Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…

April 1, 2026 by M S R

.

Devi Prasad C …… 90వ దశకంలో ఓరోజు మద్రాస్ లో అసోసియేట్‌ డైరెక్టర్ గా “వేటూరి” గారి చేత పాట రాయించుకోవటానికి “విజయా గార్డెన్స్” కి వెళ్ళాను. అప్పట్లో అక్కడ “రాజ్‌కోటి” గార్ల కంపోజింగ్ రూమ్ కి పక్కగా వేటూరి గారికో రూమ్ ఉండేది. చాలామంది దర్శకుల అసిస్టెంట్స్, కో డైరెక్టర్స్ అక్కడ పరిచయమయ్యేవారు. వారి వారి సినిమాల తాలూకు విషయాలు చెప్పేవారు.

ఇప్పటి సీనియర్ జర్నలిస్ట్ “నాగేంద్రకుమార్” గారితో ఘంటసాల గారి పాటలో పద్యాలో పాడించి ఆనందించేవారు వేటూరి గారు. ఎవరిలోని టాలెంట్‌ని గుర్తించినా వచ్చినవారందరితోనూ పదేపదే వారి గురించి చెబుతుండేవారు. కీరవాణి గారి గురించి మహా గొప్పగా చెప్పేవారు.

Ads

వేటూరి గారు ఎక్కడికైనా వెళితే విజయా గార్డెన్స్ అంతా ఓచుట్టు తిరిగొచ్చేవాళ్ళం. ఓ చోట చిరంజీవి గారు,మరోచోట కృష్ణ గారు, ఒకరేమిటి తెలుగు, తమిళ, మళయాళ హీరోలు హీరోయిన్స్ తో ఒక్కోచోట పాటలకు స్టెప్పులు వేస్తుంటే, విజిల్ సౌండ్స్ తో కోలాహలంగా షూటింగ్స్ జరుగుతుండేవి గార్డెన్ అంతా. మరోపక్క రెండు రికార్డింగ్ థియేటర్స్ లో పాటల రికార్డింగ్స్ సందడి.

నేను వేటూరి గారి గదిలోకి వెళ్ళి నమస్కారం పెట్టి రెండు పదిహేను వేల రూపాయల కట్టలు తీసి టేబుల్ పైన పెడితే ఆయన నవ్వుతూ ఎప్పుడూ తన చేతిలో వుండే క్యాష్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో పెట్టుకున్నారు.
అప్పటికే అందులో మరో మూడు కట్టలున్నాయి. అప్పటికి నెలకి నాలుగు వేలు జీతం తీసుకునే నాకు అబ్బా ఎంత డబ్బు! అనిపించింది. ఒక పాటకి 15 వేలు తీసుకుంటున్నారప్పటికి.

  • అప్పట్లో కొందరు నిర్మాతలు ఆయన రాయవలసిన అన్ని పాటలకూ ముందే డబ్బు ఇచ్చేసేవారాయనకి. ఎప్పుడూ బిజీనే ఆయన. కానీ ఎందుకో తెలియదు గానీ ఆ సమయంలో ఆయన ఇంకా అప్పుకోసం ప్రయత్నించటం ఆశ్చర్యమనిపించేది. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా.

“మనిషిని నడిపించే ఇంధనం ధనమే నాయనా” అనే సినిమా డైలాగ్ కూడా గుర్తొచ్చేది నాకు. ఎంతటివారినైనా “డబ్బు” నవ్వించగలదు, కవ్వించగలదు, ఏడిపించగలదు అనుకుంటా.

“నాయనా, తేనామ్‌పేట వరకూ వెళ్ళొద్దామా” అన్నారు వేటూరి గారు.”అయ్యో, ప్రొడక్షన్‌ కారు నేను దిగి పంపించేశాను, రమ్మని ఆఫీస్ కి ఫోన్ చేస్తాను సర్”అంటే ఒద్దు ఆటోలో వెళ్ళొచ్చేద్దామన్నారు.

అప్పుడెందుకో ఆయన సొంత కారు లేదు. కుర్రాడిని పిలిచి ఆటో తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. ఆటో డ్రైవర్‌కి 40 ఏళ్ళ లోపు వయసుంటుంది. నీట్‌గా ఉన్నాడు. నుదుటన విభూతి వుంది. ఆటోలో ఎక్కాము.
ఆటో వెనుక సీట్లో “కుముదం”లాంటి తమిళ వారపత్రికలు కొన్ని ఉన్నాయి.

ముందున్న అద్దానికి పదేళ్ళలోపున్న ఇద్దరు ఆడపిల్లల బ్లాక్&వైట్ ఫోటో అంటించి వుంది. వేటూరి గారు అడిగితే తన పిల్లలనీ, బాగా చదువుతారనీ మొహం వెలిగిపోతూ చెప్పాడు డ్రైవర్. తను మాత్రం 9 వరకే చదివానన్నాడు.

అతని ముందు ఓ ప్రక్కన తాడుతో కట్టేసి వున్న ఓ చిన్న ట్రాన్సిస్టర్‌ని చూసి వేటూరి గారు పనిచేస్తుందా అంటే “సూప్పరా వేలసెయ్యుదు సార్” అని ఆన్ చేశాడు. అందులో “మూక్కుత్తి పూమ్మేలే కాత్తు ఉక్కాందు పేసుదమ్మా” అనే తమిళ పాట వొస్తుంది.

మేము తెలుగువాళ్ళమని అర్ధమైంది గనుక ఆ పాటకి అర్ధాన్ని తేలికైన తమిళంలో మాకు వివరించి చెప్పటానికి ఆ డ్రైవర్ ప్రయత్నిస్తుంటే ముచ్చటగా నవ్వుతూ వింటున్నారు వేటూరి గారు.
” ముక్కు పుడక మీద గాలి కూర్చొని మాట్లాడుతుంది”అని ఆ పల్లవి అర్ధం. పాట ఎక్స్ప్రెషన్ బాగుంది నాయనా అన్నారు వేటూరి గారు.

“ముక్కుపుడక ఆ మూతి విరుపుకే తళుక్కుమంటుంటే” అని భలేకృష్ణుడు సినిమాలో “ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి” అనే పాటలో మీరు రాసిన లైన్స్ గుర్తొచ్చాయి సర్ అంటే “ఏమో నాయనా నాకన్ని పాటలూ గుర్తుండవు” అన్నారు.
మా మాటల్లో ఆటోలో వున్నది సాధారణ వ్యక్తి కాదని అర్ధమైంది డ్రైవర్‌కి.

తేనాంపేట వెళ్ళాక ఆటో ఓ వీధిలో ఆపి, ఓ వ్యక్తి పేరు చెప్పి, ఆ దూరంగా వున్న నల్ల గేటు లోపలికి వెళ్ళి అక్కడ ఉండే అతనికి నేనిమ్మన్నానని చెప్పి, ఇచ్చి రమ్మని బ్యాగ్‌లో నుండి మూడు కట్టలు తీసిచ్చారు. నేను వెళ్ళి ఆ డబ్బు అతనికి ఇచ్చి వచ్చి ఆటో ఎక్కాను.

“నాయనా మీకభ్యంతరం లేకపోతే మౌంట్‌రోడ్ లో తెలుగువాళ్ళ హోటల్ ఒకటుంది. భోజనం బాగుంటుంది. అక్కడ భోజనం చేసి వెళ్దామా” అని డ్రైవర్‌ని సైతం అడిగారు.
హోటల్ పేరు గుర్తు లేదు గానీ కిటకిటలాడుతుంది జనంతో.

డ్రైవర్ మీరు తినేసి రండి సార్ అన్నా ఒప్పుకోక నువ్వూ రా నాయనా అని తీసుకొచ్చారు.
వేటూరి గారిని చూసి ఎవరో వచ్చి ఓ టేబుల్ రెడీ చేశారు. డ్రైవర్ వేరే టేబుల్ లో కూర్చుంటానంటే కాదని మాతోపాటే కూర్చోబెట్టారు.
తన కోసం వచ్చే అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ని రకరకాల హోటల్స్ కి తీసుకెళ్ళి రుచికరమైన భోజనం పెట్టించి ఆనందించటం వేటూరి గారి అలవాటు.

ఆటో డ్రైవర్ వేటూరి గారిని చూపిస్తూ నాతో “సార్… అయ్యా యంగల్ కన్నదాసన్ అయ్యా మాదిరి ఎళుత్తాళరా”(కన్నదాసన్ ప్రసిద్ధ తమిళ గేయరచయిత) అని చేతులతో నమస్కరిస్తూ అడిగితే… నేను అవుననటం విన్నారు వేటూరి గారు.
తిరిగి విజయా గార్డెన్స్ కి వెళ్ళాక వేటూరి గారు మూడు వంద రూపాయల నోట్లు ఇచ్చి తీసుకోమన్నారు ఆటో డ్రైవర్‌ని.

” మా కన్నదాసన్ గారిలా మీరూ గొప్ప కవి గారు, నా ఆటోలో ఎక్కటమే నా భాగ్యం . నాకు భోజనమూ పెట్టించారు. నాకు ఎక్కువ డబ్బులు వద్దయ్యా” అని తమిళంలో అంటూ నమస్కారం పెట్టాడు అతను.
“నిన్ను చూస్తుంటేనే అర్ధమవుతుంది నీకే చెడు అలవాట్లు లేవని. నీ భాషాభిమానానికీ , నీ సాహిత్యాభిలాషకీ ఇస్తున్నానయ్యా… పిల్లలని బాగా చదివించు” అని అతనికి డబ్బిచ్చారు వేటూరిగారు.

కామమ్మ మొగుడు అంటే వాడెవడో కామోసు అనుకున్నాడన్నట్లు మీరు జ్ఞాని అంటే నిజమే అనేసుకొని నోటికొచ్చింది మాట్లాడేస్తున్నవారున్న సమాజంలో….
వేటూరి గారు ఎంతటి గొప్పవారో, ఎంతటి జ్ఞాన సంపన్నుడో ఎంతటి కరుణామయుడో అందరికీ తెలిసినా ఆ విషయం ఆయనకు మాత్రం తెలియనే తెలియదు. అంత నిగర్వి ఆయన. _______ దేవీప్రసాద్.

వేటూరి
(నేనెప్పుడో గీసుకున్న ఆ మహనీయుని నీటిరంగుల చిత్రం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…
  • విద్వేష బిల్లుపైనా అదే పింక్ విషం..! సుప్రీం చెప్పిందేమిటో తెలుసా…!!
  • జనగణనలో ‘సహజీవనాని’కీ గుర్తింపు… కానీ అది పెళ్లి సర్టిఫికెట్ కాదు…
  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…
  • కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions