Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో కాల్డ్ కాంగ్రెస్ సీనియర్లు..! ఏదేదో మాట్లాడేస్తున్నారు..!!

March 27, 2026 by M S R

.

కాంగ్రెస్ పార్టీలో నన్ను తొక్కారు, అవమానిస్తున్నారు, అందుకే పార్టీని విడిచిపెడుతున్నా… అని జగిత్యాలలో జీవన్ రెడ్డి కార్యకర్తల భేటీలో ఆవేశంగా ప్రసంగిస్తున్న తీరు చూస్తుంటే… అనుకోకుండా వి.హనుమంతరావు అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడుతున్న మరో వీడియో కనిపించింది…

పాపం, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అనిపించింది… హనుమంతరావు వయస్సు 77 ఏళ్లు, జీవన్‌రెడ్డి వయస్సు 73 ఏళ్లు… రాజకీయం చేయడానికి గరిష్ట వయోపరిమితి ఉండాలని కాదు, కనీసం ఏం మాట్లాడుతున్నామో సోయి అవసరం కదానేది ప్రశ్న… సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా బలంగా ఎన్నికల్లో వోట్లు పొంది, పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన స్థితిలో… రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు చేజేతులా కేసీయార్ పాలుచేశారు తెలంగాణను రాజకీయంగా…

Ads

కేసీయార్ తొక్కుతుంటే, పార్టీని కకావికలం చేస్తుంటే, పీలికలు చేస్తుంటే ఒక్క సీనియరూ ధాటిగా ఎదుర్కోలేక… నిలబడలేక… ఒకరకంగా చేతులెత్తేశారు… ప్రస్తుతం 79 ఏళ్ల వయస్సున్న జానారెడ్డితో సహా..!

జీవన్‌రెడ్డి దగ్గరకు వద్దాం… ఇది కాంగ్రెస్.., వేరే పార్టీల నుంచి నాయకులు వస్తుంటారు, పోతుంటారు.., అన్ని తొక్కుళ్లను, ఒత్తిళ్లను తట్టుకునేవాడే నిలబడతాడు… ఇది నా అడ్డా, నేనొక్కడినే తప్ప ఇంకెవరినీ ఇక్కడికి రానివ్వను అనే ధోరణి కాంగ్రెస్‌లో కుదరదు… పోనీ, తను పుట్టుకాంగ్రెసా అంటే అదీ కాదు, తను ఫస్ట్ టీడీపీ… తనకు మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీయార్‌కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల కేబినెట్‌‌లోనూ మంత్రిగా చేశాడు…

పోనీ, అజేయుడా..? అనేకసార్లు ఓడిపోయాడు… ఏ సంజయ్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ, పార్టీని వీడుతున్నాడో… అదే సంజయ్ చేతిలో రెండుసార్లు ఓటమి… ఎంపీ ఎన్నికల్లో ఓటమి… పార్టీ గుర్తింపు ఇవ్వకపోతే ఇన్నేళ్లుగా పదే పదే అవకాశాలు ఎలా వస్తున్నాయి మరి..? సరే, ఆయన్నలా వదిలేస్తే హనుమంతరావు ఓ చిత్రమైన కేరక్టర్…

vh

ఒవైసీ, నువ్వు బెంగాల్‌కు ఎందుకు వెళ్తున్నావు పోటీకి..? నువ్వు ముస్లింవు అయిఉండీ సెక్యులర్ వోట్లను చీల్చడానికి పోతున్నావా..? ఇది బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లకు మేలు చేయడం కాదా అంటున్నాడు ఏదో వీడియోలో… సరే, ఇక్కడి వరకూ పొలిటికల్ విమర్శ వోకే అనుకుందాం కాసేపు… కానీ మజ్లిస్, కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణలో మిత్రపక్షాలు, ఆ సోయి ఎటుపోయింది..?

పైగా ముస్లింలను బంగ్లాదేశ్‌కు పంపిస్తున్నారు అక్కడ, ఇండియన్ ముస్లింలను కూడా బంగ్లాదేశ్ పంపించేస్తున్నారని నాకు సమాచారం ఉంది అంటున్నాడు హనుమంతరావు… నవ్వు తెప్పించింది… పైగా ముస్లింల హక్కుల్ని రక్షించేది మమత, ఆమెను బాగా సఫర్ చేస్తున్నారు, నువ్వు వెళ్లి ఆమెకు నష్టం తెప్పిస్తావా అనడుగుతున్నాడు…

అచ్చం, టీఎంసీ కార్యకర్తలా మాట్లాడుతున్న హనుమంతరావుకు… ఆమె ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిందనే నిజం గుర్తులేదో, తెలియదో… పైగా ఇండియన్ ముస్లింలను కూడా బంగ్లాదేశ్ పంపించేస్తున్నారట, తనకు సమాచారం ఉందట… వదిలేస్తే, హఠాత్తుగా వెళ్లి టీఎంసీ జెండా పట్టుకుని, కోల్‌కతా వీథుల్లో తిరిగేట్టు ఉన్నాడు… అడిగితే కాంగ్రెస్‌లో ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు, అంత స్వతంత్రం ఉంది కదా అంటాడేమో…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ధాటికి చెల్లాచెదురైన కాంగ్రెస్‌కు కాస్త ఊపిరి పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి… బొచ్చెడు సీనియర్ గళాలు, కేరక్టర్లు తనకు అడ్డుపడి, ఎదగకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, అన్నీ దాటేసి, కాంగ్రెస్‌కు ఓ వైభవ దశను తీసుకొచ్చాడు వైఎస్… తరువాత కేసీయార్ చేశాడు కాంగ్రెస్‌ను చెల్లాచెదురు…

ఆ దశలో కాంగ్రెస్‌కు మళ్లీ ఊపిరి పోసింది రేవంత్ రెడ్డే… తననూ అడుగడుగునా అడ్డుకోవడానికి, దింపడానికి సోకాల్డ్ సీనియర్లు ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తారు కూడా… అన్నీ బ్రేక్ చేసుకుని వెళ్లేవాడే కాంగ్రెస్‌లో నెగ్గుకొస్తాడు… అంతేతప్ప జీవన్‌రెడ్డి వంటి నేతల శాపాలకు ఉట్లు తెగవు… ఈ నిజం సోకాల్డ్ సీనియర్లకే ఎక్కువ తెలుసు… రేవంత్‌రెడ్డికన్నా ఎక్కువగా..!! చివరగా... వయస్సుకూ రాజకీయ పరిణతికీ సంబంధం ఉండదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోటాపోటీగా తాయిలాలు… రాజకీయాల్లో మాత్రం వెకిలి కూతలు…
  • కాషాయం వదిలేసిన పులిబిడ్డ … తమిళ జాతీయవాదానికి సై…
  • సో కాల్డ్ కాంగ్రెస్ సీనియర్లు..! ఏదేదో మాట్లాడేస్తున్నారు..!!
  • అనేకానేక ‘మొగుడు’ సినిమాల్లో… ఇతడు ఈవీవీ మార్క్ ‘దొంగ మొగుడు…
  • ప్రతి పదమూ ఓ మంగళ వాయిద్యంగా వినిపించే పెళ్లి మురిపెం..!!
  • ఇండియా తొలి ప్రైవేటు శాటిలైట్ టీవీకి ఎన్నెన్నో పురిటినొప్పులు..!!
  • పెట్రో పానిక్ – చమురు పరుగులు…! మూసీపై మాత్రం ఏడుపులు..!!
  • హుందాగా సౌత్ ఇండస్ట్రీ ప్రశంసలు… కుళ్లుతో నిశ్శబ్దంగా బాలీవుడ్…
  • FDC కి సారథే లేడు..! ఢిల్లీలో స్టాల్ దేనికి..? ఏముందని..?
  • ఈ చమురు పాలిటిక్స్‌ను యండమూరి 1978లోనే చెప్పాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions