం ఏమిటి?
ఇవి మార్కెట్‌లో తమను ఎలా పొజిషన్ చేసుకున్నాయి?
ఇక్కడ ఒక్కో బ్రాండ్‌కి ఒక్కో విజయ రహస్యం ఉంది. Haldiram’s ప్రయాణం ఒక చిన్న మిఠాయి షాప్‌తో ప్రారంభమై, నమ్‌కీన్ ప్రపంచంలో పెద్ద స్థాయికి ఎదిగింది.
వారి ప్రధాన బలం —
• గ్రామీణ మార్కెట్‌పై ఫోకస్
• రిటైలర్లకు అనుకూలమైన వ్యాపార విధానం (మల్టీనేషనల్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ మార్జిన్లు, ఎక్కువ క్రెడిట్ డేస్)
• రుచి విషయంలో స్థిరత్వం
• మోడర్న్ ట్రేడ్ (సూపర్, హైపర్ మార్కెట్లు) కంటే ఎక్కువ రిటైల్ ప్రెజెన్స్
• టార్గెట్ ఆడియన్స్: మధ్యతరగతి, తక్కువ మధ్యతరగతి
Bikaji అయితే కొంచెం మోడ్రన్ దృక్పథంతో ముందుకొచ్చింది…
చాలా తెలివిగా Haldiram’s లేని స్పేస్‌లోకి ప్రవేశించింది.
• మోడర్న్ ట్రేడ్‌కు అనుకూలంగా బ్రాండ్ పొజిషనింగ్.
• ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి.
• బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు అమితాబ్ బచ్చన్ వంటి ఐకాన్‌ను బ్రాండ్ అంబాసడర్‌గా తీసుకోవడం.
ఇక Balaji Wafers కథ పూర్తిగా వేరే లెవల్…
“ముందు ఇంట గెలిచి, తర్వాత రచ్చ గెలవాలి” అన్నట్లు —
మొదట గుజరాత్‌లోనే తమ ఆధిపత్యాన్ని స్థాపించింది.
• గుజరాత్‌లో బ్రాండెడ్ ప్యాక్డ్ స్నాక్స్‌లో దాదాపు 65% మార్కెట్ షేర్.
• Lay’s, Kurkure వంటి బ్రాండ్స్‌కి గట్టి పోటీ.
• అసలు సక్సెస్ మంత్రం: ₹5, ₹10 ప్యాక్స్.
• మొదట గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్.
• తర్వాత మెల్లగా మెట్రో నగరాలు, ఇతర రాష్ట్రాలకు విస్తరణ.
ఈ మూడు విజయ గాథల్లో మన భారతీయ వినియోగదారుల మైండ్‌సెట్ స్పష్టంగా కనిపిస్తుంది. పర్సనల్ కేర్ ( పర్సనల్ కేర్ అంటే షాంపూలు, సబ్బులు, పౌడర్లు) వంటి విషయాల్లో మన ఎంపిక విదేశీ బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతుంది. కానీ తినే పదార్థాల విషయంలో మాత్రం స్థానిక బ్రాండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తాం
అయితే… ఇంత విజయాన్ని సాధించిన ఈ మూడు బ్రాండ్లు కూడా ఇప్పటికీ దక్షిణ భారత మార్కెట్‌లో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. దానికి ప్రధాన కారణం- రుచిలో తేడాలు.
ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో ఆలుగడ్డ వినియోగం తక్కువగా ఉండటం, ఆర్యన్–ద్రావిడియన్ కథ ఇది…
Share this Article