.
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి… మురారి సినిమాలోని ఈ పాట గురించి రాస్తే ఒకరిద్దరు మిత్రుల వ్యాఖ్య ఏమిటంటే..? జగదానంద కారకా అంతకన్నా హిట్ కదా, అలనాటి రామచంద్రుడి పాట కేవలం ఓ పెళ్లి మురిపెమే కదా, రాములోరి పెళ్లికి సంబంధం ఏముంది అని..!!
అవును, మురారిలోని పాట రాములోరి పెళ్లి గురించి కాదు, కానీ ఇంట్లోనూ, ప్రతి పెళ్లి క్యాసెట్లలోనూ మారుమోగిన పాట… కల్యాణము చూతము రారండి అనే పాట అప్పట్లో ప్రతి ఇంటా, ప్రతి కల్యాణ వేదికపైన, ప్రత్యేకించి రామనవమి కల్యాణోత్సవాల వేదికలపైన, పదే పదే కోట్లసార్లు పాడబడిన పాట…
Ads
నిజమే, అలనాటి రామచంద్రుడికన్నింట సాటి అనే పాటకూ సీతారాముల కల్యాణానికీ సంబంధం లేదు… కానీ అది జనంలోకి బలంగా, ఆత్మీయంగా వెళ్లింది… ప్రతి రామనవమి రోజున టీవీల్లో, గుళ్ల మైకుల్లో వినిపిస్తూ జనం చెవుల తుప్పు వదిలిస్తుంది… కారణం, తెలుగుతనం, తెలుగు పెళ్లి సంబరం, క్యాచీ ట్యూన్, సరళమైన పదాలు, సిరివెన్నెల లిటరరీ మెరుపులు ఎట్సెట్రా…
కానీ జగదానంద కారకా పాట కూడా తక్కువేమీ కాదు… అదీ రామనవమి వేడుకల సందర్భంగా మైకుల్లో బాగా వినిపించే పాటే… కారణం క్యాచీ ట్యూన్… దీనికీ సీతారాముల కల్యాణానికీ సంబంధం లేదు… రాముడు రావణవధ, అరణ్యవాసం తరువాత తిరిగి అయోధ్యకు రావడం, పట్టాభిషేకం చేసుకోవడం… ఇదీ సందర్భం…
బాపు అద్భుతంగా చిత్రించాడు ఈ సీన్లను… కళాత్మకంగా, కలర్‌ఫుల్‌గా… ప్రత్యేకించి అయోధ్య వీథుల్లో గజవాహనం మీద ఊరిగింపుగా వస్తున్న సీన్… ప్రజలు తమ ఆరాధ్యుడి రాకను స్వాగతిస్తూ కోలాటాలు ఆడుతున్న కోలాహలం… ఆనందపు కలకలం…
బాలు గళం, ఇళయరాజా స్వరం, బాపు దృశ్యం… మంచి క్యాచీ పల్లవి… జగత్తును ఆనందంగా ఉంచేవాడా, జయహో, జానకి ప్రాణనాయకా జయహో… శుభస్వాగతం, మా ప్రియపరిపాలకా అని స్వాగతించడం…
మంగళకరమౌ నీరాకl, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా, నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక… అని జనం ఆకాంక్షను వివరిస్తాడు కవి జొన్నవిత్తుల…శుభమస్తు, విజయోస్తు వంటి ఆశీస్సులకు తెలుగు అర్థాలు విజయం కలుగుగాక, శుభం కలుగుగాక అన్నట్టు కదా… ధర్మపాలకుడు తిరిగి వచ్చాడని, ఇక జనం తమకు తామే ఆశీస్సులు కురిపించుకుంటారు, అందుకని పాటలో ఈ ‘గాక’లన్నీ భలే నచ్చుతాయి…
ఐతే జొన్నవిత్తుల తను మంచి రచయితే గానీ, చరణాల్లోకి వచ్చేసరికి పాండిత్య ప్రకర్షలోకి వెళ్లిపోయాడు… సగటు పామర ప్రేక్షకుడికి మింగుడుపడవు అవి…
రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే, రామ శాసనము తిరులేనిదని జలధి గోధ చేసే, రామదర్శనము జన్మధన్యమని రాయికూడ తెలిపే, రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే, రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సందాయకం, రామనామమే అమృతం శ్రీరామకీర్తనం, సుకృతం… అంటూ ఎటెటో వెళ్లిపోతుంది పాట…
నిజానికి ఏ భక్తి పాటైనా సరళంగా, సూటిగా ఉంటేనే జనంలోకి వెళ్లేది… ఒక రామదాసు, ఒక అన్నమాచార్య గేయాలు అందుకే చిరస్మరణీయమయ్యాయి… చిర ఆలాపనలయ్యాయి… అలనాటి రామచంద్రుడి పాటలో భావగర్భితమైన సరళత, లాలిత్య దాని బలం…
- అయ్యా, నువ్వొచ్చావు, మమ్మల్ని పాలించు, నీ ధర్మపాలన మీద మాకు ఆశలున్నాయి, నీ పాలన చిరస్థాయిగా నిలిచిపోవుగాక అన్నట్టుగానే పాట మొత్తం సాగితే, అది బాలు గళం నుంచి పరుగులెత్తితే… ఈ పాట మరింత బాగా, మరింత బాగా శ్రావ్యతను, అర్థాన్ని, పరమార్థాన్ని ప్రోది చేసుకుని ఉండేది..!!
Share this Article